జ్ణాపకాల సందర్శన ACTUALLY ... I MET THEM MEMOIR BY GULZAR

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం సుప్రసిద్ధ కవి గుల్జార్ రాసిన  "ACTUALLY ...  I MET THEM MEMOIR BY GULZAR ” అందిస్తున్నారు వారాల ఆనంద్

Varala Anand on ACTUALLY ...  I MET THEM MEMOIR BY GULZAR

ఇటీవలే సుప్రసిద్ధ కవి గుల్జార్ రాసిన ACTUALLY ...  I MET THEM MEMOIR BY GULZAR (నిజంగా.. వాళ్ళని నేను కలిసాను- ఓ జ్ఞాపకం = గుల్జార్ ) పుస్తకాన్ని అందుకున్నాను. అద్భుతమయిన జ్ఞాపకాలు కదా ఏకబిగిన చదివేసాను. గుల్జార్ తన ఇన్నేళ్ళ జీవితంలో ఎంతో మందిని కలిసాడు. కవులు, రచయితలు,దర్శకులు, నటీనటులు, గాయకులూ, సంగీత దర్శకులు వొహ్ గొప్ప జ్ఞాపకాలు, మరెన్నోగొప్ప అనుభవాలు. ఈ పుస్తకంలో తాను తన నిత్య జీవితంలో కలిసిన వాళ్ళ గురించి ప్రస్తావించారు. తన వృత్తి జీవితంలో తాను కలిసి పనిచేసిన వారి గురించీ రాసారు, అంతే కాదు తన పై వాళ్ళ ప్రభావాన్ని కూడా గుల్జార్ ఈ పుస్తకం లో సవివరంగా చెప్పారు. పుస్తకం శీర్షిక “నిజంగా.. వాళ్ళని నేను కలిసాను”లో నిజంగా అనడంలోనే గుల్జార్ కవితాత్మ కనిపిస్తున్నది. వాళ్ళని ఊరికే కలిసాను అని కాకుండా  నిజంగా కలిసాను అంటే మనసు లోతుల్లోంచి కలిసి రాసాను అంటున్నాడు గుల్జార్. ఇదొక మంచి జ్ఞాపకాల తోరణం.

నిజానికి ఇది గుల్జార్ జీవిత చరిత్ర కాదు, ఎందుకంటే జీవితచరిత్ర రచనకు, జ్ఞాపకాలకు తేడా వుంటుంది. జీవితచరిత్రలో సమగ్ర జీవితం వుంటే జ్ఞాపకాల్లో కొన్ని ముఖ్యమయిన సందర్భాలు సంఘటనలు వుంటాయి. ఈ పుస్తకం నిండా జ్ఞాపకాలున్నాయి.

నిజానికి మనిషి జీవితంలో జ్ఞాపకాలు మరుగున పడవు. చేతనా అంతఃచేతనల్లో ఎక్కడో ఒక చోట సజీవంగా నిక్షిప్తమయ్యే వుంటాయి. అందునా కవీ కళాకారుడి జీవితాల్లో జ్ఞాపకాలు హృద్యంగానూ సాంద్రంగానూ వుంటాయి. కావలసిందల్లా ఆ జ్ఞాపకాలని రాయాలనుకున్నప్పుడు మనసు, ఆలోచనలు తిరిగి ఆ కాలంలోకి వెళ్ళాలి. ఆ కాలాన్ని పునర్ దర్శించాలి. వున్నది వున్నట్టు కల్పనారహితంగా రచనలో ప్రతిబింబింప జేయాలి. అప్పుడే ఆ జ్ఞాపకాలకు సాహిత్యంలో స్థానంతో పాటు గౌరవమూ లభిస్తాయి. నా అభిప్రాయంలో ACTUALLY ...  I MET THEM MEMOIR BY GULZAR పుస్తకం అలాంటి గౌరవం ఇవ్వాల్సిన రచన. ఈ పుస్తకం ఫస్ట్ పర్సన్ లో సాగుతుంది. తొలుత బెంగాలీ పత్రిక ఆదివారం సంచిక కోసం గుల్జార్ ఇవి రాసారు. అవన్నీ కలిపి “పంటా భాటే” పేరున బెంగాలీలో  పుస్తకంగా వచ్చింది. ఇప్పుడు మహార్గ్య చక్రవర్తి ఇంగ్లీషులోకి అనువాదం చేసారు. పెన్గ్విన్ వాళ్ళు ప్రచురించారు.

ఈ ACTUALLY ...  I MET THEM MEMOIR BY GULZAR  లో గుల్జార్ తన గురువు మెంటార్ అయిన బిమల్ రాయ్ నుంచి మొదలు పెట్టాడు. తాను తన మొదటి పాట కోసం బిమల్ రాయ్ దగ్గరికి ఎట్లా ఏ పరిస్థితుల్లో వెళ్లిందీ ఆసక్తికరంగా రాసాడు. కవి శైలేంద్రకూ సంగీత దర్శకుడు ఎస్డీ బర్మన్ కూ చిన్న మనస్పర్థ వచ్చి పాటకోసం శైలేంద్ర తనను పంపాడని గుల్జార్ రాసారు. అట్లా అనేక సంఘటనలను కథాత్మకంగా రాసారు గుల్జార్. ఈ పుస్తకంలో బిమల్ రాయ్ తో మొదలయిన  జ్ఞాపకాల పరంపర సంగీత దర్శకులు సలిల్ చౌదరి, హేమంత్ కుమార్, ఆర్ డీ బర్మన్, ప్రపంచ ప్రఖ్యాత దర్శకులు సత్యజిత్ రే, రిత్విక్ ఘటక్, బెంగాలీ సూపర్ స్టార్ ఉత్తమ కుమార్, గాయకుడు కిషోర్ కుమార్, సంజీవ్ కుమార్, హ్రిషికేశ్ ముఖర్జీ, పండిట్ రవి శంకర్, భీంసేన్ జోషి, నటీమణులు సుచిత్ర సేన్, షర్మిళా టాగోర్, రచయిత్రి మహాశ్వేతా దేవి లాంటి అనేక మందితో తన పరిచయం, తనపై వారి ప్రభావం రాసారు. గుల్జార్ రాసే విధానం మనతో మాట్లాడుతున్నట్టు వుండి చక చకా చదివిస్తుంది. అనేక విషయాల్ని ఆలవోకగా చెప్పినట్టు అనిపిస్తుంది.

ఇక గుల్జార్ గురించి చెప్పుకుంటే

‘బాబూమొషై జిందగీ బడీ హోని చాహీయే, లంబీ నహి‘,

‘జబ్ తక్ జిందా హూ తబ్ తక్ మరా నహీ, జబ్ మర్ గయా సాలా మై హీ నహీ’.


‘మౌత్ తో ఏక పల్ హై,

( జీవితం ఉన్నత మైంది కావాలి, కాని దీర్ఘమయింది కాదు, బతికి ఉన్నంతవరకూ చావలేదు, చచ్చింతర్వాత నేనే లేను, మరణం ఒక క్షణమే).


ఇలాంటి తాత్విక సజీవమయిన సంభాషణలు ఆనంద్ సినిమాలోవి. అవి రాసిన వాడు గుల్జార్. అట్లా కేవలం సంభాషణలే కాదు, గుల్జార్ గొప్ప కవి, సినీ గేయ రచయిత, రచయిత, సినీ దర్శకుడు కూడా. బహుముఖీన కార్యశీలి, ప్రతిభావంతుడు, భావుకుడు కూడా. గుల్జార్ రచనలు, సినిమాలు, గజల్స్  అన్నీ సృజనాత్మకంగానూ తాత్వికంగానూ వుండి ఆయనలోని సున్నితత్వాన్ని సరలత్వాన్ని ఆవిష్కరిస్తాయి. ఆయన కవిత చదివే పద్ధతి కూడా శ్రోతల్ని అమితంగా ఆకట్టుకుంటుంది. ఇట్లా పలు రంగాల్లో తన ముద్రను చాటుకున్న గుల్జార్ అనువాదం లోకూడా ఉన్నతమయిన కృషి చేసాడు, చేస్తున్నాడు. ఇంగ్లీష్, ఉర్దూ, హిందీ, పంజాబీ, బెంగాలి భాషల్లో ప్రావీణ్యమున్న గుల్జార్ దేశంలోని ఇతర భాషల రచనల్ని చదవడానికీ ఇష్టపడతాడు. ‘మన మెదడు అన్టన్నే(antenne) ను తెరిచి వుంచాలి అప్పుడే ఇతర ప్రాంతాల్లో, ఇతర భాషల్లో ఏమి జరుగుతుందో తెలిసి వస్తుంది’ అంటాడు గుల్జార్.  అట్లా భాషా,సాంస్కృతిక ప్రక్రియల్లో నిరంతర కృషి కొనసాగిస్తున్న గుల్జార్ ఒక లివింగ్ లెజెండ్. దర్శకుడిగా కవిగా హిందీ చలన చిత్ర సీమలో తన ముద్రను చాటుకున్నవాడు  గుల్జార్  

గుల్జార్ గా అందరికీ పరిచయమున్న ఆయన అసలు పేరు సంపూరన్ సింగ్ కల్రా. ఆగస్ట్ 18,1936 రోజున ప్రస్తుతం పాకిస్తాన్ లో వున్న దీన పట్టణంలో సిక్కు కుటుంబంలో జన్మించాడు. చిన్నప్పటి నుంచీ అంతాక్షరీ ఆడడంలో ఆసక్తిగా వుండే ఆయన అప్పటి నుండే భాష పట్ల పదాల పట్ల మక్కువను పెంచుకున్నాడు. చిన్నప్పటినుండే హిందుస్తానీ సంగీతం పట్ల మక్కువ కలిగిన గుల్జార్ రవిశంకర్, అలీ అక్బర్ ఖాన్ ల కచేరీలకు వెళ్ళేవాడు. గుల్జార్ కుటుంబం దేశ విభజనలో తీవ్రంగా ప్రభావితమయింది. సొంతవూరు విడిచి అమృత్సర్ కి వలస వచ్చింది. తమ కుటుంబ వ్యాపారమయిన మెకానిక్ దుకాణంలో పనిచేయడంతో గుల్జార్ జీవితం ఆరంభమయింది. తన పదమూడేళ్ళ వయస్సులోనే చదవడం పైన ఆసక్తి కలిగిన గుల్జార్ పుస్తకాలు కిరాయికిచ్చే షాప్ నుండి అపరాధ పరిశోధక నవలలు, మాజిక్ ఫాంటసీ రచనల్ని చదవడం ఆరంభించాడు. వారానికి ఇంత అని రుసుము చెల్లిస్తే ఎన్ని పుస్తకాలయినా చదివే వీలుండేది అక్కడ. దాంతో తమ షాప్ పని అయిపోగానే రోజుకు ఒకటి అని కాకుండా రెండు మూడు పుస్తకాలు చదవడం చేసేవాడు గుల్జార్. ఒక నాటికి షాప్ లోని దాదాపు పుస్తకాలు అయిపోవడంతో షాపతను ఇట్లా ఎన్ని చదువుతావు అంటూ సజ్జ మీదవున్న పుస్తకమొకటి తీసి ఇచ్చాడు. ఆది టాగోర్ రాసిన ‘ గార్డనర్’. అది చదివింతర్వాత గుల్జార్లో చదివే దృక్పథమే మారిపోయింది. తర్వాత ప్రేంచంద్ నుంచి మొదలు అనేక మంది గొప్ప రచయితల రచనలు చదవడం మొదలుపెట్టాడు. అప్పుడే గుల్జార్  కు ప్రగతిశీల రచయితల కళాకారులతో పరిచయం కలగడం PWA కార్యక్రమాలలో పాల్గొనడం మొదలయింది. దాంతోపాటు ఆయనకు సినిమాల పట్ల ఆసక్తి కలగడం ఆరంభమయింది. అప్పుడే శైలేంద్ర పరిచయం అయ్యాడు. ఆ పరిచయమే బిమల్ రాయ్ వద్దకు చేర్చింది. అట్లా సినిమాతోనూ సాహిత్యంతోనూ సహజీవనం చేస్తున్న గుల్జార్ జ్ఞాపకాల పుస్తకం ఈ ACTUALLY ...  I MET THEM MEMOIR BY GULZAR .

ఇది చాలా గొప్ప జ్ఞాపకాల సమాహారం. తప్పకుండా చదవాల్సిన పుస్తకం.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios