Asianet News TeluguAsianet News Telugu

దాసరి మోహన్ తెలుగు కవిత: అంకాలజీ

తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వం విశిష్టమైంది. దాసరి మోహన్ రాసిన అంకాలజీ అనే కవితను తెలుగు ఏషియా నెట్ పాఠకుల కోసం అందిస్తున్నాం.

Telugu Literature: Dasari Mohan Telugu poem
Author
Hyderabad, First Published Feb 22, 2020, 3:01 PM IST

సగం బండి లాగనే లేదు
  లుకేమియా లంగరు వేసింది
  బతుకు బసవతారకం లో
  జాలిగా జాగారాలు...
  
 హఠాత్తుగా
 హార్ట్ ఎటాక్ వచ్చినా బాగుండు
 హాయిగా అలిశెట్టి ని కలిసి వుందు
 
  బార్య క్యాలండర్ చూస్తుంది
  కొడుకులు బిల్ల్స్ పంచుకుంటున్నారు
  బంధువులు
  ఆపిల్ బండి దగ్గర  బేరమాడుతున్నారు..

  కీమోథెరపీ కొలిమి
  దేహామిప్పుడు ఆకులు రాలుతున్న వృక్షం
  నన్ను నేరుగా చూసే దైర్యం చాలడం లేదు 
  
  కట్టప్ప వచ్చి
  కత్తితో పొడిచినా  బాగుండు
  ఈ పాటికి  శుభం కార్డు పడేది
  లోకమంతా నన్ను  మొదటిసారి పోగిడేది.

  ఖర్చు 
 ఆరోగ్య శ్రీ కి అందకుండా పోతుంది
  పెంకుటిల్లు
  పిల్లలకు మిగలకుండా కూలింది
  
  ఉన్నపళంగా
  వూపిరాడినా బాగుండు
  పదో రోజు కల్లా ఆట ముగిసేది
  పదకొండో రోజునుండి
  కన్నతల్లి ఆకలి షిఫ్ట్ లు మొదలయ్యేవి...

  రౌండ్ కొచ్చిన డాక్టర్
  రేడియాషన్ రాశాడు మళ్లీ
  బతికుండగానే కాలుస్తున్నారు
  కాటికి పంపినా బాగుండు
  కాకులైన ఒక పూట తృప్తి పడేవి...

  అంకాలజి  సీరియల్
  అంతుబట్టలేకుండా వుంది
  ఎక్కడెక్కడ తిప్పారో 
  ఎన్ని దేవుళ్ళకు మొక్కుకుందో
  ఎముకల గూడు ఇంటికి చేరింది చివరికి

  ఇప్పుడు మళ్లీ చిగురించాలని వుంది
  నా లాంటి నలుగురిలో 
  విశ్వాసం నింపుకుంటూ.....

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature

Follow Us:
Download App:
  • android
  • ios