పాడు కాలం !
ఇది గతాన్ని నెమరు వేసుకునే కాలం!  
ఉన్న రోజులు, బతికున్న రోజులను తలచుకుని 
లేని వారి గురించి ఒక దీర్ఘ నిట్టూర్పు 
రెండు కన్నీళ్లు కార్చే కాలం!

"ఇంకా ఎన్ని విషాద వార్తలు వినాలో "
అని క్షణ క్షణం భయపడుతూ బతకాల్సిన కాలం!
ప్రాణవాయువు దొరకక ఉక్కిరి బిక్కిరై 
ఉసూరుమని ఊపిరులొదిలేస్తున్న 
మృత్యు క్రీడల్ని  సుదీర్ఘ టీవీ సీరియళ్ళుగా 
చూడాల్సి వస్తున్న కాలం. 

"కరాల నృత్యం చేస్తున్న కరోనా " 
ఏదేదో  రాయాలని పెన్ను పట్టుకున్నా 
ఎంతకీ ముందుకు కదలని కలం
నిమిషానికొక విషాద వార్తతో 
కలాల్ని , కలలని  వెనుకకు లాగుతున్న కాలం!
ఇది పాడు కరోనా కాలం!