1
మార్చురీలో రెండు ముక్కలుగా చూసింది నీ శరీరాన్నే కాదు
నీ చుట్టూ పెనవేసుకుపోయిన మా ప్రేమలనీ మా ఆశలనీ , నిన్ను పోగొట్టుకున్నాక లోకం మార్చురీలో మిగిలిన మమ్మల్నీ
2
పాతికేళ్ళు కూడా నిండని గుండెని ఒకే ఒక్క తిరస్కారం బరువెక్కించిందా?
మరి, నిన్ను గుండెల మీద పెట్టుకు పెంచిన నీ అమ్మానాన్నల మీద నువ్వు మోపిన ఈ భారాన్ని ఎవరు దింపాలి?
3
నీకు మంచి తిండి పెట్టాలని అంగన్ వాడిలో మీ అమ్మ పడ్డ కష్టం, నీ చదువు చూసి కరిగిపోయింది.
నీకిష్టమైన చదువు కోసం ఊరిలో చిన్న చిన్న పనులలో ముక్కలైన మీ నాన్న శ్రమ నీ కొలువును చూసి మెరిసింది.
నీ దుఃఖం నుండి విముక్తి చూసుకున్నావు గానీ వాళ్ళ కడుపుకోత దుఃఖం కళ్ళల్లో కదలలేదా ?
ఊళ్ళో నీ కబుర్లతో జెండాలా రెపరెపలాడిన వాళ్ళ ముఖాలు ఈ అవమాన దుఃఖంతో ఇక ఎప్పటికీ అవనతమై ఉండవలసిందే కదా
4
ఎన్నెన్ని మాటలు ప్రవహించి ఉంటాయి మన నడుమ-
'ఎన్నెన్ని ముళ్లకంచెలు, బురద గుంటలు దాటి వొస్తే, ఇవాళ ఈ మైదానం మీద ఈ కాస్త సేదతీరిన జీవితాలు ఇవి' అని చెప్పి ఉంటాము.  
ఓడిపోయింది నువ్వు కాదు నాయనా
నీ తిరస్కార భారం ముందు, 'ఇది బతుకును కొనసాగించవలసిన విలువైన జీవితం' అని చెప్పిన మా మాటలు కుంగి పోయి వెక్కిరిస్తున్నాయి
5
చివరాఖరుగానైనా ఒక్కసారి చెప్పవలసింది గదా
నీ కలల పడవ నిన్ను దుఃఖ నదిలో వొదిలేసి వెళ్లిన భారం మోయలేనిదయిందన్న వేదనను పంచుకోవలసింది కదా
ఒక పడవ వొదిలేసి వెళ్ళిన దుఃఖ నది లోకి మరొక పడవ మనకై వస్తుందన్న ఆశ ఒకటి మమ్మల్నిక్కడ సజీవంగా నిలిపి ఉందన్న కథలు కొన్ని నీతో పంచుకుని వుండే వాళ్ళం
నీక్కొంచెం నమ్మకమివ్వలేకపోయిన మనుషులుగా మమ్మల్ని మిగిల్చి పోయావు గదా
6
చూసేందుకు నువ్వు లేవు గానీ
తిరస్కార భారం మోయలేక ఆత్మను విడిచిన దేహమైనా సరే, నవ యవ్వన దేహం ఇహ లోక నిష్క్రమణ ఒంటరిగా సాగకూడదని జిల్లేడుచెట్టుతో పెళ్లి జరిపించారు.
ఒక్క తిరస్కార భారం మోయలేక నువ్వు వొదిలి వెళ్లి పోయింది నీ తల్లినీ, తండ్రినీ, నీ తోడబుట్టిన వాడినీ, నీ రక్త సంబంధాలనీ, నీ స్నేహితులనీ, ఒకే ఒక్క జీవితావకాశంగా దొరికిన ఈ లోకాన్నీ, చివరాఖరికి ఈ జిల్లేడు చెట్టునీ
7
నిజంగానే నిజంగానే దుఃఖం నుండి విముక్తి దొరికి వుంటుందా నీకు ?

మరింత సాహత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature