సామాజిక చైతన్యమే లక్ష్యంగా రచనలు చేస్తున్న వేముల కోటయ్య
సామాజిక మార్పే లక్ష్యంగా రచనలు చేస్తున్న వేముల కోటయ్య పుస్తకాలను వేదార్థం మధుసూదన శర్మ సమీక్షించారు. వాటి విశిష్టతను ఇక్కడ చదవండి.
సమీక్ష: శ్రీ వేదార్థం మధుసూదన శర్మ
సామాజిక చైతన్యమే లక్ష్యముగా తన కలానికి సానపడుతూ,సామాజిక బాధ్యతతో రచనలు చేస్తూ ముందుకు సాగుతున్నారు వర్ధమాన కవి, రచయిత శ్రీ వేముల కోటయ్య. నాగర్ కర్నూల్ జిల్లా, అచ్చంపేట తాలూకా, బలమూర్ మండలం, అనంతవరం గ్రామానికి చెందిన కీ.శే.కిష్టమ్మ,చిన్నసాయిలు దంపతులకు రెండవ సంతానంగా జన్మించారు. ప్రస్తుతం వీరు కొల్లాపూర్ పట్టణంలో నివాసముంటూ, పెంట్లవెళ్లి మండలం కొండూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయులుగా దశాబ్ద కాలం నుండి విధులు నిర్వహిస్తున్నారు.
చిన్నతనంలోనే వచ్చిన పోలియో కారణముగా,విధిని ఎదిరించి,పట్టుదలతో దూర విద్య ద్వారా తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేసుకున్నారు.అంతే పట్టుదలతో 2010 లో తెలుగు ఉపాధ్యాయుడుగా ఉద్యోగం సంపాదించాడు.
వృత్తి రీత్యా ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న కోటయ్య ప్రవృత్తిగా సాహిత్యం పట్ల మక్కువను పెంచుకొని రచనలు చేయడం మొదలు పెట్టాడు. అటు పద్యాలను, ఇటు వచన కవితలను వివిధ రూపాలలో అలవోకగా రాస్తూ, పలువురు పండితుల ప్రశంసలను అందుకుంటున్నారు.
నేడు సమాజంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, బాధలు, నిత్య జీవితంలో తనకు ఎదురైన సమస్యలను, అనుభవాలను కవిత్వీకరించి "కరోనాపై జయం మనదే," "కవితా సాగరం", అనే వచన కవితా సంపుటులను, "సగరపుత్ర శతకము" అనే పద్య సంపుటిని ఏక కాలంలో వెలుగులోకి తీసుకురావడం ప్రశంసనీయం.
కోటయ్య రచనలలోని విశేషాలు
2020 సంవత్సరంలో ప్రపంచాన్ని పట్టిపీడించింది కరోనా మహమ్మారి. కనిపించని ఈ సూక్ష్మక్రిమి దెబ్బకు లక్షలాది మంది ప్రాణాలు కోల్పోయారు. కోట్లాది మంది దాని భారిన పడి, ఉపశమనం పొందారు. ఈ కరోనా భూతాన్ని ఈ లోకం నుండి తరిమివేయడానికి తమ వంతు బాధ్యతగా ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఎందరో కవులు తమ కలాలకు పదునుపెట్టి రచనలు చేశారు. శ్రీ వేముల కోటయ్య కూడా తన బాధ్యతగా 'లాక్ డౌన్' కాలంలో ప్రతి రోజు ఒక కవితను రచించి, వాటిని ఒక పుస్తకంగా తీసుకువచ్చారు.
"కరోనాపై జయం మనదే" అనే పేరుతో ఉన్న ఈ వచన కవితా సంపుటిని చదవక ముందే పాఠకులకు,కరోనా వ్యాధిని ఎదుర్కొనే విధంగా కొండంత ధైర్యాన్ని ఇస్తుంది.
"జయం మనదే" అనే కవితలో
"గజరాజును బంధించ
గడ్డి పరకలన్ని ఏకమై
తాడులాగ పేనుకున్నట్లు"
"రావణుని సంహరించ,
రామునికి సహకరించ,
రాయిరప్పలు కలిసి,
రామసేతువై నిలిచినట్లు
"ఫణిరాజును మట్టుపెట్ట,
చీమలన్ని ఏకమై,
ఐక్యంగా నిలిచినట్లుఅని చెబుతూ కరోనాను నియంత్రించడానికి
"మనో ధైర్యమే ఆయుధంగా,
మూడడుగుల దూరమే లక్ష్యంగా,
ప్రవాహమై సాగుదాం.
యుద్ధమై పొరుదాం" అంటూ ప్రజలలో ధైర్యాన్ని నూరి పోస్తాడు ఈ కవి.
అలాగే కరోనా నియంత్రణకు నిరంతరం శ్రమిస్తున్న డాక్టర్లు, ఆరోగ్య కార్యకర్తలు, పారిశుద్ధ్య కార్మికులు, పోలీసుల త్యాగాలను ప్రశంసిస్తూ శ్రీ వేముల కోటయ్య గారు "ఆ నలుగురు" అనే కవితలో
"ఆ నలుగురే సమాజానికి దిక్కులు.
ఆ నలుగురే ప్రపంచ కలల సౌధానికి మూలస్థంభాలు.
ఆ నలుగురే కరోనాపై చేస్తున్న యుద్ధంలో సిఫాయిలు.
ఆ నలుగురే పెనుభూతం కమ్మేసిన చీకట్లలో సమిధలు.
ఆ నలుగురే ప్రజల ఆరోగ్య రక్షణకు కవచాలు" అంటూ వారిపై తన అభిమానాన్ని, విశ్వాసాన్ని ప్రకటించుకున్నాడు.
"మన సంస్కృతి" అనే కవితలో
"ఉన్న దీపాన్ని ఆర్పుకొని
చీకట్లలో వెలుతురును వెతికినట్లు...."
"అభివృద్ధి మాయలో ప్రకృతిని విచ్చిన్నం చేస్తూ,
వివిధ ప్రయోగాలతో వింత పోకడలకు పాల్పడుతూ,
విషాన్ని పూసుకుంటూ,
వింత రోగాలతో ఇబ్బంది పడుతున్నాం
చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు,
నెత్తిమీద మహమ్మారి నాట్యమాడుతుంటే,
వచ్చిన దారి ఆనవాళ్లను గుర్తుచేసుకుంటున్నాము" అంటూ మన సంస్కృతి, సాంప్రదాయాల విలువలను తన కవిత్వం ద్వారా తెలియ చేస్తున్నాడు కవి.
అలాగే లాక్ డౌన్ కాలంలో చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక, స్వస్థలాలకు వెళ్ళడానికి ప్రయాణ సౌకర్యాలు లేక అవస్థలు పడుతున్న వలస కూలీల వెతలను, వారి ఆకలి కేకలను గురించి కోటయ్య ఈ సంపుటిలో అక్షరీకరించి, తన సానుభూతిని ప్రకటించాడు.
ఈ విధంగా కరోనా కాలములో ప్రజలను చైతన్యవంతులను చేసేవిధంగా ఈ కరోనాపై జయం మనదే అనే వచన సంపుటిలో అర్థవంతమైన,సందేశాత్మకమైన 22 కవితలు ఉన్నాయి.
"హితేన సహితం సాహిత్యం" అనే నానుడిని అనుసరించి శ్రీ వేముల కోటయ్య సమాజానికి హితాన్ని చేకూర్చే విధంగా, సమాజానికి కనువిప్పు కలిగించే విధంగా, సమాజాన్ని మేలుకొలిపే విధంగా, సమాజాన్ని చైతన్యం చేసే విధంగా రాసిన మరో కవితా సంపుటి "కవితా సాగరం".
సమాజంలోని వారందరికీ తను కాయాకష్టం చేసి, తిండిపెడుతున్న రైతన్న కష్టాలను, అతని శ్రమను గురించి చెప్తూ కోటయ్య "మట్టిలో మాణిక్యం" అనే కవితలో
"కోడి కూయంగా లేచి కాడెడ్ల బండి కట్టి,
సేద్యమొక్కటే నాకు దేశసేవ యంటూ,
అమ్మ ఒడినిండా విత్తనాలు జల్లి,
చల్లంగ ఎదగమని తండ్రివలె, దీవిస్థివన్నా" అంటూ
"ఎదిగివచ్చిన పంట ఏపుగా పెరుగంగ,
సంతోషమున నీ మనసు రివ్వున ఎగురంగ,
కనికరించని వాన కనుమరుగవ్వంగ,
ఆశలన్నీ చూడ ఆడియాసలవ్వంగ" అని రైతు బాధలను ఊటంకిస్తూ
"నిన్ను ఆదుకొనగ దాతైన లేడాయే,
దిక్కు తోచని నీవు దిక్కుల పాలై,
కళ్ళ నిండా నీరు, గుండెంత చేరువై,
ప్రాణదాతవు నీవు స్వర్గానికి చేరితివి".అని రైతుల ఆత్మహత్యలను ప్రస్తావించాడు.
"కల్లోల భారతం" అనే మరో కవితలో
"కామాంధుల హస్తాల్లో,
పసిపిల్లలు, పడతుల ప్రాయాలు
పువ్వులోలె నలుగవట్టే
శిక్షలేమో కరువాయె
రక్షనేమో బరువాయె" అంటూ స్త్రీలు, పసిపిల్లలపై జరుగుతున్న పాశవిక ఆకృత్యాలను ఎండగడుతాడు కవి.
"లంచాలకు మంచాలు
సాక్ష్యాలు తారుమారు
అవినీతి తిమింగలాల
అడ్డదారి బాగోతాలు
అవినీతి పరులకాయె
ఆదుకునే ఆసనాలు"అని సమాజంలో విచ్చలవిడిగా సాగుతున్న అవినీతిని ప్రస్తావించాడు కోటయ్య.
"పల్లె తల్లి" అనే కవితలో పల్లెల గొప్పతనాన్ని, పల్లె సంస్కృతిని కళ్ళకు కట్టినట్లుగా ఇలా చెప్పాడు.
"మమకారాలు పంచుతూ
ప్రేమ పూలు పూయిస్తూ
మతములన్నవే లేని
మమతల కోవెల మా పల్లె" అని చెప్తూ..
"ఇల్లు ఇరుగ్గా ఉన్నా
మనసు విశాలం
మెడలేమి లేకున్నా
పసిడి రాసుల గంధం మా పల్లె" అని, పల్లె గొప్పతనాన్ని చెప్తూ..
"ఇటువంటి పల్లెనొదిలి
పట్నమంటు నీవు
పరుగులెన్నో పెట్టి
గతుక గంజి లేక ఏడ్చి ఏడ్చి
ఏమి సాధించావు నీవు
తల్లి లాంటి పల్లెనొదిలి" అని.. పట్నాలకు వలస వెళ్తున్న వారికి తన కవిత్వం ద్వారా కనువిప్పు కలిగించాడు.
ఈ కవి తన బాధ్యతగా "రాజీ పడలేక" అనే కవితలో
"సమాజ వీదుల్లో
పేరుకు పోయిన చెడునంత
తుడిపివేయ డస్టర్ చేతబడితి
సూక్తులెన్నో చెప్ప
సుద్ధముక్కబడితి
సమాజంలో వెలుగునింప
కలం బడితి" అని చెప్తాడు.
ఈవిధంగా వివిధ సామాజిక అంశాలతో కూడిన నలభై కవితలు ఉన్న ఈ కవితా సాగరంఅనే ఈ వచన కవితా సంపుటి లోని కవిత్వం చిక్కని కవిత్వ ధారలతో,చక్కని సందేశాన్ని ఇస్తుంది.
శ్రీ వేముల కోటయ్య వచన కవితలో మొగ్గలు, మణిపూసలు వంటి వినూత్న ప్రక్రియల్లో రచన చేస్తూ, చందోబద్ధమైన పద్యరచనను కొనసాగించడం ఇక్కడ మనం ప్రశంసించవలసిన విషయం. ఆటవెలది చందస్సులో "సగరపుత్ర శతకము" అనే పుస్తకాన్ని కూడా వెలువరించాడు. "సత్యమిదియె మిత్ర! సగరపుత్ర!" అనే మకుటంతో సాగిన ఈ శతకంలోని 108 పద్యాలు మౌక్తికాలే. అంటే ఇందులోని పద్యాలు వేటికవే స్వతంత్ర భావాన్ని కలిగి ఉన్నాయి. ఇందులో కూడా శ్రీ వేముల కోటయ్య సామాజిక అంశాలనే ప్రస్తావించాడు.
"పురిటి నొప్పులోర్చి పుడమి తల్లిని జేర్చి
జన్మనిచ్చి జనని జగముజూపు
అట్టి మాతకెపుడు నాపదల్ రానీకు
సత్యమిదియె మిత్ర! సగరపుత్ర!" అని మాతృమూర్తికి వందనం సమర్పించాడు.
"అంతరిక్షమందు నడుగిడితిననియు
గొప్ప జెప్పు నరుడ! గొప్పయేది?
చిన్న దోమనైన చిదమక పోతివి
సత్యమిదియె మిత్ర! సగరపుత్ర!" అని నేటి కరోనా మహమ్మారిని నియంత్రించడానికి దారి లేని విధానాన్ని ఈ పద్యంలో ఎండగట్టాడు కవి.
"ఆలినెపుడు నీవు నాగంబు జేయకు
భార్యలేని బ్రతుకు భారమగును" అని భార్య గొప్పతనాన్ని, వారి పట్ల భాధ్యతను,
"భాధలెక్కువుండు బాధ్యతగా నున్న
నిందలెక్కువుండు నీతిగలుగ
శిలల దెబ్బలన్ని ఫలవృక్షములకెగా" అనే జీవిత సత్యాన్ని తన పద్యాలలో తెలిపాడు.
"నిందవేయబోకు నిజము తెలియకుండ
మాటయన్న పిదప మార్చలేము
చెడ్డవాని మాట చెరువును మదియంత" అని,
"ఇరుగుపొరుగు వారలిబ్బంది పెట్టినన్
సహన గుణము తోడ సర్దుకొనుము
శాంత గుణము మిన్న! జగమందు పరికింప" అనే నీతి సూత్రాలను కూడా నొక్కి వక్కాణించాడు.
ఇలా శ్రీ కోటయ్య గారి ఈ సగర పుత్ర శతకంలో ప్రతి పద్యం ఏదో ఒక నీతిని చెబుతుంది.తల్లి,భార్య,స్త్రీ,దేశం,జలం,కొడుకులు,పాలకులు,కులమతాలు,మంచి,చేదు మొదలైన ఎన్నో అంశాలు ఇందులో ఆటవెలది పద్య రూపములో చెప్పబడ్డాయి.
ఈ విధంగా శ్రీ వేముల కోటయ్య రచించిన ఈ మూడు పుస్తకాలు వైవిధ్య భరితమైన అంశాల మేళవింపుగా, సామాజిక చైతన్యం కోరే అనర్ఘ రత్నాలుగా, చీకట్లలో వెలుగులను నింపే విజ్ఞాన జ్యోతులుగా, విద్యార్థులను, యువకులను సన్మార్గంలో పెట్టే దారి దీపాలుగా ఉన్నాయనుటలో ఏ మాత్రం అతిశయోక్తి లేనేలేదు.