చీకట్లను చీల్చుకు వచ్చిన “వెనుతిరగని వెన్నెల”

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం : డా. కె.గీత  నవల  “వెనుతిరగని  వెన్నెల” అందిస్తున్నారు వారాల ఆనంద్.

Varala Anand writes on K Geetha novel Venu Tiragani Vennela

ప్రముఖ కవయిత్రి డా.కె.గీత గారి నుండి ఒక సందేశం వచ్చింది. మీ పోస్టల్ అడ్రస్ పంపండి నా నవల పంపిస్తాను అని. తను నవల కూడా రాసారా అని అశర్యపోయా. వెంటనే అడ్రస్ వాట్స్ అప్ చేసాను. వారం తిరిగేసరికి గీత  “ వెనుతిరగని వెన్నెల” అందుకున్నాను. 464 పేజీల పెద్ద నవల. కిరణ్ ప్రభ గారి ‘కౌముది’ లో ధారావాహికగా వచ్చిన నవల. వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించారు.

అసలు నేను నవల చదివి ఎన్నాల్లో అయింది కదా అనిపించింది. అంతేకాదు ఒక మంచి నవల ఏకబిగిన చదివింది ఎప్పుడు అన్న ఆలోచలోకూడా పడ్డాను. 60-70 దశకాల్లో తెలుగు సాహిత్యాన్ని ఏలిన నవలా ప్రక్రియ క్రమంగా ఎట్లా మరుగున పడిపోయిందా అన్న ఆలోచన అనేక అద్భుత నవలల్ని నవలాకారుల్నీ గుర్తుకు తెచ్చింది.

 “వెనుతిరగని  వెన్నెల” చదవడం మొదలు పెట్టాను. మంచి  చదివించే గుణం  వున్న రచన. చదవుతున్న వారిని చాలా సులభంగా చకచకా ముందుకు తీసుకెళ్ళే గుణం ఈ నవలలో వుంది. నవలలోకి వెళ్ళే ముందు మొదట ఇంత విస్తారమయిన కాన్వాస్ పైన భావుకత, వాస్తవిక దృక్పధం వున్న అమ్మాయి కథని బాగా రాసిన డా. కె.గీతను మొదట అభినందిస్తున్నాను. ఇంతవరకు మంచి కవిత్వం రాసిన డా. కె.గీత మంచి వచనమూ రాసినందుకు ఆనందిస్తున్నాను.   

నా సాహిత్య అధ్యయనం డిటెక్టివ్ నవలలతో ఆరంభమయింది. నాదే కాదు నాకు తెలిసి 70 వ దశకంలో అకాడెమిక్ చదువుకు అదనంగా చదవడం ఆరంభించిన వాళ్ళల్లో అధిక శాతం మంది నవలలతో అందునా డిటెక్టివ్ నవలలు చదవడంతోనే మొదలెట్టి వుంటారు. తర్వాత సాంఘిక నవలలు రంగంలోకి వచ్చాయి. యద్దనపూడి, మాదిరెడ్డి, అరికేపూడి ఇట్లా ఎంతో మంది రచయిత్రుల నవలలు గొప్ప జనాదరణ పొందాయి. అప్పుడు పురుషులే కాకుండా ముఖ్యంగా గృహిణులు మధ్యతరగతి స్త్రీలు ఈ నవలల్ని బాగా ఆదరించారు. బహుశా 60 వ దశాబ్దం తర్వాత మహిళల్లో కలిగిన అక్షరాస్యతా చైతన్యం అందుకు దోహదం చేసింది. అప్పుడు మధ్యతరగతి మహిళలు ప్రేమ, వివాహం, కుటుంబ సంబంధాలూ మొదలయిన అంశాల పైన వచ్చిన నవలలని విపరీతంగా ఆదరించారు. ఆయా నవలల్లో కనిపించిన కాల్పనికత ఆ తరాన్ని విపరీతంగా ప్రభావితం చేసింది. మరో రకంగా వారికి గొప్ప కాలక్షేపంగా కూడా ఆ నవలలు ఉపయోగపడ్డాయి. అట్లా 60, 70 దశాబ్దాలలో నవలలు తెలుగు సాహిత్యంలో రాజ్యమేలాయి. ఆయా నవలలు సినిమాలకు కథలుగానూ మారి ప్రజాదరణ ను పొందాయి. తర్వాత యండమూరి, మల్లాది లాంటి రచయితలు రంగం మీదికి వచ్చి మహిళా రచయిత్రుల ప్రాభవాన్ని దెబ్బ తీసారనే చెప్పాలి. వీళ్ళు కాల్పనికతకు తోడు కొంత ఆధునికత, కొంత సైన్సు పేర సూడో సైన్స్, మరింత ఎక్కువ మూఢ విశ్వాసాల్ని జోడించి సస్పెన్స్ తోనూ, వారం వారం ఎపిసోడ్స్ లక్షణంతోనూ రీడర్స్ ని బాగా ప్రభావితం చేసారు.

ఇట్లా తెలుగు సమాజాన్ని కుదిపేసిన కాల్పనిక నవలా సాహిత్యం టీవీల రాకతో క్రమంగా తమ ప్రాచుర్యాన్ని కోల్పోవడం ఆరంభించింది. అప్పటి దాకా ఆ నవలలకు పోషుకులుగా వున్న మధ్యతరగతి మహిళా లోకం తమ కాలాన్ని టీవీల వైపు, సీరియల్స్ వైపు మరల్చడంతో పరిస్థితిలో చాలా మార్పు వచ్చింది.

అయితే కాల్పనిక నవలా సాహిత్యానికి సమాంతరంగా మనిషిని, మానవ విలువలని, సమాజాన్ని, మనిషి అంతర్లోకాన్నీ పట్టించుకున్న నవలలూ వచ్చాయి. గొప్ప సాహితీ విలువలతో మిగిలాయి. ‘అల్పజీవి’, ‘అసమర్తుని జీవయాత్ర’, ‘చివరకు మిగిలేది’, ‘కాలాతీత వ్యక్తులు’, బారిష్టర్ పార్వతీశం’, ‘అంపశయ్య‘ లాంటి అనేక నవలలతో పాటు చలం, కేశవ రెడ్డి  నవలలు, రంగనాయకమ్మ రచనలు, అనంతర కాలంలో అల్లం రాజయ్య, తుమ్మేటి, వోల్గా తదితరుల నవలలు తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలబడ్డాయి.

అయితే మారుతున్న కాలం, అనితర సాధ్యంగా పెరుగుతున్న సాంకేతికత మనుషుల జీవితాల్లో పెను మార్పుల్ని తీసుకొచ్చింది. అంతా ఎప్పుడూ లేని వేగాన్ని ఫీలవ్వడం మొదలయ్యింది. దాంతో సాహిత్యం దాని అధ్యయనంలో కూడా తీవ్రమయిన మార్పులు చోటు చేసుకున్నాయి. చదువరుల్లో ‘సమయం’ ప్రధాన సమస్య అయి కూర్చుంది. పెద్ద కథలు గాని, నవలలు గానీ చదివే తీరిక లేక పోవడంతో నవల క్రమంగా వెనక బడి పోయింది. నవలలు రావడం లేదని కాదు కాని వాటి ప్రాభవం క్రమంగా తగ్గి పోయింది. ఇంట్లోకి చొచ్చుకొచ్చిన ఇంటర్నెట్ కూడా అందుకు మరో కారణంగా చెప్పొచ్చు. యు ట్యూబ్, ఇటీవలి వోటీటీ తదితరాలు అందరినీ ఎంగేజ్ చేయడం పెరిగి పోయి “ చదివే సంస్కృతి కాస్తా చూసే సంస్కృతి” గా మారిపోయింది.

ఈ నేపధ్యంలో “వెనుతిరగని  వెన్నెల”  లాంటి నవలని డా. కె.గీత రాయడం సాహసమేననుకుంటాను. అందులో ఆమె అవగాహన నిబద్దత గోచరమవుతున్నాయి. అందుకు అమె తల్లిగారయిన ప్రముఖ రచయిత్రి కే.వరలక్ష్మి గారి ప్రభావాన్ని కాదనలేము.

వోల్గా అన్నట్టు ‘ ఒక మామూలు అమ్మాయి భావుకత, పంతం తప్ప లోకం తెలియని అమ్మాయి హఠాత్తుగా జీవితాన్ని సుడుగుండంలోకి నెట్టుకొని, అక్కడ ఊపిరి తీసుకునే అవకాశం కూడా లేదని తెలుసుకుని, పోరాడి బయటపడి, పడుతూ లేస్తూ క్రమంగా స్థిరమయిన జీవితంలోకి అడుగుపెట్టడం ఈ నవల సారాంశం’.

ఈ నవల ఆసాంతం చదివితే కనిపిస్తున్నంత ఊహిస్తున్నంత సరళ మయింది కాదు జీవితం అని తెలుస్తుంది, అంతే కాదు కలలు కన్నంత సులభమయింది కాదు. అందులో ముఖ్యంగా అమ్మాయి జీవితం మరింత క్లిష్టమయిందని కూడా ఈ నవల చెబుతుంది. స్త్రీ అయినా పురుషుడయినా కేవలం భావుకతతో జీవితాన్ని కొనగించలేము ప్రాక్టికాలిటి అవసరమవుతుందని కూడా ఈ నవల సూచిస్తుంది.

‘వెనుతిరగని వెన్నెల’ లో ప్రధాన పాత్ర తన్మయి. ఆ అమ్మాయి తన జేవితంలో ప్రేమ, పెళ్లి, ఆ తర్వాత జీవితం చేదు విషం అని తెలుసుకుంటుంది, తర్వాత పరిస్థితులకు ఎదురు తిరుగుతుంది. భర్తను, సమాజాన్ని కూడా ఎదిరించి తన జీవితాన్ని మార్చుకునేందుకు పోరాటం చేస్తుంది. తల్లిగా చిన్న పిల్లాడిని పోషించుకుంటూ చదువును కొనసాగిస్తుంది. ఆ క్రమంలో మరోసారి ప్రేమ ఎదురవుతుంది. తన్మయి కరిగిపోతుంది. అక్కడా ఆటంకాలు ఎదురవుతాయి. అయినా ఆమె సహనంతో పోరాడి జీవితంలో నిలదొక్కు కుంటుంది. సాధికారికతను సాధిస్తుంది. తన్మయితో పాటు ఈ నవలలో ఇంకా అనేక పాత్రలు సహజంగా రూపొందించ బడ్డాయి. తన్మయి గొప్ప భావుకురాలు. ఆమెకు కష్టం ఒకసారి కాదు ఒక రూపం లో కాదు అనేకరకాలుగా ఎదురవుతుంది. చెప్పుకోవడానికి ఆడుకోవడానికి ఎవరూ లేనప్పుడు ఆమె  రాసుకునో, ఆకాశంలోకి చూసుకుంటూనో ‘అజ్ఞాత మిత్రునికి’ చెప్పుకుని ఊరట చెందుతుంది. ధైర్యం తెచ్చుకుంటుంది.

ఇట్లా నవల మొత్తం తన్మయి చుట్టూ తిరుగుతూ సాగుతుంది. తన్మయి జీవితం ఓటమి అంచుల దాకా వెళ్లి విజయ తీరానికి చేరుకుంటుంది. నిలబడుతుంది.

మంచి ఆశావహంగా సాగే ఈ ‘వెనుతిరగని వెన్నెల’ నవలగా విజయం సాదించింది అనే చెప్పాలి. మంచి కథా కథనం, వైవిద్యంతో రాసిన రచయిత్రి కే.గీత గారిని అభినందించాలి. పెద్ద నవలే అయినా ఇది చదివించే నవల, కాల్పనికతతో తీర్చిదిద్దిన చదవాల్సిన వాస్తవిక నవల.  

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios