పిన్నంశెట్టి కిషన్ తెలుగు కవిత: పలుకే బంగారమాయె
తెలుగు సాహిత్యంలో కవిత్వానిదే పైచేయి. పిన్నంశెట్టి కిషన్ రాసిన పలుకే బంగారమాయె కవితను ఏషియా నెట్ న్యూస్ తెలుగు పాఠకుల కోసం అందిస్తున్నాం.
దివారాత్రముల తేడా తప్ప
రోజులన్నీ సెలవుదినాల సమాధులే
ఘడియలన్నీ గాయాల సలపరాలే
గడియారపుముల్లు చిటికలేస్తూ
కాలంపై నడుస్తున్న చప్పుడు తప్ప
ప్రాణాలున్నాయని తెలిపే
ఊపిరిసవ్వడి తప్ప
మరేదిలేని
నిర్జన, నిశ్శబ్ద, నిరాసక్త, నిరాస్వాద వేళ
రింగ్టోన్ పెగిలి
రూపంలేని, స్పర్షలేని
సెల్లుమాటల సొల్లు
చిల్లుచెవిని సోకగలదే కాని హృదిని కాదు
వారగాతెరిచిన తలుపుని తోసుకుని
చిరుగాలి చిరునవ్వయి పొడారినపెదవులపై
చిందేసి చిగురిస్తే బాగుండు
మాటలజల ఆగి ఎండిన నోటిబాయిని
జడివానై ఎవరైనా
తడితడిగా తడిపేస్తే బాగుండు
అద్దంపగిలిన కిటికీరెక్కపై వాలి
పిచ్చుకొక్కటైన కిచకిచల్తో కనికరించి
ముసిరినఈగల ఆలొచనల్ని
నోటకరుచుకుపోతే బాగుండు
పక్షిముట్టిన పండులా
పల్కరింపుల్తో నన్నెవరయినా
వొలుచుకుతింటే బాగుండు
మిత్రుడొకడు తెగిన తోకచుక్కై
ముచ్చటగా ముంగిట రాలి
ముచ్చటవెట్టి మురిపిస్తే బాగుండు
మలిసంధ్యలో మసలు ముసలికి
ఆత్మగల్ల మాటేకదా
గుండెతడారనివ్వని నీటిఊట
మనసుకు ఊత.
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature