బహుశా మనమెప్పటికీ ప్రేమించుకోలేకపోవచ్చు
బండారి రాజ్ కుమార్ తెలుగు సాహిత్యంలో పేరు ఉన్నవాడు. ఆయన ఏషియా నెట్ న్యూస్ కోసం రాసిన కవితను మీకు అందిస్తున్నాం
చక్కిలిగింతలు పెట్టి మరీ నా గుప్పిట్లోని రహస్యాల్ని బట్టబయలుజేత్తవు. లోలోపలికి ముడ్సుకుపోయే అత్తిపత్తివై నిలబడుతవు. అర్థంకావడానికి యుగాలైనా సరిపోవంటే.. వుత్తిత్తినే అని కొట్టిపారేశిన. యూ ఆర్ సమ్ థింగ్ మైడియర్ !
చెక్కుతూ చెక్కుతూ పనికిరాని శిలాశకలాల్ని మొఖమ్మీన్నే ఇసిరికొడుతవు. మెరిసే ముత్యమవడానికి నిత్తెం కన్నీళ్లను ధారెత్తిపోత్తవు. కావాల్సిన జవాబు అందేదన్క ప్రశ్నల్ని గుప్పిత్తనే వుంటవు. యూ ఆర్ ఆల్వేస్ మిరాకిల్ టు మీ !
నీకెప్పటికీ ప్రేమించడం రాదని ఎప్పటికప్పుడు తీర్మానంజేత్తవు. నన్ను నేనుగానే నీముందు గుట్టలుగుట్టలుగా గుమ్మరించుకుంటాను. సొక్కమెప్పుడూ మెడలేసుకొని ఊరేగడానికి పనికిరాదని తెలుసుకోలేను. నేను లేని నన్ను నీకు అర్పించుకోవడానికి సిద్ధంగా లేనని నీకూ తెలుసు. నువ్వు నాతో పరాశికమాడుతానవనుకుంట. నాలోని లోపాల్ని ఎత్తిచూపడమే నాక్కావాల్సింది. నన్ను నేను దిద్దుకోవడమంటే మరొకరిలా ఉండటమైతే కానే కాదు. నాకు నేను అర్థంకావడానికి నువ్వు నాకు కావాలి ఎప్పటికీ! యూ ఆర్ మై ట్రూ ఫ్రెండ్ ఫర్ ఎవర్ !
ఎంతపానం కొట్టుకున్నా కొల్సుకుంటవనేదే నా పిరాదు. ఎంత కొల్సుకున్నా దూగవనేదే నా తండ్లాట. ఎంత తండ్లాడినా మూతో.. ముక్కో .. ఇర్తవని భయం. ఎవల భయం వాళ్లకున్నా ఒక్క చిరునవ్వే ఇద్దరినీ గెలిచే అసలు సిసలు ఆయుధం. నీ చెరగని చిరునవ్వే నాకెప్పటికీ తోడై నిలిచివుండే బలం.. బలగమని నా నమ్మకం. ఐ హోప్ మై కన్విక్షన్ విల్ బి ట్రూ !
-బండారి రాజ్ కుమార్
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature