Asianet News TeluguAsianet News Telugu

సమాజాన్ని చక్కజేసే కవనం "చదువులమ్మ శతకం"

కూకట్ల తిరుపతి "చదువులమ్మ శతకం" పైన ఉడుత సంపత్ రాజ్ చేసిన సమీక్ష ఇక్కడ చదవండి.

Udutha Samapth Raj reviews Kukatla Tirupathi book
Author
Hyderabad, First Published Jun 8, 2021, 12:49 PM IST

విశ్వశ్రేయః కావ్యం అనేది పెద్దలమాట. విశ్వ శ్రేయమును కాంక్షించేదే కావ్యము. విశ్వ శ్రేయస్సును కాంక్షించేవాడు కవి. "అంతులేని కావ్య ప్రపంచమునకు కవియే బ్రహ్మ" అని ఆనందవర్ధనుడు పేర్కొన్నారు. ఈ రెండు నిర్వచనాల సారం ఒక్కటే.  విశ్వశ్రేయస్సు కొరకు కవి బ్రహ్మలాగ కవిత్వాన్ని సృజిస్తాడని.  కవి క్రాంతదర్శి కాబట్టి అతని దృష్టి సువిశాలమైనది.  కవి సమాజానికి దర్పణం పట్టే రచనలు చేస్తాడు.  కాబట్టి సామాజ హితాన్ని కోరేదే అసలుసిసలైన సాహిత్యం.

కవి రాసేది పద్యమైన, గద్యమైన, గేయమైన, కథయైనా, అందులో సమాజ హితానికై ఒక తపస్విలాగా తపించి రాస్తాడు.  లోకానికి మంచి జరగాలనే కవి కాంక్షిస్తాడు.  దానికోసం అక్షరాలతో మంటలను సైతం రాజేయగలడు.  అధర్మాలను, అన్యాయాలను, అకృత్యాలను ఎదురించగలడు. అవినీతిని, అక్రమాలను కాలరాసేందుకే కలం బద్దుడవుతాడు కూకట్ల తిరుపతి.  ఈయన అక్షరాలా తెలంగాణ అస్తిత్వవాద కవి.  తిరుపతి అక్షరాలను దివిటీలుగా చేసి, ఆ వెలుగులతో ప్రపంచంలోని తిమిరాన్ని తరుముతారు.  ఇక ఆ అక్షరాలనే ఒక తల్లిగా భావించి, సమాజశ్రేయస్సును ప్రసాదించుమని, ఓ బిడ్డగా ప్రణమిల్లడం ఇందులో కనిపిస్తుంది.  అలా ప్రజా సమస్యలను విన్నవించుకుంటూనే, ఆ ఇబ్బందులనే పద్యాలుగా, హృద్యముగా మలిచి,  ప్రజల మస్తిష్క ఫలకంపై జ్ఞాన బీజాలను లిఖిస్తాడు.  ఆ రీతిన అక్షరీకరించిన శత సమస్యల పద్యాల మాలను చదువులమ్మకు సమర్పించారు.  ఈ పద్య నివేదనలో  సాంఘిక దురాచారాలను, దుష్కృత్యాలను దునుమాడడం చూడవచ్చు.   

ఆయన పద్య రచన పిల్లలలో మాతృమూర్తి, మాతృభాష, మాతృదేశం పట్ల భక్తి, గౌరవ భావం పెరిగేటట్లుగా  కొనసాగడం ప్రశంసనీయం. కూకట్ల తిరుపతి సృజించిన పద్య గద్యాలేవైనా కానివ్వండి, అందులో తెలంగాణ అస్తిత్వవాద ముద్ర కొట్టొచ్చినట్లు కనబడుతుంది.  తెలంగాణ పలుకుబడులతో జనజీవితాలను సజీవ శిల్పంగా మలిచారు.  అంతేకాదు కూకట్ల పదాలు అవినీతి, అన్యాయాలపై ఆయుధాలై కొట్లాడుతై.  బానిసత్వాన్ని బొత్తిగా ఈసడించుకుంటై.   సమస్యలతో కలెవడుతూనే, సమసమాజ నిర్మాణం గావించుమంటూ చదువులతల్లికి పద్యాలలో నివేదించారు.  "అన్నమయములైనవన్ని జీవమ్ములు...కాళికాంబ! హంస! కాళికాంబ!" అని మెరుగైన సమాజం కోసం పరితపించిన పోతులూరి వీర బ్రహ్మం భావ జాలానికి కొనసాగింపును ఇందులో చూడవచ్చు.  ఈ శతక కర్తకు కూడా సామాజిక రుగ్మతలను ఎత్తి చూపడంలో నిఖార్సయిన ముక్కుసూటితనముంటుంది.  వ్యక్తీకరణలో తాత్విక చింతన సంతరికుంటుంది.  రూపంలో మానవతావాద ముద్ర ఉంటుంది.  సారంలో అమలిన ప్రేమ తత్వముంటుంది.  అక్కడక్కడ పద్యాలలో అవినీతి, లంచగొండితనంపై తిరుపతి కవి కలం నుండి అక్కరాలు అగ్గి మిరుగులై కూడా దునుకుతాయి.

"చక్కజేయుమమ్ము చదువులమ్మ" అనే మకుటం చదువులమ్మ శతక అంతరార్థాన్ని బోధిస్తున్నది.  కవి ఈ శతకాన్ని శ్రీకారంతో ఆరంభించారు.  ఆదిలోనే విఘ్నేశ్వర స్తుతి, ఇష్ట దేవత స్తుతి, గురుస్తుతి, తల్లిదండ్రుల స్తోత్రంలాంటి ప్రాచీన శతక లక్షణాలు కనిపిస్తాయి.   ఈ శతక కవి ఆధునిక కాలంలో కూడా ప్రాచీన శతక రచన సంప్రదాయాలను తూ. చా. తప్పకుండా పాటించినట్టుగా తెలుస్తున్నది.  శతకం చివరలో ఫలశ్రుతిని సైతం ఆశించడం కనిపిస్తుంది.  కవి వంశావళిని కూడా సంక్షిప్తంగా ఇందులో పొందుపరిచారు.  దీంతో కవి శతకం సాహిత్య ప్రక్రియను పూర్తిగా సమర్థవంతంగా పోషించినట్టుగా భావించవచ్చు.  చదువులమ్మ శతకం ఆత్మాశ్రయానికి చెందినది అసలే కాదు.  ఎందుకంటే కవి తనకోసం మాత్రమే ఏదీ చదువులమ్మను కోరుకోడు.  అన్నీ సమాజ హితాన్ని కాంక్షించే విన్నపాలే!  వస్త్వాశ్రయ పద్యాలే.  స్పృశించిన వస్తువు మరల స్పృశించలేదు. ఇది కవి సామాజిక స్పృహకు గీటురాయి.  ముక్తక లక్షణాన్ని చక్కగా పాటించారు. 

"రాజుల్మత్తులు వారి సేవ నరకప్రాయంబు" అంటూ  ఆనాడే రాజుల అహంభావాన్ని రాజుల ఆశ్రమాలలోనే ఎండగట్టిన అష్టదిగ్గజ కవి ధూర్జటి ధిక్కార స్వరాన్ని కూకట్ల తిరుపతి పునికి పుచ్చుకున్నట్లుగా కనిపిస్తుంది. యుగయుగాలుగా లోకంలో పాతుకుపోయిన కులమత భేదాలను రూపుమాపాలనే దృఢ కాంక్ష తన పద్యాలలో వెల్లడించారు కూకట్ల తిరుపతి.  ఈ కవిదృష్టి ఆసాంతం భారతీయ సమాజశ్రేయస్సే. అంతేకాదు వెర్రిమొర్రి జ్ఞానంతో మిడిసి పడేవాళ్ళను విడిచిపెట్టలేదు.

"విర్రవీగుచుండె విద్యలందు విలువ/వెర్రిమొర్రి బుద్దినేమిసేతు" అని తెగనాడుతాడు.  ఇప్పటి లాగా ఇకముందెప్పటికీ అమ్మభాష పట్ల నిర్లక్ష్యం తగదని సూటిగా హెచ్చరిస్తూ కవనం చేశారు.  సమాజంలో ఉన్న అవలక్షణాలన్నింటిని, అసమానతలను నిరసిస్తూ,
"కులమతమ్ములనుచు కుత్సితంబేటికి?/
మానవతను మించు మార్గమేది?" సమాజంలో ఉన్న ఈ బేధభావాలను పెల్లగించాలని, నవసమాజ నిర్మాణానికి ప్రజలంత ఏకం కావాలనీ, మూఢనమ్మకాలను తొలగించాలనీ, అనేక అవలక్షణాలను రూపుమాపాలనీ ఈ శతకంలో ఏకరువు పెట్టారు కూకట్ల తిరుపతి కవి.  మారుమూల గ్రామమైన మద్దికుంటలోని ఒక నిరుపేద రైతు కుటుంబంలో పుట్టడం వలన ఈ శతకకర్తకు దేశీభాషపై గట్టిపట్టు ఏర్పడి ఉంటుంది.  ఈ శతక పద్యాలలో పుష్కలమైన తెలంగాణ పదసంపద, జాతీయాలు, సామెతలు సహజంగా ఒదిగిపొయాయి.  నిత్య వ్యవహారంలో ఉన్న జంటమాటలు మంత్ర తంత్రములు, మంచి చెడులు, కట్నకానుకలు, కరువుకాటకాలు, కట్టుబొట్టు, వెర్రమొర్రి వంటివి విరివిగా వినియోగించారు.  "నింగినంటవట్టె నిత్యంబు నిత్యావ/సర సరకుల ధరలు ధరణిలోన" నింగినంటవట్టె అనే మాట తెలంగాణ నుడికారం. ఇలాంటివెన్నో ఈ పద్యాలలో చూడవచ్చు.

తిరుపతి ఈ నీతిశతకాన్ని రచించి సుమారు పదిహేను సంవత్సరాలు గడిచినా, ఇప్పటికీ కవి పడిన ఆవేదన ఇంకా తీరలేదనే చెప్పాలి.  కవి ఆకాంక్షించిన కొత్త  సమాజం ఇంకా ఎప్పటికి వస్తుందో మనం వేచి చూడాల్సిందే.  సామాజిక, ఆర్ధిక అంతరాలు లేని సమాజ నిర్మాణం కొరకు కవి కోరుకున్న విధంగా "చక్కజేయుమమ్ము చదువులమ్మ" అని మనమూ వేడుకొందాము.  ఇది ప్రతి పాఠశాల గ్రంథాలయంలో ఉండవలసిన పుస్తకము.  ప్రతి విద్యార్థి చదువ వలసిన ఓ మంచిపుస్తకం చదువులమ్మ శతకం.  ఇది పద్య రచనైనా సులభంగా అర్థమవుతుంది.  శతక కర్త సరళమైన శైలిలో శతక రచన చేయడం అభినందనీయం.  పండితులకే కాదు మామూలు చదువరులకి సైతం ఈయన రచనా శైలి అందుబాటులో ఉంది.  ధారణ చేయడానికి వీలుగా ఈ పద్యాలు చక్కటి ధారను కలిగి ఉన్నాయి.  

ప్రాథమిక స్థాయి పిల్లల పాఠ్య పుస్తకంలో ఈ శతక పద్యాలను చేర్చితే బాగుంటుంది.  ఈ విషయాన్ని ప్రభుత్వం మరియు పాఠ్యపుస్తక రచయితలు పరిగణనలోకి తీసుకోవాలి.  మంచి పుస్తక పఠనం పిల్లలను సద్వర్తనులుగా తీర్చిదిద్దుతుంది.  పిల్లలకు సామాజిక స్పృహను, సామాజిక బాధ్యతను తెలియజేస్తుంది. వారు భావి భారత పౌరులుగా ఎదగడానికి దోహదం చేస్తుంది.  కాబట్టి ఈ యాంత్రిక యుగంలో అత్యంత ఆవశ్యకమైన పుస్తక పఠనాభిలాషను విద్యార్థులలో పెంపొందించాల్సిన బాధ్యత గురువులదే.  వారిలో మానవతా విలువలను, నైతిక విలువలను పెంపొందించడానికి ఈ శతక పద్యాలు ఉపయోగపడతాయి.  సామాజిక ప్రయోజనాన్ని అభిలాషించే ఇలాంటి సందేశాత్మక పద్య రచనను అందించిన కూకట్ల తిరుపతిగారు అభినందనీయులు. వేల యేండ్లైనా వసివాడనిది పద్యం.  మన ప్రాచీన చరిత్రకు సాక్షీభూతంగా నిలిచింది పద్యమే.  

మఖలో పుట్టి పుబ్బలో కలిసినట్టు, ఎన్నో సాహితీ ప్రక్రియలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాయి.  పద్యమొక్కటి మాత్రమే ఇంకా పచ్చపచ్చగా, పచ్చిపచ్చిగా ఉన్నదనడంలో అతిశయోక్తి లేదు.  అందులో శతకమైతే తెలుగు సాహిత్యం ఉన్నన్ని నాళ్ళు సజీవంగా ఉంటుంది.  ఇలాంటి సామాజికోపయోగ పద్య రచనలు కవి కూకట్ల తిరుపతి మరిన్ని తీసుకురావాలని కోరుకుంటున్నాను.  యేళ్ళ తరబడి అముద్రితాలుగా ఉన్న ఆయన ఖండ కావ్యాలను ఇప్పటికైనా వెలుగులోకి తీసుకురావాలని ఆశీస్తున్నాను.  

కూకట్ల వారి పద్యం చాలా హృద్యంగా ఉంటుంది. అలతి అలతి పదాలతో రసరమ్యంగానూ ఉంటుంది.  ఆనాడే కూకట్ల తిరుపతి మధురమైన పద్య రచనలతో సుప్రసిద్ధ అష్టావధాని తిగుళ్ళ శ్రీహరి శర్మ లాంటి ఉద్దండ పండితుల చేత మన్ననలు పొందడం ప్రశంసనీయం.  తెలుగు  రసానుభూతిని, ఆనందానుభూతిని కలిగిస్తూ, పద్య పరిమళాలను, మాధుర్యాన్ని చాలా చక్కగా పంచుతూ వారిలో మాతృభాషాభిమానాన్ని బలంగా నాటుతున్నారు.      " పూలతోటలోని పుష్పాలు పిల్లలు/తోటమాలి గురువు తోడునీడ" ఇలా కూకట్ల తిరుపతి చేతిలో పద్యాలు అలవోకగా ఆధునిక వస్తువులతో చక్కటి రూపాన్ని, సారాన్ని సంతరించుకుంటాయి.  పద్యంలో వస్తుగత శిల్పాలను తీర్చిదిద్దడంలో కూకట్ల దిట్టనేనని చెప్పవచ్చు.  కొత్తగా రాస్తున్నవారికి ఎంతో మందికి విలువైన సూచనలు, సలహాలు కూడా అందిస్తున్నారు. 

తానే స్వయంగా నా లాంటి ఎందిరినో కవులుగా మలచినారు.  నవ కవులకు దిక్సూచిగా పద్యాన్ని సమర్థవంతంగా రాయగలిగే ప్రతిభా పాటవాలు కలిగిన కూకట్ల తిరుపతి నుండి ఇంకిన్ని పద్య సృజనలను ఆహ్వానిస్తున్నాను.  పద్య రచనలను అత్యధికంగా చేపట్టి, తెలుగు సాహిత్య రంగాన్ని సంపద్వంతం చేయాలని కోరుతున్నాను.

ప్రతులకు
ఇ. నం: 1-29/1,
కూకట్ల లక్ష్మి,
గ్రామం: మద్దికుంట,
మండలం: మానకొండూర్,
జిల్లా: కరీంనగర్.
తెలంగాణ రాష్ట్రం

Follow Us:
Download App:
  • android
  • ios