కాలాన్ని విభజించి క్యాలెండర్ చేశాము భూగోళాన్ని విభజించి ఖండాలు చేసాము

 జలధి మీద గీతలు గీసి సముద్రాలు చేశాము ఆకాశంలో ఆంక్షలు పెట్టి గమనాన్ని  నిర్దేశించాము

 దైవాన్ని విభజించి 
గ్రంథాలు రాశాము 
మత గ0ధాలు పూశాము

 నక్షత్రాలను విడదీసి రాశులుగా మార్చాము
జనాల జాతకాలు రాశాం

భూమిపై యుద్ధాలు చేసి  సరిహద్దులను గీసి
 జాతీయ జెండాలు పాతాం

 ఇంటికి గడప
 చేనుకు కంచె పునాదిగా ఎప్పుడైనా ఎక్కడైనా అనాదిగా విభజించే పాలించా0

 విభజన లేకుంటే
 గుర్తింపు లేదు అదే ఐడెంటిటీ......
 హద్దులే లేకుంటే భద్రత లేదు అదే సెక్యూరిటీ .......

విభజిస్తే కానీ గణితం బోధపడదు 
అసలు రంగు బయట పడదు
అభిమతం అర్థం కాదు

 ఏ కాలంలోనైనా గీసిన గీటు దాటితే ఉపద్రవమే

ఇప్పుడు ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ఇది నిర్వచనంకాదు 
కేవలం ఉపోద్ఘాతమే

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature