పుస్తక సమీక్ష: పూల సింగిడి

డా.పోలా సాయి జ్యోతి స్వీయ కవితా సంపుటి "చైతన్య జ్యోతి" ని వేదార్థం మధుసూదన శర్మ, కొల్లాపూర్ నుంచి సమీక్షించారు. 

Vedartham Madhusudan Sharma reviews Sai Jyothi poetry book

నేటి సమాజములో మానవతా విలువలను పెంపొందించుటకు, సామాజిక ప్రగతి సాధించుటకు, సమాజములోని లోటుపాట్లను ఎత్తి చూపి, వాటికి పరిష్కార మార్గాలను సూచించుటకు, గొప్పనైన సంస్కృతి, సంప్రదాయాలను గురించి తెలియజేయుటకు, సన్మార్గానికి దారిదీపాలైన మహనీయుల చరిత్రను భవిష్యత్తు తరాల వారికి అందించుటకు సాహిత్యము ఏకైక మార్గమని తన కవిత్వము ద్వారా పాఠకులకు తెలియజేసేందుకు మన ముందుకు వచ్చారు డా.పోలా సాయి జ్యోతి గారు.

నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రానికి చెందిన వీరు ప్రస్తుతం అచ్చంపేటలో స్థిరపడ్డారు.
వీరు తెలుగు భాషా అధ్యాపకురాలిగా విద్యార్థులకు తెలుగు భాషాసంస్కృతులను గురించి తెలియజేస్తూనే,  సమాజము లోని ప్రతి ఒక్కరికీ తన కవిత్వం ద్వారా హితబోధ చేస్తున్నారు."హితేన సహితం సాహిత్యం " అన్నారు కదా పెద్దలు.
   
 ఉమ్మడి పాలమూరు జిల్లాలో తెలుగు సాహిత్యములో రాణిస్తున్న అతి కొద్దిమంది మహిళల్లో శ్రీమతి పోలా సాయిజ్యోతి ఒకరు. వీరు రచించి, ప్రచురించిన "చైతన్య జ్యోతి" కవితా సంపుటిలో ఉన్న కవితలన్నీ వివిధ సందర్భాలలో రాసినవి.  అనేక కవితా సంకలనాలలో ప్రచురించబడినవి, వివిధ కవి సమ్మేళనాలలో చదివినవి. ఆయా కార్యక్రమాల నిర్వాహకులు విధించిన నిబంధనల మేరకు ఇవి రాయబడినవి కాబట్టి రాసిలో చిన్నవైన వాసిలో గొప్పవి.  కవితలను చదువుతూ వెళ్తుంటే అప్పుడే అయిపోయిందా అనిపిస్తుంది.  వారు చెప్పిన విధముగా కొన్ని వాక్యాలలోనే విషయాన్ని చెప్పడం కత్తి మీద సాము వంటిది.  పాఠకులను ఆకట్టుకునేలా, పరిధి లోపల రాయడం అనేది ఎంతో చాకచక్యంతో కూడిన పని.  అయితే ఆ పరిధిని దాటకుండా ఆయా అంశాల గురించి తనదైన శైలిలో అద్భుతమైన కవిత్వాన్ని రాసి సాహిత్యజ్యోతిగా పలువురి చేత ప్రసంశలు అందుకున్నారు ఈ కవయిత్రి.

అరవై కవితలు ఉన్న ఈ పుస్తకములో శ్రీమతి సాయి జ్యోతి మొదటగా తన ఇష్ట దేవతలైన శ్రీ గణేశుడు,శ్రీ వేంకటేశ్వరుడు మొదలైన వారికి ప్రాణామములు అర్పించి,ముందుకు సాగింది. పూర్వ కవులైన పోతన, సురవరం, యశోదారెడ్డి, పి. వి, సినారె, కపిలవాయి తదితర సాహితీ మూర్తుల భాషా సేవలను స్మరించుకోవడం అనేది మంచి సంప్రదాయం.

 పాలమూరు పారిజాతం, కందనూలు కవి కేసరి స్వర్గీయ కపిలవాయి లింగమూర్తి గారి సాహితీ సేవను గుర్తు చేసుకుంటూ... 'కవికేసరి కపిలవాయి'  కవితలో
"సాహితీ సుక్షేత్రములో
అక్షరామృతముతో
పుట్లకు పుట్లుగా
పద్యాలు పండించావు.
పురాణ ఇతిహాసాలను
పుక్కిట బట్టిన నీవు,
సంస్కృతాది నిఘంటువులను
సంస్కరించిన సంస్కర్తవు"--  అంటూ వారికి అక్షర నీరాజనాలు అర్పించారు.

తర్వాత వీరు అనేక సామాజికాంశాలు అయిన తెలంగాణ, శిల్పి, ఓటు విలువ, జలం, శ్రమైక జీవనం, వృద్ధాప్యం, వరకట్నం, కాలుష్యం, పాలమూరు, కందనూలు ఘనత మొదలైన అంశాలను స్పృశిస్తూ కవితలు రాశారు.
'వృద్ధాప్యం' అనే కవితలో
"వృద్ధుల అనుభవాలే
భూతకాలపు తీపి గుర్తులు
భావి తరాలకు ఖాజానాలు
వర్తమానానికి వెలుగు దివ్వెలు" --అని చెప్పింది.
'ఓటు విలువ' అనే మరో కవితలో
"పరిపాలన సజావుగా సాగాలన్నా
సరైన నేతలకు పగ్గాలు ఇవ్వాలన్నా
ప్రజల జాతకాలు మారాలన్నా
భ్రష్టు పట్టిన వ్యవస్థకు చరమ గీతం పాడాలన్నా
ప్రజాస్వామ్య వ్యవస్థ పదిలంగా ఉండాలన్నా
ప్రజల మనోభీష్టాలు నెరవేరాలన్నా
పౌరులకు ఓటే వజ్రాయుధం"--అని నొక్కి వక్కాణించింది.

వీరు ఇంకా మన సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పట్టే  పండగలైన ఉగాది, బతుకమ్మ, బోనాలు, రాఖీల గురించి తన కవిత్వములో చక్కగా తెలియజేసారు.
మాతృభాషా గొప్పతనాన్ని వీరు సాహిత్యం, అక్షరమాలిక, జ్ఞానదీపం, తెలుగు భాష, జ్ఞానకోవెల, మాతృ భాషా వంటి కవితల్లో తనదైన శైలిలో చిత్రించారు.

'ఓ సాహిత్యమా!' అనే కవితలో
"మానవతా విలువలు వెల్లివిరియాలన్నా
సమాజములో లోటుపాట్లను విప్పి చెప్పాలన్నా
ప్రజల్లో సామాజిక స్పృహను కలిగించాలన్నా
ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నా
కావాలి సాహిత్యం"--అని చెప్తూ, పుస్తకం పేరైన 'చైతన్య జ్యోతి' ని సార్థకం చేశారు.

అంతేకాకుండా భారతదేశ రక్షణ కొరకు తమ కుటుంబం, భార్యా పిల్లలను వదలి, ప్రాణాలను సైతం లెక్క చేయక, విపత్కర పరిస్థితులలో సరిహద్దుల్లో పహారా కాస్తున్న వీర సైనికుల ప్రాణ త్యాగాలను స్మరించుకుంటూ 
'ఓ వీరజవానులారా' అనే కవితలో
"పుల్వామా దాడిలో
అసువులు బాసిన
మీ రక్తధారలు,మాంసపు ముద్దలను
చూసి అశ్రునయనాలతో
జాతి కన్నీరు పెడుతుంటే
ఏమిచ్చి మీ రుణం తీర్చుకోవాలి"--
తన కవిత్వము ద్వారా శ్రద్ధాంజలి ఘటించారు.

నేడు ప్రపంచం మొత్తాన్ని కంటిమీద కునుకు లేకుండా చేసి, తన ప్రతాపంతో ఎన్నో లక్షల మంది ప్రాణాలను బలి గొంటున్న కరోనా మహమ్మారి గురించి, దాని ప్రతాపం గురించి రక్కసి కరోనా, కరోనా నీ ఆటలు కట్, ఓ రాబందు కరోనా, ఊరంతా విహారం, మహమ్మారి కరోనా, ఇల్లే కైలాసం వంటి శీర్షికలతో 10 కవితల్లో తెలియజేసింది.  ఈ మహమ్మారిని నిలువరించుటకు ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ సందర్బంగా చేయడానికి పనిలేక, తినడానికి తిండిలేక సొంత వూరికి వెళ్లి, కలో గంజో తాగుదామని బయలుదేరిన వలస కార్మికులకు సరైన రవాణా సౌకర్యాలు లేక కాలినడకన మైళ్ళ కొద్దీ ప్రయాణిస్తున్న వారి కష్టాలను గురించి తన కవితల్లో చక్కగా వివరించింది సాయి జ్యోతి.

అంతే కాకుండా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరిస్తూ బంగారు తెలంగాణ, మిషన్ భగీరథ, కెసియార్ వంటి కవితల ద్వారా తన కృతజ్ఞతను చాటుకున్నారు. ఇంకా తనకు జన్మనిచ్చిన అమ్మ నాన్నల గురించి, భార్య గొప్పతనం గురించి లోతుగా కవిత్వీకరించింది.
'అమ్మ' అనే కవితలో
"నవమాసాలు మోసి
ప్రాణాలను ఫణముగా పెట్టి
ఈ లోకానికి కొత్త ప్రాణినందించి
తన రక్తాన్ని పాలగా మార్చి
శిశువుకు ప్రాణం పొసే
అమ్మే మన పాలిట బ్రహ్మ"--అని మాతృమూర్తి రుణం తీర్చుకోలేనిది అని చెప్పింది.
అలాగే మానవీయ విలువల గురించి, మానవ సంవేదనలు అయిన సంతోషము, ఆనందం, మొదలైన వాటి గురించి గొప్పగా తన కవితల్లో చిత్రించారు.
ఈ విధంగా వైవిధ్యభరితమైన అంశాలను కవిత్వీకరించి, వాటిని ఒక్క చోట రాసిపోసినట్లుగా ఉన్న   ఈ పుస్తకాన్ని ఒక పూల సింగిడిగా పేర్కొనవచ్చు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios