వనపట్ల సుబ్బయ్య తెలుగు కవిత: మెతుకులు కత్తులైతయి
తెలుగు సాహిత్యంలో కవిత్వానికి విశేషమైన స్థానం ఉంది. ప్రముఖ కవి వనపట్ల సుబ్బయ్య మెతుకులు కత్తులైతయి అనే కవిత రాశారు. ఆ కవితను మీ కోసం అందిస్తున్నాం.
నూతన సంస్కరణలు పిడిబాకులై
గుండెల్ని పొడుస్తున్నప్పుడు
రోడ్ల మీదికి రాక గూట్ల గువ్వలైతరా
గొడుగులు మెత్తని కత్తులై
శరీరాన్ని పొరలు పొరలుగా కోస్తున్నప్పుడు
పోరు నాగళ్ళెత్తక పొయిలపంతరా
ఎవరొచ్చినా నోట్లో మన్నుపోయడమేగానీ పడువను
ఒడ్డుకు దాటించిందెవరూ లేరు
ఇప్పుడు
వెన్నెముకలు
పెట్టుబడిదారులుగా కనిపిస్తున్నరు
అందుకే
అంబానీ ఆధానీలకు పొలాల జీవితాలను అప్పనంగా రాసిస్తున్నరు
దేశ సౌభాగ్యం అంటే
కర్షకుల బతుకును
కార్పొరేట్ కసాయిలకు తాకట్టు పెట్టడమే!
చెట్టుగొట్టి
సాలుతోలి
విత్తనం వేస్తే రైతు నరకం తెలుస్తది
పంటచేన్ల పందుల కావలి
కల్లం కాడ దొంగల బెడద
మార్కెట్ ల నిలువు దోపిడి
తీరా వానొచ్చి గింజలు మొలుకొస్తే
ఆశలు దింపుడు కల్లాలు
ఏ మార్కేట్ ముందైనా
రైతుల నవ్వుల్ని చూశారా
పుట్టెలు గింజలుపండిస్తే
పయిమీదికి ఓ పంచె కొనలేని దుస్తితి
తోవపొడవూ
మోడువారిన చెట్లు
రైతులు ఉరిపోసుకున్న గుర్తులు
రైతులది కడుపుమండిన ఆకలి పోరు
పాలకులది కంపెనీల పొట్టనింపే పట్టుదల
వాళ్ళ అమ్మలు కౌసల్యలు
అయ్యలు దశరథులు
వాళ్ళు రఘు రాముళ్ళతే
మీరట్లే నోటికొచ్చినట్లుగా కక్కుదురా
వాళ్ళ అమ్మలు దేవకీ, యశోదలు
అయ్యలు వసుదేవులై
వాళ్ళు బలరామకృష్ణులైతే అట్లే నిందిత్తురా
అన్నంచేతులను
ఉగ్రవాదులుగా ముద్రెయ్యడం
ఏరాముల నీతో
మనుషుల
తిత్తుల నింపే రైతులు
ఇకపై
తిత్తుల నింపే మెతుకులు కత్తులై
కుతికెల్ని కోస్తాయి
( రైతుల దీక్షకు మద్దతుగా...)