Asianet News TeluguAsianet News Telugu

పూల గుత్తులు బదులుగా పుస్తకాలు

మాతృ భాషను బతికించలేమా !?అక్షరాలు వాటి  గొంతులు కోయవద్దని ఆక్రోశిస్తున్న దుస్థితిలో కర్నాటక ప్రభుత్వం తీసుకున్న ఓ విలువైన నిర్ణయం పైన ప్రముఖ కవి ఒబ్బిని అందిస్తున్న వ్యాసం ఇక్కడ చదవండి.

Telugu writer Obbini explains Karnataka government decission
Author
Hyderabad, First Published Sep 17, 2021, 9:06 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp

ఈ మధ్య కర్నాటక ప్రభుత్వం ఓ విలువైన నిర్ణయం తీసుకుంది. అది ఏమిటంటే అధికార కార్యక్రమాలలో భాగంగా శాలువాలు, పూల దండలు, పూల గుత్తులు బహూకరించే విధానానికి స్వస్తి పలికి, వాటికి బదులుగా కన్నడ పుస్తకాలని అతిధులకి బహూకరించాలని. ఇది ఆహ్వానించదగిన సరికొత్త సంస్కృతిగా చెప్పుకోవచ్చు. ఇంకా కన్నడ భాష మీద కర్నాటక ప్రభుత్వం చూపిస్తున్న ఆదర్శ మమకారంగా కూడా చెప్పుకోవచ్చు. మిగతా మాతృ భాషలకి స్ఫూర్తి దాయకమైనదని కూడ భావించవచ్చు.

ఇదే సందర్భంలో ఇక్కడ మన తెలుగు భాష తీరుతెన్నుల గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, మాతృభాషని  ఓ తప్పనిసరి పాఠ్యాంశంగా   బడుల్లో బోధించమని చెపుతూ, బోధనా మాధ్యమం మాత్రం పూర్తిగా ఇంగ్లిష్ లో జరపాలని, కార్పొరేట్ కి ధీటుగా విద్యా బోధన గరిపిస్తామని, నిర్ణయాలు చేయడం గురించి వినడం జరుగుతుంది. చాలా చిత్రమైన విపత్కర పరిస్థితి తెలుగు భాష ఎదుర్కొంటుంది అని చెప్పక తప్పదు. బానిసత్వానికి బాటలు వేస్తున్నారనిపిస్తుంది.  నిజానికి నియంత్రణ, నిర్దేశాలు ప్రభుత్వాల అధీనంలో ఉంటాయి. ఏ నిర్ణయమైనా అమలు చేయడం పాలనా వ్యవస్థల మీదనే ఆధారపడి ఉంటుంది. విగ్రహాలని ధ్వంసం చేయడం , గోడల రంగులు మార్చడం లాంటిది కాదు గదా భాష విషయంలో.  భాష ఓ జీవ నాడీ, జీవన సంస్కృతి.  ఓ జాతి అస్థిత్వం.

దేశానికి స్వాతంత్ర్యం రాగానే  భవిష్యత్తులో దేశ భాషలను ఆధునిక విజ్ణాణ వాహినులుగా తీర్చిదిద్దడం కోసం గతంలో తెలుగు భాషా సమితి లాంటివి కొన్ని ప్రణాళికలతో కృషి మొదలు పెట్టాయి. మరి వాటి ఆదర్శాలు లక్ష్యాలు నెరవేరాయా ?  అలాగే అవి తలపెట్టిన కార్యక్రమాలను తెలుగు విశ్వ విద్యాలయం లాంటివి కొంత మేరకు నెరవేర్చడం జరిగింది.  అయినా ఇప్పుడు నెలకొన్న సాంకేతికతతో భాషలని మార్చుకోవాల్సిన పనే లేదు. భాషల అస్థిత్వాలని కాపాడుతూ,  మరింత ఉన్నత దశలకి సాంకేతికత తీసుకెళ్ళినపుడు అదొక గర్వించదగ్గ విషయం అవుతుంది.

ఓ వైపు పేదరిక నిర్మూలన సంక్షేమ పధకాలతో రయ్ రయ్ మని సాగిపోతూ, అదే పేదవాళ్లని వాళ్ళ తల్లి భాషకి దూరం చేస్తూ, తమది కాని భాషలో బోధన సాగిస్తూ, విద్యార్జనకి ఆమడ దూరంలో పెడుతున్నారు. పరాయీకరణకి నెట్టేస్తున్నారు. కొన్ని బడుళ్ళో కొందరి విద్యార్ధుల అవస్థ దానికి మచ్చుతునక. పూర్తిగా ఇంగ్లిష్ మీడియంలో బోధనకి ఉపక్రమించినపుడు వాళ్ళు బిక్క మొహం వేస్తున్నారు. అదే వాళ్ళ మాతృ భాషలో ఏ ఇతర భాషలు గాని, విషయాలు గాని బోధించినపుడు వికసిత మవుతున్నారు.

నేడు అమలవుతున్న సంస్కరణలు ఎంత లోతుకు చొచ్చుకుపోయాయో, ప్రస్తుత భాషల పరిస్థితి చెప్పకనే చెప్పుతుంది. వాటి మూలాలకే ఎసరు పెడుతున్నాయి. అక్షరాలు ఆక్రోశిస్తున్నాయి వాటి గొంతులు కోయ వద్దని. డబ్బే ప్రధానమైన వ్యాపార వ్యవస్థ, దాని వికృత ఫలితాలు ఎలా సమాజాల మీద ప్రభావం చూపుతున్నాయో చిన్న ఉదాహరణ తీసుకుందాము. “మానసిక అస్వస్థతకు ఏ మాత్రం అవకాశం లేని సామాజిక నిర్మాణాలు మనకు అవసరం. నేను ఎప్పుడూ పూర్వ కాలంలోని సంస్కృతి గురించి చెప్పడానికి కారణం ఏమిటంటే రెండు, మూడు వందల సంవత్సరాల కిందటి వరకు ఈ దేశంలో మానసిక అస్వస్థుల సంఖ్య దాదాపు శూన్యం.  సమాజ నిర్మాణాలు అలా ఉండేవి.  మెల్లగా వాటి ప్రాధాన్యం తెలుసుకోకుండా మనం వాటిని కూల్చి వేస్తున్నాం.  ఇవాళ గ్రామాలలో కూడా మానసికంగా దెబ్బ తిన్న మనుషులున్నారు.  సంపన్న సమాజాలనుకునే సమాజాలలో వీరి శాతం చాలా ఎక్కువవుతోంది."  అని అంటారు సద్గురు జగ్గీ వాసుదేవ్. సంస్కృతిలో భాగమైన భాషని కూడా చెరిపేసే వ్యవస్థలో భాగమైనప్పుడు కూడా అదే అవస్థ సమాజాలకి.

ఒక తరంలో మౌలిక సదుపాయాలు కల్పించలేని స్థితి లో విద్యార్జనలో వెనుకబాటు తనం ఉండింది. కానీ అదే సమయంలో అవే సదుపాయాలు ఉన్న చోట మాతృభాషలోనే విద్య గరపబడిన వారు ఎంతో రాణించి ఉన్నత స్థానాలలో నిల్చున్నారు. ఇప్పుడు ఏకంగా భాషనే మాయం చేస్తూ , అదే అభివృద్ధి అని, విప్లవం అని రాగాలు తీస్తున్నారు. అంతెందుకు . ఇవాల్టి కరోనా కాలాన్నే తీసుకుంటే కార్పొరేట్ రంగం ప్రజలని ఎలా కుదేలు చేసిందో, ప్రభుత్వ రంగం ఎలా ఆశాజనకమయ్యిందో అందరి కళ్ల ముందరి నగ్న సత్యమే. రాజకీయ, వ్యాపార పోటీలు సమాజాలని కుళ్లబొడుస్తున్న కాలమిది.

సామాజిక శాస్త్రాలు, ప్రకృతి, చరిత్ర, నీతి శాస్త్రాలు ముచ్చట లేని చదువులకి ఏనాడో శ్రీకారం జరిగిపోయింది. ప్రపంచీకరణ అన్నది ప్రాణాలు నిలబెట్టడం లేదు. ఫక్తు లాభాల మీద శవాల దిబ్బలని పోగేస్తుంది. అన్ని రకాల నాగరిక సంస్కృతులని పాతర వేస్తుంది. వర్తమాన ప్రపంచ దృశ్యాలే అందుకు తార్కాణాలు. పరాయి సంపదల మీద కన్నేసి,  దాష్టికాలకు పాల్పడి , ప్రజల సొంత నేల మీద తమ కాళ్ళకి చోటు లేకుండా చేయడం కళ్ళారా చూస్తున్నాం. భవిష్యత్తుకి చిహ్నాలైన చిన్నారులు గాల్లో కలిసిపోతున్నారు. తల్లి భాషలు లేకపోతే ఆ దాష్టీకాలు ఏకరువు పెట్టడానికి కూడా దిక్కుండదు.

ఈ నేపధ్యంలో కన్నడ ప్రభుత్వం చేపట్టిన వినూత్న భాషా కార్యక్రమం ఎంతో ప్రశంషించతగ్గది. తల్లి భాషలు సొంత గొంతుకులు. సొంత ప్రాణాలు. సొంత ఊపిర్లు. ఆ భాషామృతం ఆవిరైపోకూడదు. జనని జన్మ భూమిశ్చ స్వర్గాదపీ గరియసి అని అందుకే అన్నారేమో. యాసని ఈసడించుకున్నందుకు ఏకంగా ఉద్యమ తరంగాలతో ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన సంగతి నిన్న మొన్నటిదే.

Follow Us:
Download App:
  • android
  • ios