Asianet News TeluguAsianet News Telugu

ఉప్పెన లాంటి - కరోనా కాలం కథలు

లాక్ డౌన్ వల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక , వ్యాపార సంస్థలు, ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలు మూతపడినయి.  కూలికి పోకపోతే తప్ప పొట్ట గడవని పరిస్థితుల మధ్య బతికే జీవులు అతలాకుతమయినయి.  ఈ స్థితిగతులను కాచి వడపోసి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన కథలతో ఓ సంకలనం వచ్చింది.

Yadavalli Sailaja reviews short stories written vased on life in Corona times
Author
Hyderabad, First Published Jun 15, 2021, 2:23 PM IST

సమీక్షకురాలు: యడవల్లి శైలజ ( ప్రేమ్)
            
శతాధిక రచయిత్రుల కథలు, కథనాలు ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ కమ్మంగ ,తీయంగ అమ్మ పాడే జోలపాటలా చందమామ కథలా హాయిగా ఉండేవి కావు.  ఒక్కొక్కరి గుండెలో గుబులు రేపిన కన్నీటి గాథలు ఇవి.  కంటికి కనిపించని మహమ్మారి కబళించిన జీవితాలను కళ్ళారా చూసి స్పందించిన మనసుతో రాసుకున్న కన్నీటిపొరలివి.

జీవనగమనంలో దూరప్రాంతాలలో జీవిస్తున్న కొడుకులు, కూతుర్ల కోసం ఇక్కడ ఉండి బెంగపడుతున్న తల్లి దండ్రుల బాధ వర్ణించడానికి పదాలు, వాక్యాలు కూడా సరిపోవు.  హఠాత్తుగా మూతబడిన బడులతో జీవన భృతి కోల్పోయి రోడ్డున పడ్డ ప్రైవేటు పాఠశాల ఉపాధ్యా యుల జీవితాలు ఉక్కిరిబిక్కిరైపోయినయి. పిడికెడు మెతుకుల కోసం పొట్టచేత పట్టుకుని తమది కాని ఊర్లోకి వచ్చి పొట్ట పోసుకుంటున్న వాళ్లు ఏం జరుగుతున్నదో అర్థం కాక బిత్తరపోయి రోడ్ల మీద కూర్చున్న దృశ్యాలు కోకొల్లలు.  ఈ పుస్తకంలోని కథలు చదువుతూ మనం కూడ కూసిన్ని కన్నీటిబొట్లు రాల్చకుండా ఉండలేం.

ప్రపంచమంతా కూలిపోయినా సరే మనుషుల మెదడులో నుంచి తొలగిపోకుండా కుమ్మరి పురుగులా తొలచేవి కులం, మతం.  కోవిడ్- 19 ముస్లింల వల్లనే వ్యాపించిందనే పుకార్లు జరజర పాకి అన్నదమ్ముల్లా మసలుకుంటున్న దోస్తులను కూడ కలవరపరిచిన సందర్భం ఇది.

అదరవులేని కథ రెండు కుటుంబాల్లో జరిగిన కథ అనడం కన్నా ఎందరో కుటుంబాల్లో జరుగుతున్న కథ అని చెప్పవచ్చు.  దూరంగ ఉన్న కొడుకులు ఎలాగ ఉన్నారన్న బెంగ ఒకరిది.  పిల్లల చదువుల కోసం కన్న తల్లిదండ్రులను ఉన్న ఊరిని విడిచిపెట్టి వచ్చి ప్రైవేటు పాఠశాలలో పనిచేస్తున్న దంపతులు బడులు ఎప్పుడు తెరుస్తారు, ఈ బాధ రోజులు ఎలా గడుస్తాయన్న బెంగ వారిది.

మహిళల జీవితాలపై ఎన్ని కథలు రాసినా సరిపోవు. అటువంటి కథలే నాలుగు గోడల మధ్య నలుగురూ, వర్క్ ఫ్రమ్ హోమ్, లాక్ డౌన్.  కొన్ని కథలు చదువుతుంటే కొన్ని వాక్యాలు కలంతో అండర్ లైన్ చేసుకుని మళ్లీ మళ్లీ చదివిస్తాయి.  " నిజానికి ఆడవాళ్ళ బతుకులు వలస బతుకులే.  పెళ్ళయ్యాక భర్త వెంట నడుస్తుంది.  పిల్లల అవసరాల కోసం తరలిపోతుంటారు " ఆడపిల్లల జీవన క్రమం తండ్రి, అన్న, భర్త, కొడుకుతోనే గడిచి ముగిసిపోతుంది.  తనకంటూ ఏమీ మిగుల్చుకోకుండా అందరికి పంచిపెట్టే అక్షయ పాత్ర ఆమె.  ఈ వాక్యాలు గుర్తుకురాక మానవు ఈ కథలు చదువుతుంటే.

భయం  - భయం కథ చదువుతుంటే ఎన్నో ప్రశ్నలు నా బుర్రలో గింగిరాలు కొడుతున్నయి.  కథ ముగింపులో ఒకే ఒక ప్రశ్న " జాగ్రత్తగా ఉండటం అంటే అర్థం ఏమిటి? "   ఆకలిని చంపుకునా? అవసరాలనువదులుకునా?  దేన్ని విడిచి ఉండగలం?  వదలగలం మనం.  ఎలా జాగ్రత్త పడాలి? మనల్ని కూడ మనం ప్రశ్న వేసుకునేలా చేస్తుంది ఈ కథ ముగింపు.కాళ్ళులేని తన తండ్రిని సైకిలుపై కూర్చోబెట్టుకుని తన ఊరు చేర్చిన కన్నకూతురు కథ ఆత్మస్థైర్యం .

దారి పొడుగున శవాల గుట్టలు మీ అమ్మవో, మీ నాన్నవో, మీ చెల్లివో, మీ అన్నవో ఎవరివరివో, మరెవరివో అని ఒక కవి రాసిన పాట యాదికి తెస్తున్న వి కరోనా బలి, భయం కథలు.   చనిపోయిన వారిని దహనం, ఖననం చేసే చోటు లేక కుప్ప కుప్పలుగా రాశులు పోసి పూడ్చిపెట్టిన సంఘటనలు హృదయమున్న ప్రతి ఒక్కరిని కలిచివేస్తున్నవి.

దుఃఖనది  - భర్తను పోగొట్టుకొని దారిలో ఎన్నో దుఃఖనదులను దాటుకుంటూ ఐదురోజులు నడిచి రోడ్డంతా తన పాదముద్రలతో అరుణ వర్ణాలను అద్దుతూ స్వంత గ్రామానికి చేరుకుంది.  కరోనా కట్టడికి లాక్ డౌన్ పెట్టింది ప్రభుత్వం, కానీ ఆకలికి ఎవరైనా లాక్ డౌన్ పెట్టి ఉంటే బాగుండేది " అక్షర సత్యాలు" ఇలాంటి కథలెన్నో, వ్యథలెన్నో.

పాతకాలం, పల్లె సొగసులు, ఆహార భద్రత, పద్దతు లు , సంప్రదాయాలు అప్పుడూ ఎప్పుడూ ఇప్పుడూ కూడ పాటిస్తే ఆరోగ్యకరమైన జీవితం కలకాలం గడప
వచ్చన్న సందేశాత్మక కథ "కూటికుంటే కోటికున్నట్లే". మద్యపాన నిషేద చట్టం ఉన్నా, వరకట్న నిషేద చట్టం ఉన్నా లేనట్లే.  ఏరులా బారులు నీరులా బీరులు పారుతూ కుటుంబాల మధ్య చిచ్చుపెట్టి నాశనం చేస్తున్న ఈమద్యం దుకాణాలను ఆపరు, ఆపేవారు లేరు.  గౌరమ్మ కొడుకు, భర్త  లాగ ఎంత మంది బలైపోతున్నారో !

" బతుకుపోరాటంలో ఎంత నలిగిపోయారో, చితికిపోయారో , కాళ్ళకు బొబ్బలెక్కినా నిశ్శబ్దంగా గబగబా నడిచిన నడకను చూస్తున్నాగా..." బతుకు చెట్టు మాటలు.  ఎందుకు ఇన్ని మైళ్ళు నడచి వెళ్తున్నారు? అక్కడ ఏ మున్నది? భూమికా మిట్టికా కుష్బూ.  వలస కార్మికుల సమస్యలు, వేదన, బాధ కలగలిపిన కథ పాదాచారి.

ఆకలి ముందు కన్నతండ్రైనా,  కన్నపేగైనా దిగదుడుపేనని  ఊరట కథ తెలుపుతుంది. పాజిటివ్ ప్రపంచం కథ ఈ సమాజంలోని తీరుతెన్నులను ఎత్తి చూపుతుంది.  ఆకలి, అవసరాలు మనిషిని ఎంత దూరమైన తీసుకెళ్తాయి.  ప్రపంచమే పాజిటివ్ అయిపోతున్నట్లుందిప్పుడు. ఇది రియల్ వాయిస్.  క్వారంటైన్ కథ ముగింపులో ఇప్పుడు దేహమొక్కటే కాదు, మనసూ పరిపూర్ణంగా క్వారంటైన్ చేయబడి మలినాలన్నీ కడిగేసుకొని వేసుకున్న తెల్లకోటు మల్లెపూవులా స్వఛ్చమై, పరిమళిస్తుండగా మళ్ళీ బాధితుల సేవకు తరలింది పూజా పుష్పాలుగా, కడిగిన ముత్యమై అందరూ ఈ కథలో లాగ సేవకు సిద్దమైతే ఎంత బాగుంటుందో కదా!

లాక్ డౌన్ వల్ల కనీసం తాగడానికి గుక్కెడు నీళ్లు దొరక్క అల్లాడుతున్న వలస జీవులెందరో.   లాక్ డౌన్ అనే కాదు కొందరి జీవితాలకు ఎప్పుడూ ఆకలి, నీటి బాధలు తీరని సమస్యే.  నీళ్లమీద జరిగిన పోరాటాలెన్నో.   అయినా తీరని దాహం.  చక్కని చిక్కని కథ ఈ తీరని సమస్య కథ.  కొన్ని కథలు వస్తువు, భాష, యాస ఇవేవి చూడనీయ వు, కంట తడి పెట్టిస్తయి.  మనసు పడ్డ వేదనను మాత్రం అర్థం చేసుకునేలా తడుముతాయి. తడిమిన గుండెను తడిచేస్తాయి.  ' పరిందా కథ మొదలు ఆఖరి వరకు రచయిత్రి పడిన మానసిక సంఘర్షణ, మనుషుల ప్రవర్తన పట్ల కలత చెందిన తీరు హత్తుకుంటుంది.  నన్ను క్షమించండి ఇది హత్తుకోవడానికి కథ కాదు పచ్చి నిజం.  చదువుతున్న వారు, చదివిన వారు మారి  మత రహిత సమాజ స్థాపన జరిగితే బాగుంటుంది.

కొన్ని నూకలు మిగిలే ఉండోచ్చు.   కరోనాను జయించిన ఒక మహిళా కథా రచయిత్రి ఎన్నో కష్టాలకు ఓర్చుకొని జీవితంలో గెలిచిన తీరు ఆకట్టుకుంది అనేకన్నా ప్రేరణనిచ్చిన జీవితమని చెప్పవచ్చు.  " కులమతాలకూ, భయానుమానాలకూ, స్థాయీభేదాలకూ తావులేని మానవత్వ పరిమళాలిలాగే ప్రపంచమంతటా పరివ్యాప్తమైతే కరోనా కాలమే కాదు, ఏ కష్టకాలమైనాఎంతో సులువుగా దాటగలడు ప్రతి మానవుడు.

లాక్ డౌన్ కొన్నిరోజుల వరకు అందరికీ ఆ తర్వాత ముఖ్యంగా మహిళల పరిస్ధితి దారుణంగా తయారైంది.  శారీరక,మానసిక హింసలు పెరిగిపోయి అశాంతి చోటు చేసుకున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి.  ఆడవారిని అందలం ఎక్కించకపోయినా ఫర్వాలేదు.  ఆమెను కాస్త అర్థం చేసుకుంటే చాలు అమ్మ అంటే అవసరానికి పనికి వచ్చే వస్తువులా భావించే ప్రతి ఒక్కరికి ఈ లాక్ డౌన్,  నడిచే యంత్రం కథలు కనువిప్పు కలిగిస్తాయి.  ఆకలిగొన్న కడుపే మరొక ఆకలి కడుపును గుర్తిస్తది.  పిల్లల ఆకలి తీర్చలేక ఏడ్సుకుంట ఉన్న తల్లిని ఓదార్చుతూ గడ్డితిని బతకడం అంటే మళ్ళీ మనం ఆదిమానవుని కాలంలోనే ఉన్నామన్న విషయం మనకు తెలిసివస్తుంది.  మానవత్వం కనుమరుగవుతున్న మనిషిగా బతకడం కన్నా చావడం మేలు.  కోపం, కసి రగులుతుంటయి 'మరువని విలువలతో ' కథ చదివితే.  పసి పిల్లలకు ఉన్న మానవత్వం మనం కూడ నింపుకుంటే బాగుండు.   లాక్ డౌన్ వల్ల ఆర్థికంగా చితికిన కుటుంబాలు , ఇంట్లోనే ఉండి పనిచేయడం వల్ల అదనపు పనిభారం ఎక్కువైనఉద్యోగుల సంఖ్య చాలానే ఉంది.  అందులోనూ మహిళా ఉద్యోగుల సంఖ్య మరింత ఎక్కువ.

జిల్లేడుకాయ కథ ముగింపు బాగుంది.  అసలు జిల్లేడు ఎక్కడిది ఎట్లా వచ్చింది అనేది తర్వాత ముందు కళ్లు కాపాడుకోవడం ముఖ్యం.  ఇది సమాజంలో జరుగుతున్న వింత మనుషుల ప్రవర్తనకు అద్దం పట్టిన కథ.   చీడ ఏడనుంచి వచ్చిందో అనవసరపు వాదన కన్నా ఇంకా చీడ పాకకుండా,  చీడ పురుగుల బారిన పడకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత మనదేనని విశదీకరించారు.
   
లాక్ డౌన్ వల్ల ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక , వ్యాపార సంస్థలు, ప్రభుత్వ,  ప్రైవేటు పాఠశాలలు మూతపడినయి.  కూలికి పోకపోతే తప్ప పొట్ట గడవని పరిస్థితుల మధ్య బతికే జీవులు అతలాకుతమయినయి.  ఈ స్థితిగతులను కాచి వడపోసి మహిళా శక్తికి నిదర్శనంగా నిలిచిన  ఈ కథా సంకలనానికి గౌరవ సంపాదకులు డాక్టర్ తిరునగరి దేవకిదేవి.  సంపాదకులు  అనిశెట్టి రజిత, డాక్టర్ కొమర్రాజు రామలక్ష్మి,  డాక్టర్ బండారి సుజాత.  సహ సంపాదకులు డాక్టర్ మురాడి శ్యామల,  తమ్మెర రాధిక.  

ప్రతులకు:  అనిశెట్టి రజిత
ఇం.నెం. 1-1-226/2/1
తేజస్వి పాఠశాల వెనుక
ప్రశాంత్ నగర్ కాలనీ, ఫేస్ -3,
కాజీపేట, జిల్లా : వరంగల్ అర్బన్ - 506004.

Follow Us:
Download App:
  • android
  • ios