సమాజాన్ని, సమాజములో జరుగుతున్న సంఘటనలను అధ్యయనం చేసి, అందులోని మంచి చెడులను విశ్లేషిస్తూ, అందుకు తగిన పరిష్కారాలను చూపుతూ చేసే రచనలు పలు కాలాల పాటు నిలుస్తాయి.  ఇలా సమాజం పట్ల తన బాధ్యతను ప్రదర్శిస్తూ, వివిధ సామాజికాంశాలను తన పూలబాట శతకములో ప్రస్తావించి, సమాజానికి సన్మార్గాన్ని చూపే ప్రయత్నం చేశారు  కవయిత్రి శ్రీమతి  రావూరి వనజ.

తెలుగు సాహిత్యములో వేయి సంవత్సరాల పైబడి నేటికీ సజీవ స్రవంతిలా సాగిపోతున్నది శతక ప్రక్రియ. సాహిత్యములో ఎన్ని నూతన ప్రక్రియలు వచ్చినా శతక ప్రక్రియ మాత్రం నిత్యనూతనముగా, అజరామరముగా ఉన్నది. ప్రసిద్ధమైన ప్రాచీనమైన కవులు మొదలుకొని ఆధునిక కవుల వరకు వేలమంది కవులు శతక సాహిత్యాన్ని పరిపుష్టం చేస్తున్నారు అనేది నిర్వివాదాంశం.  ఇటువంటి శతక ప్రక్రియలో విలక్షణమైన, వైవిధ్య భరితమైన రచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు శ్రీమతి  వనజ.  ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న కొద్దిమంది కవయిత్రులలో వీరికి ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు వచన రచనలు వెలయిస్తూనే,  మరో వైపు శతక సాహిత్యములో కూడా అనేక రచనలను వీరు చేశారు.  వీరు గతములో వెలువరించిన శారదాంబ శతకముతో పాటు, ప్రస్తుతం మన ముందు ఉన్న ఈ పూలబాట శతకం, ఆముద్రితాలుగా ఉన్న జనని శతకం, తెలుగు భాషా శతకం, వాణి శతకం, వెంకటేశ్వర శతకం మొదలైన వాటిని పరిశీలిస్తే ఈ కవయిత్రికి ఉన్న పద్య రచనా పటిమ, కవిత్వంపై పట్టు మనకు గోచరిస్తాయి.

పూర్వపు మహబూబ్ నగర్ జిల్లా,  నేటి నాగర్ కర్నూల్ జిల్లాలోని పెద్దకొత్తపల్లి మండలం చంద్రకల్ గ్రామం స్వస్థలం అయిన వీరు వివాహానంతరం కుటుంబ పరిస్థితుల కారణముగా, వృత్తి రీత్యా మహబూబ్ నగర్ పట్టణములో స్థిరపడ్డారు. ఉపాధ్యాయురాలిగా వృత్తి బాధ్యతలు నిర్వర్తిస్తూనే,తెలంగాణ మహిళా సాహితీ సాంస్కృతిక సంస్థకు అధ్యక్షురాలిగా కొనసాగుతూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తూ పలువురి చేత ప్రశంసలు అందుకుంటున్నారు.  ప్రవృత్తి చేత ఒకవైపు వచన కవిత్వ ధారలను కురిపిస్తూనే, మరోవైపు ఛందోబద్ధమైన పద్య రచనలను చేస్తూ, బహుముఖీనమైన ప్రతిభను కనబరుస్తున్నారు కవయిత్రి వనజ.

ప్రస్తుతం వారు వెలువరించిన "పూలబాట శతకం" లో ఆటవెలది చందస్సులో అద్భుతమైన భావాల నిధులను అక్షరాలలో నిక్షిప్తం చేసి "వరలు పూలబాట వనజ మాట" అనే మకుటంతో మౌక్తికమాలగా కూర్చి పాఠకులకు అందించారు.

మానవులలో తప్పక ఉండవలసిన సుగుణాలైన దయ, ధైర్యం, తృప్తి, మమత, ఓపిక, శాంతం, మర్యాద, స్నేహం, పరిశుభ్రత, కఠోర శ్రమ, సమయ పాలన, తెలివితేటలు మొదలైన వాటిని మనిషి దూరం చేసుకోవాల్సిన దుర్గుణాలైన గర్వం, దూషణ, నిందలు, అసూయ, నోటి దురుసుతనం, కలత, దిగులు, బాధలు మొదలైన వాటి గురించి సరళమైన పదాలతో పాఠకుల హృదయాలను ఆకట్టుకునే ఉపమానాలు, సూక్తులు, సామెతలతో ఈ శతకములో వర్ణించి చెప్పారు.

మనం చేయు  నిత్య కర్మలలో భాగంగా మనం మన ఒంటిని, ఇంటిని, ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేనిచో అనేక రోగాల బారిన పడతామని నిన్నటి కరోనా మహమ్మారి విపత్కర పరిస్థితుల ద్వారా మనకు అవగతం అయ్యింది.  ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని వనజ గారు క్రింది పద్యాలలో తన భావాలను ఇలా వెలిబుచ్చారు.

"అన్ని రోగములకు నపరిశుభ్రత యోండె
కారణమ్ము సుమ్ము గాన నెపుడు
శుచిని శుభ్రతలను చూచుచుండుము చక్క
వరలు పూలబాట వనజ మాట"

"ఇంటి యొకటె గాదు ఇంటి చుట్టూనే గల్గు
పరిసరమ్ము లన్ని బాగుపరచి
మెరియ జేయ వలయు పరిశుభ్ర మగునట్లు.."

స్వచ్ఛమైన నీరు చక్కని భోజన
వసతులున్న చోట వ్యాధి రాదు
కాన శుచియై నరుల జ్ఞాన సంపద సుమ్ము.."

నేటి సమాజములో కొంతమంది దుర్మార్గులు ఆడపిల్లలపై చేస్తున్న అకృత్యాలను వీరు ఈ క్రింది పద్యములో ఇలా నిరసించారు.

"పండు ముసలి లేదు పసిబిడ్డ యనిలేదు
బలిసి తిరుగు చుండి పసుల వోలె
చిదిమి వేయుచుండ్రు చిన్ని పాపల నేడు.."

ఈ జగత్తులో సమస్త జీవులకు జలమే ప్రాణాధారం. ఆ నీటి యొక్క అవసరాన్ని, దాని ప్రయోజనాన్ని గురించి ఈ పద్యాలలో ఇలా సెలవిచ్చారు.

"హర్షమొందు రైతు వర్షధారల జూచి
వీలు నెఱిఁగి దున్ని విత్తు వేసి
భారముంచుచుండు వరుణదేవుని పైన.."

పుడమి యందు వాన పుష్కలముగనున్న
చెరువు లన్ని నిండు చేలు పండు
ప్రజలు సుఖపడుదురు పాడిపంటలు గల్గి.."

నేటి బాలలే రేపటి భావి నిర్ణేతలు. కాబట్టి వారిలో నైతిక, మానవీయ విలువలను పెంపొందించే విషయాలను వనజ గారు వారి పద్యాలలో తెలిపారు.

"కాలమంత వృధ గడుపబోకుము నీవు
ప్రగతిదారుల నడువ ఫలిత మబ్బు
ఫలిత మబ్బు నపుడు బ్రతుకు పచ్చగ మారు.."

ఈ విధంగా సామాజిక చైతన్యం కలిగించే విధంగా, సన్మార్గాన్ని చూపే కవయిత్రి శ్రీమతి రావూరి వనజ  "పూలబాట శతకం" సరళ సుందరంగా, మధుర మనోహరంగా, మనోరంజకముగా, సహజ సిద్ధంగా, భావ గాంభీర్యతతో, అర్థతతో, ఆత్మీయతతో, ముగ్ధ మనోహరంగా ఉంది అనుటలో ఏమాత్రం సందేహం లేదు.  ఈ శతకాన్ని విద్యార్థులు, యువత తప్పక పఠించవలసిందే.