అందరూ హోదాలను, కరెన్సీ కట్టలను మోస్తుంటారు
నేల విడిచి కళ్లు భూములను, అంతస్థులను వేటాడుతాయి
గుండెలతో గుండెకు అతుకులు వేసుకుంటారు
గాలి అహంకారం వాసన వేస్తూ ఉంటుంది
కుళ్లు వాసనతో ముక్కు పుటాలు అదిరిపోతాయి
అందరూ పనుల్లో ఉంటారు, ఎవరికీ తీరిక ఉండదు
వాణిజ్య సముదాయాలను అక్కున చేర్చుకుంటారు
అంతస్తుల మీద అంతస్తులు నిర్మిస్తుంటారు
తిరస్కారానికి కారణాలు వెతుక్కునే వ్యూహాలు రచిస్తారు
వారి నోళ్లు ఏ రోటి కాడ ఆ పాటే పాడుతాయి
సాధించిన విజయాలను, కూడబెట్టిన ఆస్తులను ఆవులిస్తుంటారు
మానవ సంబంధాల గురించి కూడా మాట్లాడుతుంటారు
లోపలి చిలుకను మందుతోనో, విందుతోనో బుజ్జగిస్తుంటారు
ఆర్భాటాలూ ఆంతర్యాలూ తెలిసిపోతూనే ఉంటాయి
తెలియనట్లు అందరూ నటిస్తూ ఉంటారు
ఎక్కడో ఏదో పుటుక్కున తెగుతుంది
జర్రున పాతాళానికి జారిపడుతారు
మనుషులు చితికిపోతారు, సమాజం నెత్తురోడుతుంది
నా మీద తృణీకార తూణీరాలు సంధిస్తుంటారు
ఒంటరి చీకటి బరువును గుండెల్లో మోస్తుంటా
ఆమె కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తుంటా
వెలుగు కిరణాన్ని మోసుకుని వస్తుంది
అగౌరవాలను, అమర్యాదలనూ కాలదన్నుతా
అంతర్లోకాలను వెలిగించుకుంటా