దిశా నిర్దేశనం సరైనది ఉండాలే కాని "తక్కువేమి మనకూ...!"
దిశా నిర్దేశనం సరైనది ఉండాలే కాని "తక్కువేమి మనకూ...!"అంటున్న శ్రీమతి టి. శ్రీవల్లీ రాధిక గారి కథాసంపుటి
"శివ ధనుర్భంగం జరుగుతున్నపుడు వరమాల పట్టుకుని నిల్చున్న జానకిలా అనిపించింది." ఈ వాక్యం పాఠకులని తమ జీవితాల్లోని తొలి చూపుల ఙ్నాపకాల్లోకో లేక అటువంటి అనుభూతుల యెదురుచూపులకో తీసుకువెడుతుంది అని చెప్పడంలో పెద్దగా సందేహించక్కర్లేదు. ఇలా హృదయాన్ని హత్తుకునే, తట్టిలేపే, అవుననిపించే లేదా కాదనిపించే వాక్యాలు ఈ సంపుటిలో మనకు చాలా ఉన్నాయి. అండర్ లైన్ చేసుకునే వాక్యాలు అన్నమాట.
ఉత్తమ రచన పాఠకుడి స్థాయిని పెంచాలి. ఆలోచింపచేయాలి. అనుభూతులనివ్వాలి. అప్పటి వరకు తమ అనుభవంలోకి రాని అనుభవాల పరిచయం కొంత ఉంటే అనుభవంలోకి వచ్చిన అనుభవాల బేరీజు మరి కొంత. ఒక పుస్తకం వంద పాఠాలని నేర్పుతుంది. సంఖ్య సంగతి అటుంచితే , ప్రతీ పుస్తకం యేదో పాఠాన్ని, పరిఙ్ఞానాన్ని నేర్పుతుంది ,తెలుపుతుంది. మనసుని లేదా మెదడుని యే మాత్రం స్పృశించని రచన యెక్కువ కాలం నిలిచి ఉండలేదు. రచయిత తన మానస పుత్రిక (రచన) పట్ల అశ్రద్ధ వహించినట్టే. ఆ పొరపాటు ఈ రచయిత్రి చేసినట్లు యెక్కడా కనపడలేదు. అతిశయోక్తిగా అనిపిస్తే పాఠకులు కథా సంపుటి చదివి నిర్ణయించవచ్చు.
ఈ కథా సంపుటిలో మొత్తం 12 కథలు ఉన్నాయి. స్వర్గీయ వాకాటి పాండురంగా రావు గారి స్మారకార్థం జాగృతి వారు నిర్వహించే దీపావళి కథల పోటీ లో ప్రథమ బహుమతి పొందిన "తక్కువేమి మనకూ...!" అన్న కథానిక పేరు ని ఈ కథా సంపుటికి పెట్టడం జరిగింది. . ఈ పుస్తకానికి మొదటి ఆభరణం దీని ముఖ చిత్రం అని రచయిత్రి తన "కృతఙ్ఞతల్లో" చెప్పారు. అది ముమ్మాటికీ నిజం. కారణం అది బాపు గారి కుంచె నుండి జాలువారిన చిత్రం . అలాగే ఈ సంపుటికి ప్రముఖ రచయిత , వ్యాసకర్త, తీరంధ్రా, రాయలసీమ,తెలంగాణా మూడు మాండలీకాలలోనూ నవలలను రచించిన డా. పోరంకి దక్షిణాముర్తి గారు “కథానికాకల్పవల్లిక సుమా, ఈ రాధిక.. అంటూ "..'రాస్తే ఇలాంటి విషయాన్ని ఎంచుకోవాలి; ఇలాంటి విధానంలో కథ నడపాలి; ఈ విధంగా కథ ముగించాలి,' అనిపించేటట్టు- అని అందరికీ చెప్పాలనిపించేటట్టు - ఉండటం ఏ రచయతకైనా ప్రతిష్టాకరమే. ఆ ప్రతిష్టా ఈ రచయిత్రికి ఇప్పటికే వచ్చిందన్నది తాత్పర్యం.” అంటూ తమపరిచయ వాక్యాలు వ్రాయగా, సాహిత్య అకాడమి పురస్కార గ్రహీత , దాదాపు మూడు వందలకి పైగా పరభాషా రచనలను తెలుగులోకి అనువాదం చేసి తెలుగు వారికి గొప్ప సాహిత్య సంపదని అందించిన శ్రీ మాలతీచందూరు గారు వారి అభిప్రాయాన్ని వెలిబుచ్చుతూ "ఈ కంపూట్యర్ యువతి, ప్రాచీన సంస్కృతికి ,తాత్వికతకు ఈనాటి కంపూట్యర్ వేగానికి మధ్య ఒక సమన్వయం వెతికి, ఆ సారాన్ని పాఠకులకి అందిస్తున్నారు" అని ఈ కథా సంపుటి యొక్క సారాన్నీ ,రచయిత్రి అంతరంగాన్నీ పాఠకులకి ముందుగా కొద్దిగా రుచి చూపించారు. కథా సంపుటి లోని 12 కథలు చదివిన పిమ్మట యెవరి మనో ఆరగింపు వారిది. రచయిత్రి శ్రీమతి టి.శ్రీవల్లీ రాధిక గారు ఎలెక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ లో ఎం.టెక్ చేసి రాబర్ట్ బాష్ ఇండియా లిమిటెడ్ వంటి ప్రసిద్ద సంస్థలలో సాఫ్ట్ వేర్ ప్రాజెక్ట్ మానేజర్ గా ఉద్యోగ బాద్యతలు నిర్వర్తించారు. పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ రచయిత్రి కీర్తి పురస్కారం, ఢిల్లీ కథ సంస్థ వారి అవార్డ్, ఇలా ఎన్నో పురస్కారాలు పొందిన శ్రీవల్లీ రాధికా గారు రచనా రంగంలోనూ తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని, గుర్తింపును ఏర్పరచుకున్నారు. ఇది వీరి నాల్గవ కథా సంపుటి.
"తక్కువేమీ మనకూ… రాముడు ఒక్కడుండు వరకు..." అన్న రామదాసు వారి మాటని "తక్కువేమీ మనకూ…” అంటూ అర్థోక్తిలో ఆపి , రచయిత్రి సంపుటిలో యేడవ కథ కి పెట్టారు. "పట్టుకోవల్సిన దాన్ని పట్టుకుంటే భయమూ,దైన్యమూ, అఙ్ఞానమూ యేదీ ఉండదు కదండీ! " అని నిత్య పాత్ర ద్వారా పలికించిన మాటాలు, అదీ రామాలయంలో ఆ సన్నివేశాన్ని రచించడమూ ఈ కథ కి ఆ పేరే ఉచితమైనదని అనిపించక తప్పదు.
ముఖ చిత్రం చూసి కథల్లోకి వెల్లిన పాఠకుడు శీర్షిక “తక్కువెమీ మనకూ...!” కథ చదివాక తిరిగి మరోసారి ముఖ చిత్రం గమనిస్తే కథానాయిక “నిత్య” బాపు గారి గీతల్లో దర్శనమిస్తుంది. అలాగే రామదాసు వారి కీర్తన మరోసారి సాంతం చదవడమో, పాడడమో, వినడమో చేస్తారు పాఠకుడు.
ప్రశ్నిచడం పట్ల వైముఖత లేనప్పటికీ దేన్ని ప్రశ్నించాలో దేన్ని ప్రశ్నించకూడదో స్పష్టత ఉండాలి అంటారు ఈ కథా రచయిత్రి. ఇందులోని మూడవ కథ "శ్రధ్ధ"లో "అడిగిన ప్రతీ దానికీ కారణం చెప్పి విఙ్ఞానాన్ని అందించడమే కాదు, ఇక మీదట పిల్లలకి శ్రధ్ధని నేర్పడం మీదకూడా శ్రధ్ధ పెట్టాలి" అని శారద పాత్ర అంతరంగంలోని ఈ మాటలు ఈనాటి డిజిటల్ ప్రపంచానికి నూటికి నూరు పాళ్ళూ సరిపోతాయి. ఆధునిక విఙ్ఞానమో ,అఙ్ఞానమో ,తెలీదు కాని , పెద్దలు ఇలా చెప్పారు అనుసరించండి అంటే వినే బుధ్ధిమంతులు కరువైయ్యారు అన్నది కాదనలేని సత్యం. “సహధర్మచారిణి కథలో " భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకునే పనులు తగ్గించుకోవడం కాదన్నయ్యా. కల్పించుకోవాలి....ఇద్దరూ కలిసి కొన్ని పనులు చేయడం సాహచర్యం."అని పూర్ణ పాత్ర ద్వారా స్వతంత్రానికి , సాహచర్యానికి ఉన్న వ్యత్యాసాన్ని తెలిపే ప్రయత్నం చేసారు రచయిత్రి.
ఈ కథా సంపుటిలోని పాత్రలు మనకు ఎక్కడో తారసపడ్డట్టూగానూ లేక ఆ పాత్రల ఛాయ కొద్దిగా ఉన్నట్టూగానో అనిపిస్తుంది. అలాగే కొన్ని పాత్రలు ఇలాంటి వ్యక్తులు ఇవాల్టి కాలంలో ఉన్నారా! ఉంటే బాగుండు అనే ఆశని ,ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. అయితే కొన్ని పాత్రలు మన ఇంట్లోనో లేక మన చుట్టుప్రక్కలో చూసినట్లుగా ,బాగా పరిచయం ఉన్నట్టుగా అనిపిస్తాయి.
“సత్యానికి చేరువగా” కథలో "అవునమ్మా నువ్వు సత్యానికి దగ్గరగానే ఉండు. దూరంగా వెళ్ళకు .." అన్నపుడు సత్యం అనేది కేవలం పాత్ర యొక్క పేరుగా కాక జీవితంలో గ్రహించవలసిన, ఒప్పుకోవలసిన సత్యాల గురించి కూడా అని అనిపిస్తుంది పాఠకుడికి. అలాగే అదే కథలో "...ఒక రకంగా ఆలోచిస్తే, నాన్నకి తను యేనాడూ ఏమీ చేయలేదన్న న్యూన్యత కూడా వాడి మనసులో ఏమూలో ఉందేమో! అది ఎదుటివారు యెక్కడ యెత్తిచూపుతారోనన్న భయమే వాడి చేత అలా మాట్లాడిస్తోందేమో !" అన్నపుడు ఇదే మనుషుల సహజ ప్రవృత్తి కదా అని ఆలోచింపచేస్తుంది.
సౌందర్యం కథలో పర స్త్రీని జగన్మాతగా దర్శించిన పూజారి గారి అబ్బాయి సౌందర్యారాధనా ఒకరికి, "...అతని కళ్ళల్లో తలుక్కుమన్న మెరుపు..." అన్న భౌతిక ఆకర్షణ మరొకరికి అనుభవం కాగా ఒకే సత్యాన్ని ఇద్దరు స్నేహితురాళ్ళు వేరు వేరు అనుభవాల ద్వారా దర్శిస్తారు. అలాగే, మనో నిగ్రహానికి, ఒత్తిడికీ సంబంధం లేదు అంటూ విముక్తి కథలో "…ఇంద్రియాలకి బానిస అయిన మనసు..క్రోధానికి , లోభానికీ కారణమవుతుంది.." అంటూ "బుధ్ధి వెనుక మనసుని నడిపిస్తే మన స్వేచ్చని హరించేవి, ఒత్తిడినీ పెంచేవి..అన్నీ వాటంతట అవే ఉనికిని కోల్పోతాయి.." అని ధ్యానమూ, వ్యక్తిత్వ వికాసమూ అంటూ చెప్పే పాఠాలని చాలా సూక్ష్మంగా , సరళంగా, సున్నితంగా వివరించిన తీరు అభినందనీయము.
ప్రతీ కథా, విషయపరంగా దేనికదే విభిన్నమైనప్పటికీ దాదాపు అన్ని కథల్లోనూ అంతర్లీనంగా తాత్వికత,పారమార్థికం ఇమిడి ఉన్నాయి. అయితే ఈ ఆధునిక యుగంలో వాటిని అనుసరిచడం మూర్ఖత్వంగా భావించేవారికి ఆ చింతన ఈ కాలంలో మరింత ఉన్నతి కి ఎలా దోహదపడుతుందో చాలా చక్కగా పాత్రల ద్వారా పలికించారు. వేగంగా పరిగెడుతున్న సమాజంలో ఒక్క నిమిషం మనల్ని ఆపి మన చుట్టూ ఉన్న పరిసరాల గురించి , అనుసరిస్తున్న విధానాల గురించి, మారుతున్న ,మారిన సమాజపు పోకడల గురించి , విలువల గురించి స్పృహ కలిగించే ప్రయత్నం చేసిన ఈ కథా సంపుటి తప్పక చదవవలసినదే..
కథా సంపుటి పేరు :"తక్కువేమి మనకూ..!"
ప్రథమ ముద్రణ : 2012
మొత్తం కథలు :12, పేజిలు : 110, వెల: 90/-
ప్రచురణ: ప్రమథ ప్రచ్రణలు, హైదరాబాదు
పుస్తకాలకై :
5-4-345,రోడ్ నెం.5,
కమలానగర్,వనస్థలిపురం,
హైదరాబాదు-70.
ఈ-మెయిల్:valli.radhika@gmail.com
వీరి పుస్తకాలు అంతర్జాలంలో కూడా లభించును.
----డా.వరిగొండ సత్య సురేఖ