నేను రక్షించేదాన్నే 
నన్ను శిక్షించకండి 

మీ తాతలనాటి పుటుక నాది 
మీ మనుమల బారసాలల దాకా 
బతుకనివ్వండి 

నేను రాక్షణనిచ్చేదాన్నే 

గాలి అలల్లో ప్రాణ ధాతువును నింపాను 
భూమి అరల్లో జల ధారలు పొదిగాను 
ఎండ వేడిలో నీడల్ని పరిచాను 

నేను రక్షించేదాన్నే 

నా ఎముకలింకా గుల్ల బారలేదు 
నా మృత్యువింకా వేణువూదలేదు
నాలో సత్తువింకా నిలువెత్తుగా నిలబడేవుంది  

నేను రక్షించేదాన్నే 
నా మెడకు ఉచ్చులు వేయకండి 

నా కొమ్మల్లో ఒదిగిన పక్షుల్ని 
పాడనివ్వండి 
పొదగనివ్వండి 
ఫలించనివ్వండి 

నేను వసతినిచ్చేదాన్నే 
నా ఉనిక్కి ఎసరు పెట్టకండి 

ఇన్నేళ్ళూ నా నీడలో నిలబడ్డారు 
జంటగా గుస గుసలు పోయారు 
గుంపుగా చర్చించుకున్నారు 
పసందుగా విందులు చేసుకున్నారు 
పంచాయితీలు చెప్పుకున్నారు 

నేనేమో 
భానుడి ఉగ్ర తాపానికి చలించలేదు 
ఉరుముల్నీ మెరుపుల్నీ 
ఉఫ్ మని ఊదేసాను 
తుఫాన్లని తుస్సుమనిపించాను 
ఎవరి అండా లేకుండానే 
మీకు అండగా నిలబడ్డాను 

నాయనలారా 
దారిని వెడల్పు చేయడం కాదు 
మీ మనసుల్ని విస్తరించండి 

సాగిలపడకున్నా ఫర్వాలేదు 
నన్ను సాగనంపకండి 

నేను రక్షించేదాన్నే 
నా వేళ్ళు పెకిలించకండి 

నా లాంటి ‘పెద్దవాళ్ళ’ నీడ 
మీకు చద్దన్నం కన్నా చల్లన 

నా కన్నీళ్లు మీకు క్షేమం కాదు 
నా ‘ఆకుపచ్చ’ అంతం 
మీ ‘ఆఖరి శ్వాస’కు ఆరంభం 

నేను రక్షించేదాన్నే 
నన్ను శిక్షించకండి 

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature