అందుకున్నాను : "అర్దళం- నా జీవన నాటక రంగం”- శేషభట్టర్ నరసింహాచార్యులు
ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య తన కరోనా కవితా సంకలనంతో పాటు మరో పుస్తకం జత చేసి పంపారు. అది “అర్దళం- నా జీవన నాటక రంగం- శేషభట్టర్ నరసింహాచార్యులు” గారి జీవిత చరిత్ర. ఆసక్తిగా తెరిచి చదవడం మొదలు పెట్టాను నిజంగా ఆశ్చర్యం, ఆనందం.
గొప్ప విషాదం. మహా కళామూర్తి శేషభట్టర్ నరసింహాచార్యులు ఈ నెల అయిదవ తేదీ ఉపాధ్యాయ దినోత్సం రోజున ఉదయం తన 89వ ఏట కన్ను మూశారు. ఉపాధ్యాయులుగా తన జీవితాన్ని గడుపుతూనే ప్రవృత్తి రీత్యా నాటక రంగానికి సేవ చేసిన మహానీయుడాయన. విచిత్ర మేమిటంటే రేపే వారి జన్మదినం. ఆ మహనీయునికి నివాళి అర్పిస్తూ ఇవ్వాల్టి “అందుకున్నాను”
'దునియా ముట్టీమే’, ‘ప్రపంచం కుగ్రామమయి పోయింది’ అనే మాటలు వింటూ వుంటాం. ఇంటర్నెట్ ప్రపంచాన్ని దగ్గర చేసింది అని కూడా అంటూ వుంటారు. కానీ నిజానికి మనం నిలబడ్డ నేల పరిమళమే మనకు తెలీదు. మన చుట్టూ వున్న కళలూ కళాకారుల గురించీ తెలీదు. అంతగా మన నుంచి మనం దూరమయిపోతున్నాం. ఇది వాస్తవం. దానికి ఉదాహరణ శేషభట్టర్ నరసింహాచార్యులు. నాగర్కర్నూల్ లో గత 6-7 దశాబ్దాలుగా నాటక రంగానికి ఆయన చేసిన సేవ నిరుపమానమయింది. ఆయన జీవితచరిత్ర చదవడం గొప్ప అనుభవం. తెలంగాణా సాంస్కృతిక చరిత్రకు చెందిన ఒక పాయను చూడ్డమే.
ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య తన కరోనా కవితా సంకలనంతో పాటు మరో పుస్తకం జత చేసి పంపారు. అది “అర్దళం- నా జీవన నాటక రంగం- శేషభట్టర్ నరసింహాచార్యులు” గారి జీవిత చరిత్ర. ఆసక్తిగా తెరిచి చదవడం మొదలు పెట్టాను నిజంగా ఆశ్చర్యం, ఆనందం. ఓ మారుమూల తెలంగాణా వూర్లో బతకలేని బడిపంతులుగా ఉంటూ అనేక కష్టాల నడుమ కళాకారుడిగా నిలబడ్డ ఆయన జీవితం గొప్ప ప్రేరణ. అంతే కాదు నాటక రంగంలో శేషభట్టర్ నరసింహాచార్యులు గారు నిస్వార్థంగా చేసిన కృషి, పడ్డ కష్టాలు, అందించిన కళాసేవ అబ్బురమయింది.
శేషభట్టర్ నరసింహాచార్యులు గారి గురించి వారు నాటక రంగానికి చేసిన కృషి నాకు ఈ పుస్తకం చదివితే తప్ప తెలీకపోవడం ఎంతో వేదన కలిగించింది. ఒక వ్యక్తిగా ఒక కళాకారుడిగా ఆయన చేసిన కృషిని చూస్తే నిజంగా ఒక వ్యక్తి ఇంత పని చేయడం సాధ్యమా... అదీ ఒక మామూలు వూర్లో ఉంటూ.. అబ్బురపరిచే స్పూర్తివంతమయిన విషయం.
అర్బన్, సెమీ అర్బన్ ప్రాంతాల్లో ఉంటున్న నా లాంటి వాళ్లకు నాటకాలు, జానపద కళలలని వీక్షించే అవకాశం అతి తక్కువ. నాకయితే కరీంనగర్లో 80ల్లో శ్రీ కే.ఎస్.శర్మ కలెక్టర్ గా వున్నప్పుడు నిర్వహించిన అవతరణ దినోత్సవాలు, చైతన్య కళాభారతి, త్యాగరాజ లలిత కళాపరిషద్ లాంటి సంస్థలు వేసిన నాటకాలే గుర్తు. తర్వాతి కాలంలో జానపద కళల పట్ల ఆసక్తితో గ్రామాల్లోకి వెళ్లి చూడడం “మిత్తుల అయ్యవార్ల కడ్డీ వాయిద్యం” లాంటి వాటిని డాక్యుమెంటరీ చేసే ప్రయత్నం మాత్రం చేయగలిగాను. కాని శేషభట్టర్ నరసింహాచార్యులు లాంటి వారి కృషి నిరుపమానమయింది. ఆయన తన జీవన నాటక రంగం గురించి రాయడం భావి తరాల వారికి గొప్ప ప్రేరణ కలిగించడం తపాటు గొప్ప చరిత్రను నిక్షిప్తం చేసారు. ఆయన మాటల్లోనే చెప్పుకుంటే ‘ఇది నా గొప్పలు చెప్పుకోవడానికి కాదు, వారికి ప్రేరణ కలిగిస్తుందని మాత్రమే’ అన్నారు. రచయితగా శేషభట్టర్ నరసింహాచార్యులు అనేక ప్రహసనాలు, నాటికలు, హరికథలు, పలు కీర్తనలు రాసారు. 1970 నించి మూడు దశాబ్దాలకు పైగా మహబూబ్ నగర్ జిల్లాలో శ్రీకృష్ణ తులాభారం, సతీ సావిత్రి, సత్య హరిశ్చంద్ర, రాయబారం, బాల నాగమ్మ, వీర పాండ్య కట్ట బ్రాహ్మణ లాంటి అనేక నాటక ప్రదర్శనల వెనుక ఆయన కృషి నిరుపమానమయింది. తానే స్వయంగా కళాభారతి అన్న సాంస్కృతిక సంస్థను నెలకొల్పి నాటక రంగ వికాసానికి కృషి చేసారు. నాటకాలకు అవసరమయిన కర్టెన్లు, నటీ నటుల దుస్తులు, కిరీటాలు, ఆయుధాలు,మేకప్ సామగ్రి లాంటి అనేక సామగ్రి తయారు చేసి అందించడం మొదలు పెట్టారు. ఆయన నిర్దేశకత్వంలో అనేక మంది నాటకప్రయోక్తలు, నటులు, గాయకులూ, వాద్య కారులు, మేకప్ కళాకారులు తయారయ్యారు. ఇంకో పక్క వీరి కుటుంబం మొత్తం కళలకే అంకితం అయింది.
ఇక శేషభట్టర్ నరసింహాచార్యులు మ్రముఖ నటులు రచయిత ప్రయోక్త శ్రీ మిక్కిలినేని రాధాకృష్ణ మూర్తి గారితో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాలు గొప్పవి. వాటిల్లో శేషభట్టర్ నరసింహాచార్యులు గారి సూటిదనం, నిర్మోహమాటత్వం కనిపిస్తే మిక్కిలినేని గారి లేఖల్లో గాంభీర్యత ఇతరుల ప్రతిభను ఆమోదింఛి ప్రశంసించే తత్వం గొప్పగా వున్నాయి.
శేషభట్టర్ నరసింహాచార్యులు రాసిన లేఖలో మిక్కిలినేని రాసిన ‘ఆంధ్ర నాటక రంగ చరిత్ర’, ‘తెలుగు వారి జానపద కళారూపాలు’ పుస్తకాల్లో తెలంగాణ నాటకాలు, మహబూబ్ నగర్ జిల్లాను గురించి ఒకటిన్నర పేజీలు మాత్రమే వుంది... అయినా అది మిక్కినేని గారి తప్పిదం కాదని సమాచార లోపం కావచ్చని అని రాసారు.
దానికి జవాబుగా మిక్కిలినేని “మనిషి పుడతాడు,చనిపోతాడు. పుట్టేది తెలియదు, పోయేదీ తెలియదు. అలా పుట్టి పోయే కాలంలో ఆయా వ్యక్తులు చరితార్థులు అవుతారు. అలా చరిత్రలో మీరు మిగిలిపోతారు నరసింహాచార్యులు గారూ “ అని రాసారు.
ఇట్లా తన జీవిత విశేషాలతో పాటు నరసింహాచార్యులు నాటకాలు, జానపద కళల గురించి అనేక వివరాలతో రాసిన ఈ “అర్దళం- నా జీవన నాటక రంగం” కేవలం ఆయన ఆత్మకథగా మాత్రమే కాకుండా సాంస్కృతిక చరిత్రగా నిలిచింది.
ఈ పుస్తకానికి సంపాదకత్వ బాధ్యతలు నిర్వహించిన శ్రీ హెచ్.రమేష్ బాబుకి మనసారా అభినందనలు. శ్ర్రీ శేషభట్టర్ నరసింహాచార్యులు గారికి మనః పూర్వక నివాళులు.