పుస్తక సమీక్ష: 'ఆడది' ఆలోచనాత్మకం

తమిరిశ జానకి 'ఆడది' కథా సంపుటి పైన యడవల్లి శైలజ రాసిన సమీక్ష 

Yadavalli Sailaja reviews Timirisa janaki short stories

ముఖచిత్రం ప్రధాన ఆకర్షణగా నిలిచే పుస్తకాలు అరుదుగా ఉంటాయి.  అటువంటిదే ఈ ' ఆడది ' కథల పుస్తకం.  పరికించి చూస్తేగాని అర్థంకాదు మనకు అమ్మాయితో పాటు పాపాయిని ఎత్తుకున్న అమ్మ కూడా ఉంటుందని.  ఇప్పుడు ముఖచిత్రం ప్రస్తావన ఎందుకంటే నేటి యువతి రేపటి అమ్మ, రేపటి అమ్మ కాబోయే బామ్మ స్త్రీ రూపాంతరం చెందే పరిణామ క్రమం స్పష్టంగా మన కనులకు గోచరిస్తుంది. 

ముందుమాటలు లేకుండా ఉన్న పుస్తకం కూడా ఇదేనేమో బహుశా!  అతివలు రాసిన పుస్తకాలకు ముందుమాట రాయమని కోరడం  అవసరమా ? సాహితి ప్రపంచానికి ఒక కొత్త తొవ్వను చూపించారు రచయిత్రి తమిరిశ జానకి.  గర్వించదగిన విషయమిది.

కులం, మతం ఈ సమాజంలో మర్రిచెట్టు ఊడల్లా పాతుకుని పోయినట్లే ఆడ, మగ అనే లింగ వివక్షత కూడా పాతుకుని పోయి ఉంది.  ఒక పక్క పొగడ్తలతో ఆమెను ముంచెత్తుతూనే అధో పాతాళంలోకి అణగ తొక్కేసే సమాజం ఇప్పుడు మనకళ్ళ ముందు కనబడుతున్నది.  ' ఆడది '  కథల పుస్తకంలో ప్రతి కథ మహిళల  ప్రతిబింబంగా అగుపడుతుంది.  పుస్తక శీర్షిక అయిన ఆడది కథలో  ' ఆడపిల్ల అంటే చులకన భావనతో పెంచిన,  పెరిగిన ఒక అతివ కథ కలలను కాలరాసి బాల్య వివాహం చేసిన తరువాత భర్త పెట్టే బాధలు భరించి, సహించే అబల కథ .  దీనిలో విశేషం ఏంటంటే తనకు అన్యాయం జరుగుతుందని తెలిసినా కూడా ఆమెపై జాలి పడుతుంది, మద్దతు ఇస్తుంది . గంగమ్మకు కళలంటే ప్రాణం అంతేకాదు తనలా ఇంకెవ్వరు ఉండకూడదనే కోరుకున్న వనితగా గంగమ్మ పాత్రను మలిచారు. తన శక్తికొద్ది ఆడ, మగ తేడా చూపని సమాజం కోసం పరితపిస్తుంది రచయిత్రి.

" పెళ్ళంటే నూరేండ్ల పంట " .  అది మనసుపడిన వాడితో జరిగితేనే మంచిగా పండుతుంది.  కాని ఆడపిల్లలకు ఆఅవకాశం ఇస్తున్నారా తల్లిదండ్రులు. వాళ్ల భావనలకు విలువ ఇస్తున్నారా భర్తలు. భావతరంగాలతో వివరించారు . ఆమె శరీరాన్ని తప్ప మనసును చూసే మగవాళ్ళు ఎంతమంది ఉంటారు?

" ఉన్నవి రెండు కళ్ళే అయినా మనిషి కనురెప్పల మాటున కదలాడేవి వేనవేలు కలలు కదా! " భావనాత్మక భావం ఈ కథల సంపుటిలో మనల్ని వెంటాడుతుంది.  "చెడపకురా చెడేవు " లా అనుకున్నదొకటి అయినది మరొకటి కథ తాను చెడు చేయాలని చూస్తే తనకే చెడు జరుగుతుంది. ఆడవారిని చులకన భావంతో చూసి చివరకు తానే జీవితం కోల్పోయిన మగాడి కథ. 

బంధాలు అనుబంధాలు సున్నితమైన భావాలు ఒకరినొకరు అర్థం చేసుకోలేక కొన్ని, ఇతరులు సృష్టించిన గందరగోళకరమైన పరిస్థితులను నమ్మి కొన్ని విచ్ఛిన్నత దశకు చేరుకుంటున్నాయి.  భార్యా భర్తల బంధాలు, అన్నదమ్ముల అనుబంధాలు అయినా సరైన అవగాహనతో ఆకళింపు చేసుకోకపోతే ఏ దరికి చేరతాయో ' బంధాలు అనుబంధాలు'  కథలో వివరించారు. 

" ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలుండొచ్చు భేదాభిప్రాయాలుండొచ్చు .  కానీ విచారకరమైన సంఘటనలు జరిగినా కంటనీరు తెప్పించే దృశ్యాలు చూసినా ఆ ఇద్దరి మనసులూ స్పందించేందుకు బేధాభిప్రాయాలు అడ్డురావుగా! "  ఎంత విలువైన భావం.  నేనూ మనిషినే కదా .  ప్రాణంలేని బొమ్మని కాదుగా!" సివంగి కథ గుండెతడి చేస్తుంది. " అత్తమామలను పెట్టుపోతలని  కట్నాలని, పండుగలని, పబ్బాలని రాచిరంపాన పెట్టే అల్లుళ్లకు భిన్నంగా పిల్లనిచ్చిన మామగారి కోసం తన డబ్బులతో ఇల్లుకొన్న అల్లుని కథ శివకేశవులు. " 

అమ్మాయిలను అందంగా ప్రేమనే మత్తులోకి దింపి సర్వస్వం దోచుకున్న తర్వాత వదిలేసిన సంఘటనలు కోకోల్లలు,వ్యభిచార గృహాలమధ్య నలిగే వాళ్లు ఎందరో .  శ్రావ్య లాగ తప్పించుకొని బయట పడేది ఎందరు?  ఇది జరిగిన కథ ఇప్పటికీ జరుగుతున్న కథ. 

బయట ఒకలాగ లోలోపల ఒకలాగ ఉండే మనుషుల మానసిక సంబంధాల గురించి ' వేణునాదం' , 'వనమాల' కథల సారాంశం.  కుటుంబ సభ్యుల మధ్య ఉన్న అనుబంధాలను చూపించే కథ, బాల్య జ్ఞాపకాలను తడిమి మేనత్తతో ఉన్న తన బంధాన్ని తట్టిలేపే కథ 'మంచి నిర్ణయం'. 

తమిరిశ జానకి  కథలు ఎక్కువగా కుటుంబ బాంధవ్యాల చుట్టూ తిరుగుతూ మమతలు, మనుషుల మధ్య ఉండే అనుబంధాల గురించి; సమాజంలో జరుగుతున్న హృదయ విదారకమైన దారుణమైన సంఘటనల నేపధ్యంలో ఎంతో ఆలోచనాత్మకంగా కొనసాగినవి.  

ప్రతులకు:
తమిరిశ జానకి 
ఫ్లాట్ నెం. 102, రత్ననిధి ఆర్కేడ్, 
శ్రీ రామచంద్ర ఎన్ క్లేవ్, ఈస్ట్ ఆనంద్ బాగ్, 
హైదరాబాద్  - 500047 , తెలంగాణ రాష్ట్రం. 
సెల్: 9441187182  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios