సమీక్ష: వేణుగోపాల్ జుజ్జూరి

'దేవుడు మరణించాడు'.  19వ శతాబ్దికి చెందిన ఫ్రెడ్రిక్ నీషే అనే జర్మన్ ఫిలాసఫర్ భగవంతుడు అనేది అపరిపక్వ సమాధానం,  నిషిద్ధాంశం అంటూ చేసిన ప్రకటన ఇది.  కొమ్మవరపు విల్సన్ రావు మూడో కవితాసంపుటి 'దేవుడు తప్పిపోయాడు'.  నీ దేహంలోంచి నువ్వెప్పుడో తప్పిపోయావు.  కాకపోతే మరేంటి? అని దేవుడిని ప్రశ్నిస్తాడీ కవి.  దేవుడా నువ్వెప్పుడూ నీలోంచి నువ్వు తప్పిపోతూనే ఉండు!నన్ను నేను ఈ నేలలో విత్తుకుని కొత్త జలానికి దోసిలి పడతాను...! అని ఎద్దేవా చేస్తూ దేవుడి అవసరాన్ని నిరాకరిస్తాడు.  'సమాజంలో దేవుడు బలమైన వాడిగా ఉన్న ఈ సమయంలో ఈ కవికి ఇంత ధైర్యం ఎక్కడినుంచి వచ్చింది.'.  ధాన్యం పండించే అన్నదాత నెత్తినున్న దారిద్ర్యం...కూటి గింజల కోసం అలమటిస్తున్న బట్టలు నేసే నేతన్న ఇతని ధైర్యానికి కారణాలు.  వీళ్ళ మీద బతికే దళారీలు కోట్లకు పడగలెత్తడం కవి సాహసానికి మరీ ముఖ్య కారణమైంది. తిలక్ 'సాహసి కానివాడు జీవన సమరానికి,స్వర్గానికి పనికిరాడు'  అన్నాడు.   కాబట్టి ఈ కవి స్వర్గలోక ప్రవేశానికి ఎలాంటి ఢోకా లేదు.  దేవునితో పని లేదు కాబట్టే కవికి ఈ భయం లేనితనం, ధిక్కార స్వరం వచ్చాయి.

నక్షత్రం వయసుడిగి పోయాక తనలోకి తాను కుంచించుకు పోయినట్టు మనిషి కూడా తనలోకి తాను ముడుచుకుపోతూ తన పరిధిని తాను చిన్న గా మార్చుకున్నాడు కాబట్టే
అవమానాల గాయాల్ని /పునాది రాళ్లుగా మలచుకుని/ జీవనధాతువును తలకెత్తుకుని/ త్యాగాల వనంలో వెలుగు మొక్కల్ని నాటుతూ/ విస్తరిస్తున్న మనుషుల్ని చూడు/వాళ్ళ వాత్సల్యానికి దాసోహమై విశాలమవుతావు .
తన నుండి తానెలా విస్తరించుకుంటూ పోవాలో కవి పూసగుచ్చినట్టు చెప్పాడు.

మానవతావాదుల కోసం అన్వేషించి దొరకక కలలోకి సాగిన అన్వేషణ కవి ఆపలేదు.  సకలజనుల కళ్ళల్లో చెలిమ పువ్వు కోసం కలగన్నాడు.  చివరికి జీవితం రణరంగం అయినప్పుడు కలల్ని సాకారం చేసుకునేందుకు  ఎన్ని నెత్తుటి దినాలనైనా ఖర్చు చేసుకునే/మహా మనిషిని కనాలని కలగంటున్నాను అంటాడు.  యుద్ధానికి అన్నివేళలా విజయమో - వీరస్వర్గమో ప్రాతిపదిక కానేకాదు.  రక్తం, తెగిన కాళ్లు చేతులు మొండాల లెక్కలు కొలమానం కానే కాదు.  అసలు మాటలు కూడా అక్కర్లేని వ్యుహం ఒకటుందంటాడు.   గెలవాలంటే/యుద్ధమే చెయ్యాల్సిన పనిలేదు/నిశ్శబ్దం కూడా యుద్ధమే.
మనం మాట్లాడితే ఆ మాటకు ప్రాణం ఉండాలి.  చూపు పత్తి పువ్వుల్లా మెరిసిపోవాలి.   జీవితాన్ని అన్ని కోణాల నుండి చూడాలి.  జీవితానికి సమగ్ర వ్యాఖ్య కోరుకున్నవాడు లోతుల్లోకి తడిమి చూడాలని చెబుతూ -  దుఃఖపుడమిలోంచి మొలుచుకొచ్చిన/ చెమట ముత్యాన్ని కనులారా చూసావా ఎప్పుడైనా... అలా చూడాలంటే నిన్ను నువ్వు మాటమాటకి సరిచూసుకోవాలి.
ఎన్ని మాటలైనా మాట్లాడు/ఎన్ని గొప్పలయినా చెప్పు/ పెదవి దాటని ప్రతి మాట/జాజిపూల పరిమళంలా ఉండాలి/తొలకరి చినుకుల్లో అడవిపూల/పరిమళమై తాజాగా మొలకెత్తాలి/మరో పదిమంది పాడుకునే వెలుతురులో పదునెక్కిన పాటలాగుండాలి.

ప్రతి మనిషి జీవితంలో శూన్యత ఆవహిస్తుంది.  కవి ఆ ఒంటరితనానికి భయపడకూడదంటాడు.  ఎందుకంటే పుస్తకాలు జ్ఞానానికి - మనిషికి మధ్య వారధులు.  ఆ ఏమీ లేనితనాన్ని, అక్షరంతో పూడ్చుకోవాలంటాడు.  వొంటరితనమంటే/ఎందుకంత భయం/జ్వలితాక్షర జ్వాలల్లో/తడిసి ముద్దయిపో/సమస్త ప్రపంచాన్నీ/ అరగంటలో నీ మస్తిష్కం లోకి/ఎక్కించే నీ చూపుల/ ఆరని అద్భుతదీపానికి/నీకు నువ్వే/గులామునవ్వాలనిపిస్తుంది.

ఆకలి డొక్కల్ని మెలిపెడుతున్నా పొట్టకూటికోసం అదే ఆకలికి చరమగీతం పాడి నిత్య దుఃఖాన్ని మన స్పృహలోకి తెచ్చేవాళ్ళు కొందరుంటారు.  సర్కస్ లో తాడుపై అలవోకగా ప్రవహించే పిల్లలు మన కళ్ళ ముందు ఉంటారు.  వాళ్ళకి అప్పుడు ఆకలి కనబడదు.  అర్జునుడి బాణానికి పక్షి కన్ను మాత్రమే కనబడినట్టు వాళ్లు ఆకాశంలో తాడుపై నడుస్తారు.  వారి జీవితాన్ని కవి కరిగిపోయిన హృదయంతో రాసాడు.

చదువు తుడిచేసిన ఆమె చేతిలో/ఊతకర్ర వొదిగొదిగి కూర్చుండేది...!/ నడుస్తుంటే చప్పట్ల హోరు ఊరిని తడిపేసి/ఏకాగ్రతతో/ధ్యానంతో/ మన హృదయాలను కొల్లగొట్టేది.  చివరకు మనకు దండం పెడుతూ/మనల్ని ముద్దాయిల్ని చేసి/ ఊపిరి తీగల్ని సవరించుకుని/ మనిషితనాన్ని సర్దుకుని/కొన్ని దేహాల్ని వెంటేసుకుని/ గాయపడిన సంకీర్ణ స్వప్నాల్ని మోస్తూ...తను ఇప్పుడెక్కడుందో...!

ఇప్పటి జీవనంలో ప్రతి మనిషి ఒక యుద్ధనౌక.  తోటిమనిషి నుండి సానుభూతి, సహకారం ఆశించలేని దశాబ్దంలో ఉన్నాం.   స్వీయ ప్రేరణ మాత్రమే మనకిప్పుడు అవసరం.  ఆశల్ని మోసే మనం ఇప్పుడు సూర్యుళ్ళమవ్వాలి.
నేనొక పురాగానమై/నాకు నేను మేల్కొలుపు గీతాన్ని/ పాడుకుంటూ బయలుదేరాను/బతుకు యుద్ధానికి సన్నద్ధమై/ఊపిరి పోసుకుంటున్న/జీవన సమరశీలిని మోస్తూ...(జీవన సమరశీలి) జీవితాన్ని అదుపులోకి తెచ్చుకుని నేర్పుని మనం వంట పట్టించుకోవడానికి  సోక్రటీస్ నడిచిన ఒకే ఒక దారిని  కవి నేటితరం ముందుంచాడు.

ప్రశ్నించడం నేర్చుకో/ఓడిన జీవితం/ కుక్కలా తోకూపుకుంటూ నీ ముందు సాగిలపడుతుంది.

నిర్భయ ఘటన జరిగి ఏడు సంవత్సరాలు గడుస్తున్నా నేటికీ నిందితులకు శిక్ష పడకపోవడం అన్యాయమే.. దేశ శిక్షాస్మృతిలో నిర్దోషిత్వాన్ని నిరూపించుకునే చట్టాల్లోని లొసుగులు వాడి ఎప్పటికప్పుడు దోషులు తప్పించుకోవడం చూస్తుంటే, ఇదేనా ఈ దేశం స్త్రీకి ఇచ్చే గౌరవం అనిపించకమానదు.  నిర్భయ, దిశలాంటి ఎన్ని చట్టాలొస్తున్నా ఏ మాత్రం అత్యాచారాలు ఆగకపోవడంతో మనిషితనాన్ని కోల్పోయిన, చైతన్యాన్ని మొలకెత్తని రుగ్మతకు మందేది?  అని మానవ సమస్తాన్ని ఉద్యమం వైపు నడిపిస్తాడు.
కన్నీటి సంద్రాలు పారించొద్దు/బ్రతుకుకు భరోసానిచ్చి స్త్రీకి గౌరవాన్నిచ్చే/ఒక గొప్ప ఆధునిక ఉద్యమాన్ని నిర్మించాలి/జాతికి జవజీవాలిచ్చే/అత్యంతాధునిక యుద్ధాన్ని ప్రకటించాలి.

శ్రమ సౌందర్యంతో వెలిగే రైతుకి మోకరిల్లాల్సిన తరుణంలో వాళ్ళ పాదాల నుంచి నెత్తురు పారుతుంటే దీనంగా చూస్తున్న సమయమిది.   అన్నదాతల అవిశ్రాంత యుద్ధభేరి ఇప్పుడు రాజకీయనాయకులకు క్రీడ.  అది మహారాష్ట్రలో అయినా, అమరావతిలో అయినా ఎక్కడైనా నాయకుల తీరు మారటం లేదు. కానీ రైతు తీరు మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది.  ఆ ఆవేదనను, అన్నదాత తత్త్వాన్ని అక్షరాల్లో సహజంగా ఒదిగిపోయేలా చేసాడు.
నిన్ను రాజుగా చూసినోడికీ/బానిసగా చూసినోడికీ/పరమాన్నమే పెట్టావు అంటాడు కవి.

సామ్రాజ్యవాదం అంటే ఆర్ధిక ఆధిపత్యమే లక్ష్యంగా సామ్రాజ్య విస్తరణ.  ఆర్ధిక ఆధిపత్యం కలిగిన సామ్రాజ్యం రాజకీయ ఆధిపత్యాన్ని కలిగి ఉంటుంది. పైకి చూడడానికి రాజకీయ స్వాతంత్ర్యం కలిగి ఉన్నట్లు కనిపించే అనేక దేశాలు వాస్తవంలో ఆర్ధిక పరాధీనతను కలిగి ఉంటాయి. అమెరికా సామ్రాజ్యవాదిగా అగ్రస్ధానంలో ఉంటుంది.

"సర్వాంగాలూ డాలర్లకు మోకరిల్లుతుంటే/
మానని గాయాలకు లేపనం పూసి ఏం లాభం?

డాలర్ డ్రీమ్స్ ఇప్పుడు యువత తొలి ప్రాధాన్యత.   ఆ మోజులో విదేశీ పయనాలు.  తమ ప్రతిభను విదేశం కోసం ధారపోస్తారు.  అగ్రరాజ్యాలు ఎన్నో పేటెంట్లు పొందే ఆవిష్కరణలకు పేదదేశ యువతే ఆధారాలు.  అన్నిటికీ పేటెంట్లు పొందుతున్న సామ్రాజ్యవాదితో పొంచి ఉన్న ప్రమాదాన్ని "రెప్పచాటు కన్నీటి చుక్కకూ/పేటెంట్ హక్కుదారవుతాడు" అంటూ కవి కడిగేస్తాడు.

సమాజంలో విజ్ఞానంతో పాటు అదే స్ధాయిలో భౌతికవాద దార్శనికత పెరగకపోవడంతో నమ్మకం, మూఢనమ్మకాలు వికృత రూపం దాల్చుతున్నాయి. అవి సామాజిక, రాజకీయ అధికార కేంద్రాల రూపంలో సంఘటితమై ప్రగతిశీల శక్తులపై దాడులు చేస్తున్నాయి.  మత విద్వేష ప్రసంగాలు దేశంలో పెరిగిపోయాయి.  న్యాయపోరాటం చేసే వాళ్ళపై కేసులు పెట్టడం, విధ్వంసక దాడులకు దిగడం లాంటి కక్షసాధింపు చర్యలు దేశవ్యాప్తంగా పునరావృతం అవుతున్నాయి.   ప్రగతికీ, ప్రగతి నిరోధానికి మధ్య ఘర్షణ ఏర్పడింది.  అది అసహనానికి దారి తీసింది.  ఆ స్ధితి కవి కలవరంతో లోతైన వాక్యాలుగా పరుచుకుంది.

అప్పుడెప్పుడో/రాముడికీ-రావణునికీ/యుద్ధం జరిగిందని తెలుసుకున్నాం గానీ/ఇప్పుడు/సహనానికీ-అసహనానికీ మధ్య/యుద్ధం జరుగుతుందని మాత్రం అందరం తెలుసుకోవాల్సిన సమయం అంటాడు కవి.

రెప్పలు వాల్చి పుట్టు గుడ్డిలా అభినయించకూడదు.  ఆకుపచ్చలోయల్లోంచి గగనపు వీధిలోకి చూపుని శుభ్రం చేసుకుని చూడమంటాడు విల్సన్ రావు.
జీవన వ్యాకరణాలకు చిరునామానై తూరుపు వాకిలి తెరచుకుని నల్లరేగడి నేలలో మొక్కనై మొలిచిన ఈ దేశ దేహ క్షేత్రాల్లో వేణువై పల్లవిస్తానంటాడు.  ఇలాంటి అభ్యుదయ కవులు రావాలి ... ఇలాంటి అభ్యుదయ కవిత్వం కావాలి.

వెల : రూ.120/-
ప్రతులకు : కె. విల్సన్ రావు, 16-2-746/4,
సపోటా బాగ్, ముంతాజ్ కాలనీ, సైదాబాద్,
హైదరాబాద్ - 500 059.