మెర్సీ మార్గరెట్ కవిత: మండే వృక్షం
మెర్సీ మార్గరెట్ తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవయిత్రి. ఆమె రాసిన మండే వృక్షం కవితను ఏషియా నెట్ న్యూస్ పాఠకుల కోసం అందిస్తున్నాం.
అగ్ని గోళం మండుతూనే ఉంది
ఆటలాడే వాళ్ళు ఆడుతూనే ఉన్నారు
చినిగిన వస్త్రాలు
ఇంకా రక్తపు మరకలు పోగొట్టుకోలేదు
చేతిగీతల్లో కొత్తవేవో వచ్చి చేరాయి
మెట్లన్నీ అడుగులను లెక్కిస్తూనే ఉన్నాయి
ఒకరి పాదాలను మాత్రం
అవి ఇష్టంగా ముద్రించుకున్నాయి
గాలీ నీరు
నింగీ నేలా
ఎప్పుడూ ఒక్కలా లేవు
అతడి చుట్టూ పిడికిళ్ళు పిడికిళ్ళయి
పహారా కాస్తున్నాయి
నేల మీద పడ్డ అన్నం మెతుకులు
కోడిపిల్లల్లా తిరుగుతుంటే
కరుచుకు పోడానికి వచ్చిన గద్దలకి అతడి దేహం
మండే వృక్షంలా అడ్డు తగులుతుంది
కాలం నావలో
అతడు ఆవలిగట్టుకు వెళ్ళాడు
ఈవలి గట్టుకు
అతడి పేరున స్మృతి స్తూపం వెలిసింది
అతడు మాత్రం మరో యుద్ధం కోసం
ఆయుధంలా పదునవటానికి మౌనంవహించాడు
మరింత తెలుగు సాహిత్యం కోసం: https://telugu.asianetnews.com/literature