జ్వలిత తెలుగు కవిత: పక్కనే వెన్ను పోట్లుంటాయి
వర్తమాన పరిస్థితులపై కవయిత్రి జ్వలిత తనదైన శైలీలో ప్రతిస్పందించారు. ఆమె స్పందన పక్కనే వెన్ను పోట్లుంటాయి అనే కవితలో వ్యక్తమైంది. ఆ కవితను చదవండి.
శాంతి ఒప్పందాల అధిగమించడం
లాభసాటి షరతులు తెలిసిన వాడు
ఆయుధాలు పట్టకుండా యుద్ధం చేస్తాడు
ఇక్కడిది కొత్తకాదు
ఇప్పుడిది మొదటిది కాదు
ఒప్పందాల నాన్చుడు బేరాలు
మన స్నేహ హస్తాల పర్యటనల
స్వార్థ పెట్టుబడులు
మన వాటాలుంటాయి
ఆ పక్కనే వెన్నుపోట్లుంటాయి
జై జవాన్ జై కిసాన్ నినాదమైన దేశం
కిసాన్ దీనంగా ఉరి ఊయలూగుతాడు
జవాను ధారుణ దాడులకు గురవుతాడు
మనమేమి చేస్తాము
వాడి వినిమయ వస్తుదోపిడీకి
ఉపకరణాలవుతాము
వాడి ఖజానాలు నింపే పావులవుతాము
ఇరుకు మనుసున్న వాడు
ఇరుకైన లోయ దారిలో
శీలలున్న ఇనుప బద్దలతో
మనను పైశాచికంగా బద్దలు కొడతాడు
మన నిర్భర భారత్
వాడికి అమ్ముకునే ఒప్పందంతో
మనని అమ్మకానికి పెడితే
అమాయకులం వాడి వస్తువులను
బూడిద చేసి ఖాళీ జేబుతో ఒట్టి పోతాం
ఏడవటం అలవాటైన మనం
ఒక జంతువు పేరున పెడబొబ్బలతో శోకిస్తాం
తగలబడుతుంటే తన్మయం చెందే నీరోలు
వీరజవాను కుటుంబాల కోసం ప్రకటనలు చేస్తారు
ఇక్కడేది కొత్తకాకున్నా
స్కలనాంతరం సరాగంలా
ఏవో ఉత్తుత్తి పదాలు వరద కడతాయి
పాపం కొన్ని సమూహ జీవితాలు
దుఃఖాన్ని దిగమింగి దేశభక్తి చాటుకుంటారు
అంతే మరిచి పోతాం
మరికొందరు బలయ్యే వరకు
మరో ఉల్లంఘన జరిగేవరకు
స్వ మర్ధనలు చేసుకుంటూ
మరింత తెలుగు సాహిత్యం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature