వారాల ఆనంద్ కవిత: గాలెప్పుడూ ఒకే దిక్కు వీయదు
తెలుగు సాహిత్యంలో వారాల ఆనంద్ సుప్రసిద్ధుడు. ఆయన ఏషియా నెట్ కోసం రాసిన కవితను మీకు అందిస్తున్నాం.
మొత్తం అంతటా వ్యాపించిందనుకుంటాం కానీ
గాలి
ఎప్పుడూ ఒకే దిక్కు వీయదు
తూర్పు పడమర
ఉత్తరం దక్షిణం
వానా
ఒకేలా కురవదు
పంటా
ఒకేలా పండదు
నిన్న
ఉన్నట్టు నేడు లేదు
నేటి
తీరు రెపుండకపోవచ్చు
ఎంతో ఆశ పడతాం కానీ
మన ఆలోచనే
ఈ క్షణమున్నట్టు మరు క్షణం
ఉండక పోవచ్చు
నీటి బుడగలో నీళ్ళుండవు
గాలి బుడగ శాశ్వతమూ కాదు
తొలి సంధ్య ఎంత నిజమో
మలి సంధ్యా అంతే వాస్తవం
మనిషన్నాక సోయుండాలి
కాళ్ళు భూమ్మీదుండాలి
లోకం మౌనంగా వుందంటే
భాష రాక కాదు
మాటలు లేకా కాదు
అనువయిన సమయంలో
దానికి తెలిసిన భాషలో
అది ఖచ్చితంగా
గూబ గుయ్యుమనేలా
ధ్వనిస్తుంది
ఆత్మ విశ్వాసానికి నమస్కారం
అతి విశ్వాసానికీ, అహంకారానికీ
అంతే తిరస్కారం
అవును మరి
గాలెప్పుడూ ఒకే దిక్కు వీయదు
మరింత తెలుగు సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature