Asianet News TeluguAsianet News Telugu

'అవలోకనం ' చరిత్రలో నిలిచిపోయే పుస్తకం

 ' కరోనా ' కొందరిని దగ్గర చేసింది మరికొందరిని దూరం చేసింది. ఇన్నాళ్ళు యాంత్రిక జీవితంలో తాము కోల్పోయింది ఏమిటో కూడా తెలియజేసింది. మనుషుల్లో దాగివున్న మానవత్వాన్ని బయటకు తీసుకుని వచ్చింది.

Yadavalli Sailaja reviews Corona dairy Avalaokanam
Author
Hyderabad, First Published Dec 3, 2020, 11:43 AM IST

1979 స్కైలాబ్ , 1591 ప్లేగు వ్యాధి , స్వైన్ ఫ్లూ , ఎబోలా గురించి  జనాలు మరిచి పోయి ఇప్పుడిప్పుడే కొంచెం ఊపిరి పీల్చుకుంటున్నారు అనుకుంటుండగానే ఈ (covid-19)కరోనా మహమ్మారి అందరి జీవితాన్ని ఒక్కసారిగా కుదిపేసింది . 

 ' కరోనా ' కొందరిని దగ్గర చేసింది మరికొందరిని దూరం చేసింది. ఇన్నాళ్ళు యాంత్రిక జీవితంలో తాము కోల్పోయింది ఏమిటో కూడా తెలియజేసింది. మనుషుల్లో దాగివున్న మానవత్వాన్ని బయటకు తీసుకుని వచ్చింది. 

 జనతా కర్ఫ్యూ విధించింది ప్రభుత్వం ఆ తరువాత వెనువెంటనే లాక్ డౌన్ . భయంకరమైన పరిస్థితిలో కూడా తమ బాధ్యత మరిచిపోలేదు పోలీసులు, డాక్టర్లు, నర్సులు, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య కార్మికులు, సోషల్ మీడియా,  మరియు  మన ప్రభుత్వం. 

 ఈ విపత్తును ఎదుర్కోవటం కోసం, జనాలకు ధైర్యాన్ని నింపడంకోసం మన ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు కవులను, రచయితలను కవితలు, పాటలు రాయమని కోరారు. ఎన్నో వాట్సప్ గ్రూపులు ఇంకా  నరసం , అక్షర కౌముది ,  కథయిత్రుల సమూహం, ఈనాడు రామోజీ రావు ఫౌండేషన్, ఈ టీవీ ఆధ్వర్యంలో 'కరోనా కథనం' పేరుతో పోటీ నిర్వహించారు , నమస్తే తెలంగాణ పత్రిక వారు ఎన్నో కవితలు ప్రచురించారు, ఆంధ్ర జ్యోతి, ఆంధ్ర ప్రభ, నవ తెలంగాణ, మన తెలంగాణ, వార్త, వెలుగు, తెలుగు వెలుగు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో మరెన్నో పత్రికలు  ఉన్నాయి తమవంతు కర్తవ్యాన్ని నిర్వహించాయి . 

 " చార్మినార్ " అనే పేరు వినగానే ప్లేగు వ్యాధి సంఘటన గుర్తుకు వస్తుంది అలాగే " కరోనా డైరీ " అనగానే జ్వలిత దెంచనాల గారు దానికోసం పడిన కష్టం అందులో ఉన్న రచయిత్రుల ఆవేదన, ఆలోచన, మానవత్వం, గుర్తుకొస్తుంది ఎవరికైనా సరే. ఆత్మాన్వేషణ , పరివ్యాప్త , సంగడి ముంత , జ్వలితార్ణవాలు ఇలా ఎన్నో ఆమె  రచనలు  చైతన్యాన్ని నింపుకున్న గుళికలు. ఇప్పుడు డైరి రూపంలో "అవలోకనం" మన ముందుకు తెచ్చారు. 

అవలోకనంలో 126 మంది డైరీల్లో కొందరి దినచర్య కన్నీళ్ళను తెప్పిస్తుంటే , కొందరి డైరీ సమాజాన్ని ప్రభావితం చేస్తుంది , మరికొందరి డైరీ ప్రశ్నిస్తుంది . కాట్రగడ్డ భారతి " కరోనాతో నా అనుభవం ( కరోనా విన్నర్)"లో తను కరోనాని ఎలా జయించింది, కరోనా రోగులను సమాజం ఎలా చూస్తుంది ఆ సమయంలో తీసుకోవల్సిన జాగ్రత్తలు, చిట్కాలు ఆమె పొందినఅనుభవాలు నిజంగా తను ఒక విజేత . 

వలస జీవుల జీవితాన్ని చూసి స్పందిస్తూ అనిశెట్టి రజిత  గారి 'సన్నాట సన్నాట ' ,  ఒగ్యాల పోతిమే అనుకో పోతే పోతాం డాక్టర్ ఎం . ప్రగతి,  మా చినబాపు వరవరరావు గారు జైలులో అస్వస్థతకు గురి అయ్యారని
బాధపడుతూ కొండపల్లి నీహరిణి వాపోయారు. 

డాక్టర్ మానస ఎండ్లూరి మాటలు సుర్రున గుచ్చుకుంటున్నయి ఏది ఏమైనా శుభ్రాన్ని మనమీద రుద్దిన కరోనాలానే ఏదైనా ఒక శక్తి మనలోని అక్రమాలు,  అసమానతలు పోయేలా అందరినీ చేపను రుద్దినట్టు రుద్దితే బావుణ్ను. నిజానికి ఇది నిజం కదా . 

 జర్నలిస్టు అంటే అందరి దృష్టిలో ప్రభుత్వం ఎన్నో రాయితీలు , సంక్షేమ పథకాలు పొందే వాళ్ళని అర్థం .కాని నిజానికి జర్నలిస్టు చినిగిన బట్టలు లోపల వేసుకుని బయటకు మాత్రం ఇస్త్రీనలగని షర్టుతో గంభీరంగా కనిపిస్తాడు. పస్తులతో ఉన్నా పట్టెడు అన్నం
పెట్టమని మరొకరిని అడగని ఎన్నో జర్నలిస్టు కుటుంబాలు ఉన్నాయి - వి.యశోద జర్నలిస్టు గారి మాటలు .

 రాష్ట్ర, ప్రాంత, భాష బేధాలు లేకుండా ఈ కరోనా డైరీ రాయడం నిజంగా అభినందనీయం చెన్నై, ముంబై ఇతర రాష్ట్రాలలోనే కాదు ( కెనడా, డల్లాస్‌) విదేశాల నుండి వచ్చాయంటే జ్వలిత గారి కృషిని అభినందించకుండా ఉండలేం.  126 రచయిత్రుల కరోనా డైరీ అంశం ఒక్కటే కావొచ్చు కానీ వారి ఆవేదన రకరకాలుగా ఉంది. తినడానికి తిండి లేని వారికి, వలసజీవులకు , ఉపాధి  కోల్పోయిన వారికి సహాయం చేసిన అందరికీ నమస్సులు . 

జీవితమా లవ్ యూ నన్ను నేను ప్రేమించుకున్నంత కాలం జీవితాన్ని ప్రేమిస్తూ ఉంటాను - అయినంపూడి శ్రీ లక్ష్మీ. బయటకు తొంగి చూస్తే రోజు పలకరించే పెదాలు చప్పున ముడుచుకునే స్థితి కరచాలనం చేసే చేతులు తటాలున తలుపులు వేసుకునే పరిస్థితి - ఓరువాల సరిత నరేష్.  మనిషి చెట్టుకు మానవత్వపు చిగుళ్లు మొలిచాయి - చెళ్ళపిళ్ళ శ్యామల .  మనిషికి మనిషే కాదు స్వంత అవయవాలు శత్రువులు అయినయి - డాక్టర్ తిరునగరి దేవకీదేవి.  కరోనా కాలంలో కవుల కలాలు సమతా రాగాలను ఆలపించాయి - డాక్టర్ బిళ్ళ మాధురి .

మన జీవితాలపై ఈ కరోనా మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపింది. ఎంతోమంది ఉపాధిని కోల్పోయారు." కరోనా ముందు కరోనా తరువాత " అన్నట్లుగా మారింది మన పరిస్థితి . భిన్నమైన జీవన విధానాన్ని చూస్తున్నాము -సలీమా .ఎస్. కె. 
   
కళ్ళుండీ ఏమీ చూడలేని వాళ్ళు, కళలను ఆస్వాదించలేని వాళ్ళు కొందరుంటే కళ్ళు లేకున్నా కళలని దర్శించే వాళ్ళు మరికొందరు వుంటారు. నిజానికి కళ్ళు మూసుకున్నా హయినిచ్చే సంగీతం కళ్ళకి విశ్రాంతి నిస్తుంది మనసుని సేదదీరుస్తుంది . అంటూ జీవితాన్ని కళలని  పండించుకోవాలని, కళ పట్ల తనకున్న గౌరవాన్ని, ప్రేమను, ఇష్టాన్ని ప్రకటించడమే కాకుండా తన తోటి కళాకారులను ప్రోత్సహిస్తూ పాటలు, డాన్సులు, మిమిక్రీ కార్యక్రమాల్లో పాల్గొన్న వారందరికీ బహుమతులను అందించారు . ఈ కరోనా అవలోకనం పుస్తకంపై స్పందిస్తూ ఇటువంటి పుస్తకాలు మరెన్నో రావాలని డాక్టర్ అమృతలత  గారు  అభిప్రాయపడ్డారు.

కొందరు తమ గుండె చప్పుడు వినిపించడానికి  ఆ గుండెపడే బాధను వ్యక్తం చేయడానికి అక్షర రూపంలో తమ గోసను రాసి భారం దించుకున్నరు. మరి రాయలేని వారి పరిస్థితి తమ గోడును కూడా వినేవాళ్ళు ఉంటే చాలా బాగుంటుంది కదా అని తప్పకుండా  అనిపిస్తుంది.  వాళ్ళ గొంతులోని , గుండెలోని ఆర్తి   నెల్లుట్ల రమాదేవి గారు విన్నారు.  అందుకే రాయలేని వారి గోస తనగుండె 
చప్పుడుతో మనకు వినిపించారు.  పొలం పనులు చేసుకుంటూ పూట గడుపుతున్న వారు, బట్టలు కుట్టుకుని బతికే వారు , ఇళ్ళల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వారి దుస్థితి గురించి అడిగి తెలుసుకుని ఇదిగో ఇలా మాలాంటి వారు ఎందరో ఉన్నారని జయమ్మ , హైమ,యాద లక్ష్మీ, గట్టమ్మ, నిర్మల అనే ఐదుగురి మహిళల పరిస్థితిని కరోనా డైరీగా అందించారు. నిజానికి ఈ సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఇటువంటి దుస్థితికి కారణమైన కరోనాపై కళ్ళెర్ర చేస్తూ ఆపదలో ఉన్న వారికి కొంచెం సహాయం చేయడానికి సిద్ధంగా ఉందాం.
" పదిమందిలో మాటలు చెప్పి పక్కకు తప్పుకోవడం కన్నా పదిమందికి చేతనైన సహాయం చేసిన చేతులు మిన్న " . 

 126 మంది రచయిత్రుల దినచర్య చదువుతుంటే గుండెలవిసిపోయినయి. చీకటి వెనుక వెలుగు పుట్టుక ఉన్నట్లు ఈ విపత్తును దాటుకుని ముందుకు నడుస్తుంది ఈ ప్రపంచం. ఇప్పుడు సరైన సమయంలో మంచి పుస్తకం అందించారు  జ్వలిత .  ఈ అవలోకనం (కరోనా డైరీ) చరిత్రలో  తనకంటూ ఒక స్థానం దక్కించుకుంటుంది. దీనికి సహకరించిన అందరూ అభినందనీయులు .
కలరా అంటే  చార్మినార్ లా , కరోనా అంటే కరోనాడైరి అవలోకనం నిలిచిపోగలదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఈ విపత్తులోఎదుర్కొన్న స్వీయ అనుభవాలు, సవాళ్లు, మానసిక సంఘర్షణ ఇలా  ఏదైనా కావచ్చు 126 మందిని ఒకేచోట 
చూడగలగడం ఒక అద్భుతంగా ఉంది. 

ముందు తరాలకు నిజంగా ఉపయోగపడే ఒక రిసెర్చ్ పుస్తకం.  covid-19 గురించి తెలియాలంటే  జ్వలిత గారి అవలోకనం చదివితే చాలు అనిపించేలా ఉంది ఈ
పుస్తకం. 

" కాలం ఒక పంతులమ్మ ఎంతో నేర్పిస్తూనే ఉంటుంది " కన్నోజు ఫణిమాధవి అన్నట్టు మనం కూడా ఎంతో కొంత 
నేర్చుకున్నాం .ఈ కరోనా డైరీ కూడా ఎంతో కొంత నేర్పుతుంది.  దెంచనాల  విజయ కుమారి ( జ్వలిత)కి   అభినందనలు తెలుపుతూ ఇంకా మరెన్నో రచనలు చేస్తూ సాహితీ లోకంలో ఆదర్శంగా ఉండాలని కోరుకుంటున్నాను. 

పుస్తకం పేరు "అవలోకనం"126 రచయిత్రుల కరోనా డైరి
పేజీలు- 424, వెల - 200/-
సంపాదకులు- జ్వలిత
జె.డి. పబ్లికేషన్స్ ప్రచురణ 

పుస్తకాల కోసం- 
15-21-130/2, సాహితీవనం, ఫస్ట్ ఫ్లోర్,
బాలాజీనగర్, కూకట్పల్లి, హైదరాబాద్-72
jwalitha2020@gmail.com
Mobile - 9989 198943 

 - యడవల్లి శైలజ.

Follow Us:
Download App:
  • android
  • ios