చూడ్డానికి ఇది చిన్న విషయమే!
ఒక్కోసారి చిన్న విషయాలే
మెదడుని బురద గుంటని చేస్తాయి!
ఆలోచించి ఆలోచించి ఆవిరవడం తప్ప
ఏ దారి లేకుండా చేస్తాయి!

ఇంటికి  ఆవలి వైపు 
ఇంకా ఇళ్లు మొలవని
ఖాళీ స్థలంలో నిశ్చలంగా
చెట్లనూ
దూరంగా వున్న ఇళ్లనూ
 ప్రతిబింబిస్తూ నీటి గుంట…..


పక్కనే   చింతచెట్టును
ఆశ్రయించి !
జీవిక కోసం
రోజూ
బురద నీటిలో!
ముక్కుతో
కెలికే కొంగ…
చింత లేని కొంగ..!

ఏ క్రౌర్యమో.
మాటువేసి
నలిపితే తప్ప
నలత పడదు!
రెక్కలమీద
ప్రిస్క్రిప్షన్ రెపరెపలుండవు!
ముక్కు పుటాల్ని కోసే
ఆసుపత్రి వాసనా రాదు!
మొకమ్మీద 
రోగపు దైన్యమూ 
కనబడదు!
క్రమం తప్పదు
కలత పడదు!
రోజూ
బురద నీటిని 
సిరప్ లా తాగే 
బక్క పల్చని
బలిష్ట మైన
కొంగ ..!
నిర్లిప్తంగా 
వుండిపోక
సవాలు విసురుతోంది!
దానికన్నా పెద్ద మనిషిని 
నన్నేపరిహసిస్తోంది!
కొంటె కొంగ! …

అధికుడనని!
ఎవరితోనూ 
కలవనని!
ఉనికితో
శృతి చేసుకోలేని
అహంభావినని !

చిన్న చినుకుకే 
బెంగ పడి
ఒత్తిడికి చిత్తయి 
గిలగిల్లాడి పోయి..
రక్షణ వలయాల 
భయాల సంకెలలో 
బందీనని!
సరదాల బురదలో
ఆనందాలు కెలుకుతూ
అంతకంతకూ
జబ్బుల ఊబిలో
కూరుకుపోయి
మందుల ఆసరా
లేక బతకలేని
ఒంటరినని !
నిజమే…
కొంగ ముందు .. కాదు
మరే ఇతర ప్రాణి ముందూ
తలెత్తుకొలేని నామోషీ ! 
కళ్ళల్లో...
నిష్కళంక పుటింద్రధనుస్సు లు లేవు
ఎదలో...
 ఆకాశపు నైర్మాల్యం లేదు
మట్టి పరిమళాల!
ఉక్కు నరాల!
వజ్ర సంకల్పాల!
ప్రాచీన మానవుడి 
సహజాతాల గుర్తులు
పోగుపోగూ వూడిపోయి
శేషంగా మిగిలిన దేహం!
ఉట్టి నీడగా కదుల్తున్న
సందేహం! 
స్వయం కృతాల
బోనులో
అధముడిగా
నిలబడ్డ దోషి!

నాకు కళ్ళు 
మూసుకోవాలంటే వణుకు! 
రెప్పమూసిన మరుక్షణం….

కొంగ
కాల్పనిక కథలోని
గండ భేరుండంలా!

దాని కాలి గోరుకు 
లిల్లీ పుట్లా వేలాడుతూ 
బలహీనుడైన
మనిషి….

మరింత సాహిత్యం కోసం...https://telugu.asianetnews.com/literature