ప్రముఖ కథా రచయిత కరుణాకర్ కన్నుమూత

ప్రముఖ తెలుగు కథా రచయిత బీపీ కరుణాకర్ శనివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కరుణాకర్ తదిశ్వాస విడిచారు. ఆయన మృతికి ఎండ్లూరి సుధాకర్ సంతాపం ప్రకటించారు.

Telugu short story writer BP Karukar dies at 76

హైదరాబాద్: ప్రముఖ కథా రచయిత బి పి కరుణాకర్ (76) శనివారం ఉదయం 11. 30 ని. లకు హైదరాబాద్ బాచుపల్లి లోని ఎస్ఎల్జీ  ఆసుపత్రిలో మరణించారు. మూడు రోజుల నుంచి ఆయన ఊపిరి తీసుకోడంలో ఇబ్బంది పడుతున్నారు. అంతకు ముందు నుంచే ఆయన గుండె జబ్బుతో బాధ పడుతున్నారు. బై పాస్ సర్జరీ జరిగింది. ఈ మధ్యనే రెండు స్టంట్లు కూడా వేశారు. 

హఠాత్తుగా అనారోగ్యంపాలు కావడంతో చిన్న కూతురు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయనను వెంటిలేటర్స్ మీద పెట్టారు. మృత్యువుతో తీవ్రంగా పోరాడి తుది శ్వాస విడిచారు. బండారు ప్రసాద్ కరుణాకర్ ఇద్దరు కూతుళ్ళు. పెద్ద కూతురు అమెరికా లో ఉంటుంది, చిన్న కూతురు హైదరాబాద్ సంగారెడ్డిలో ఉంటుంది.  ఆయన భార్య పేరు హేమలత, 23 ఏళ్ల కిందటే ఆవిడ కన్ను మూసింది. 

విద్యా నగర్ లోని అనురాగ్ సదన్ అపార్టమెంట్ లో ఉండేవారు. కరోనా కారణంగా చిన్న కూతురు జోనా విజయ ప్రియ ఆయన బాగోగులు చూసుకోడానికి తండ్రిని తన ఇంట్లో పెట్టుకుంది. అంతా బావుందని అనుకున్న సమయంలో ఆయనకు గుండెపోటు వచ్చింది. మూడు రోజుల కిందటే తాను ఆయనతో చాలా విషయాలు మాట్లాడానని హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ ఎండ్లూరి సుధాకర్ అన్నారు. 

కరుణాకర్ మృదుస్వభావి, సరసుడు, సహృదయుడు. జీవితాన్ని తేలిగ్గా తీసుకునే మనస్తత్వం కలవాడు. కథలు రాయడంలోనే కాదు, స్నేహితులకి కథలు చెప్పడంలో కూడా నేర్పరి. మంచి హాస్య ప్రియుడు. బిహెచ్ఈఎల్ లో పని చేసిన ఉన్నతాధికారి. వీరి తాతగారు ఎసీ కిన్సింగర్, గుంటూరులోని లూథరన్ క్రైస్తవ నాయకులలో ఒకరు, గొప్ప గీత రచయిత. "ఏసుతో ఠీవి గాను పోదమా! అడ్డుగా వచ్చు వైరి గెల్వను" లాంటి కీర్తనలు ఆయన రచించారు. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల గ్రంధంలో ఆయన పాటలు లభిస్తాయి. 

కరుణాకర్ అమెరికాలో ఉండే పెద్దమ్మాయి జయశ్రీ మనోరమ దగ్గరికి వెళ్లొచ్చినప్పుడల్లా సెంట్ సీసాలతోనూ, షివాస్ రీగల్స్ తోనూ, కొత్త ఇంగ్షీషు కథా సంపుటాలతోనూ వచ్చేవాడు. వాటిని మిత్రులతో ఆత్మీయంగా పంచుకునే వాడు. చిన్న కథ రాయడంలో కరుణాకర్ ది అందె వేసిన చేయి. ఆయన కథల్లోని కొసమెరుపు చివరి దాకా ఉత్కంఠను కలిగిస్తుంది. 

ఓ హెన్రీ, గైడీ మపాసా, చలం, బుచ్చి బాబులంటే ఇష్టపడే వాడు. 'అంబాలిస్' 'నిర్నిమిత్తం' 'రెల్లు' 'డియర్' వంటి కథా సంపుటాలను తీసుకొచ్చారు. ఆయన కథలు హిందీ లోనూ, ఇంగ్షీషు లోనూ కన్నడ భాషల్లోనూ అనువాదాలు అయ్యాయి. ఆయన కథల మీద తన పర్యవేక్షణలోనూ, ప్రొ. జి. యోహన్ బాబు, ఆంధ్ర విశ్వవిద్యాలయం, మరికొందరి నేతృత్వంలోనూ పరిశోధనలు జరిగినట్లు ఎండ్లూరు సుధాకర్ చెప్పారు. విశేషమేమిటంటే సుప్రసిద్ధ కథా రచయిత ప్రొ. కొలకలూరి ఇనాక్, ఏసీ కాలేజ్ లో ట్యూటర్ గా ఉన్నప్పుడు కరుణాకర్ ఆయన విద్యార్ధి. 

ఎందరో మిత్రుల్ని కుటుంబ బంధువుల్ని ఒంటరి వాళ్ళని చేసి కరుణాకర్ వెళ్లిపోయాడని, ఆయన చిన్న కథలు సంపాదించి చదవడమే ఆయనకి మనమిచ్చే పెద్ద నివాళి అని ఎండ్లూరి సుధాకర్ అన్నారు.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios