Asianet News TeluguAsianet News Telugu

అరుణపట్టకంలో రంగమెటియా కొండలు! దేశరాజు అంతర్, బహిర్ యుద్ధారావం!!_

తెలుగు సాహిత్యంలోని కవిత్వ ప్రక్రియలో దేశరాజుకు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఆయన కవితా సంపుటి దుర్గాపురం రోడ్ మీద వాసు సమీక్ష రాశాడు. దేశరాజు కవిత్వంలోని విశిష్టతను ఆయన విశ్లేషించాడు.

Telugu Literature, Book Review: Vasu reviews Desaraju petry
Author
Hyderabad, First Published Dec 30, 2019, 5:22 PM IST

"Walt Whitman was a poet whose spirit responds to his country's spirit." అని అన్నాడొక సాహితీవేత్త అమెరికన్ కవి వ్హిట్మన్ కవిత్వం గురించి. ఎలాగైతే వ్హిట్మన్ నవీన అమెరికన్ దేశాన్నీ ప్రజలనూ ప్రక్షాళించీ పునర్దర్శించాడో అలాగే మన దేశరాజు కూడా మన సమకాలీన దేశకాలపరిస్థితులను తన కవిత్వదర్పణంలో ప్రతిఫలించీ తనే తన కవిత్వమయ్యాడు. తనే తన కవిత్వమవ్వడమంటే ఏదో మామూలు అర్థంలో కాదు. కవి వ్యక్తీ సామాజికుడూనూ. దేశరాజు శ్రీకాకుళం రంగమెటియా కొండల నీడల్లో పెరిగి, ఆ గడ్డ కన్న పెన్నూ గన్నూ పట్టుకున్న ప్రజాకవి (సుబ్బారావు పాణిగ్రాహి) వంటి కవుల కవిత్వస్ఫూర్తినీ జీవితాదర్శాలనూ పుణికిపుచ్చుకొని "చచ్చిన కొండచిలువలాంటి టాంక్‌బండ్" దాటి హైదరాబాద్ వచ్చిచేరాడు,

జీవిక కోసం. రాయకుండా ఉండలేనివాడే కవి. రాసి మెప్పించేవాడు మంచి కవి. దేశరాజు వైయక్తికకవిత్వమూ రాశాడు, సామాజికకవిత్వమూ రాశాడు. నిజానికొక కవి రచనలను ఇలా ఏదో అందీఅందని ప్రిజమ్‌లోంచీ చూస్తే ఏవో అసంపూర్ణార్థశకలాలు తప్ప అందులోనున్న divinity దృగ్గోచరంకాదు, కవి మాటల్లోనే చెప్పాలంటే "ఊగిపోతున్న ఒంటరి దుఃఖాన్ని పంచుకునే ఏకాంతసమూహం" అంతుపట్టదు, కవి పరితపించిన "ఒకేఒక్క సామూహికస్వప్నావిష్కరణకు" మనం చేయూతనివ్వలేము. కనుక దేశరాజును దేశరాజుగానే చూద్దాం.  

దేశరాజుకి సమసమాజం కావాలి. కవి ఏ అణచివేతలకూ ప్రతిబంధకాలకూ తావేలేని, విభజనరేఖలేలేని స్వప్నప్రపంచాన్ని ఊహిస్తాడు. అక్కడ ఆకలి లేదు, ఆర్తులు లేరు, ఆత్మహత్యలు లేవు. ఒక్క మలినాశ్రువైనా లేదు. అయితే ఈ ప్రపంచం ఇంకా ఆ Promised Land కాదు కదా. అందువల్ల దేశరాజు కవిత్వంలో నింద అంతా మనందరిమీదనే. సంజాయిషీలిచ్చుకునేవాళ్ళు పాలకులేనని అనిపించినా దేశరాజు అక్కడితో ఆగడు, తన సామూహికస్వప్నానికి తోడురాని వారినీ నిగ్గదీసి ప్రశ్నలేస్తాడు. సమాధానాలు కావాలి కవికి. సమాధానాలు సరిపోవు కవికి. ఇందువల్లేనేమో "

ఒంటరితనం ఒక్కోసారి చాంతాడంత పొడుగ్గా" కనిపిస్తుంది, వీధి కుక్క దుఃఖగీతమే పాడుతుంది, "వెన్నెల పెట్రోల్‌లా తడితడిగా" తగుల్తుంది. "ఆకుల సందుల్లోచ్నీ పడిన లావాటి చినుకులూ" వెక్కిరిస్తాయి. ఇలా దేశరాజు కవిత్వమంతటా సందర్భాలూ కవిసమయాలూ మారిపోతాయి. "ఇప్పుడు నాకు, రెండు కళ్ళున్న రెండు వక్షోజాలు కావాలి... రెండు మేఘాల్లాంటి రెండు వక్షోజాలు కావాలి" అని ఎత్తుగడలోనే చెప్పిన కవికి కులాశా ఎందుకు పోయిందా అనే ప్రశ్నలే మిగిలిన కవితల్లోనూ పాఠకులను తరుముతాయి. 

ఈ "దుర్గాపురం రోడ్" సంపుటిలో కవి గత రెండు దశాబ్దాలుగా రాసిన కవిత్వముంది, కవి జీవితానుభవముంది. నగ్నముని, కె.శివారెడ్డిగార్ల పరిచయవాక్యాలతో పాఠకులు తమ ప్రయాణం మొదలుపెట్టి కవి "అల్విదా" చెప్పేదాక ప్రయాణించీ చివరికి అద్దంలో తమతమ ప్రతిబింబాలకు సంజాయిషీ ఎలానో ఇచ్చుకుంటారు. ఆ సంజాయిషీలో కవి చెప్పినట్టే "మనసుకి విడుపు స్నానం" దొరకచ్చు. అయినా మళ్ళీ అద్దంలో దేశరాజే ప్రత్యక్షం కావడం తథ్యం. 

-వాసు

Follow Us:
Download App:
  • android
  • ios