రమాదేవి బాలబోయిన కవిత: స్వప్న సమీరం
తెలుగు సాహిత్యంలో కవిత్వానికి ఉన్న ప్రత్యేకత విశేషమైంది. బాలబోయిన రమాదేవి రాసిన స్వప్న సమీరం కవితను తెలుగు సాహిత్య పాఠకుల కోసం అందిస్తున్నాం
గమ్మత్తుగా ప్రతీరేయి
నా కళ్ళతలుపులు మూసీమూయంగానే
ఇంకో లోకానికి ద్వారాలు తెరువబడుతాయి
దినమంతా శ్రమించిన తనువునుండి
నాకు నేనుగా వేరైపోయినట్లు
నిశిరాతిరి దారుల్లో ప్రయాణిస్తూనే
వెలుగులోకాల సందర్శనం చేస్తూంటాను
అక్కడక్కడ తారసపడేవాళ్ళు
లోకంలో నాతో ఉండేవాళ్ళు
నన్నిడిచిపెట్టిపోయినోళ్ళూ
సమావేశమైనట్లు సందడిచెస్తారు
ఓసారి గతానికీ
మరోసారి వర్తమానానికి
ఇంకోసారి భవిష్యత్తుకూ
మధ్యన తిరుగుతూ
వాస్తవాస్తవాలను గ్రహిస్తూంటాను
అదేమిటో గతం మధురంగా
ప్రస్తుతం కఠినంగా
భవిష్యత్తు ఆశాజనకంగా
దృశ్యమానమై కళ్ళవెనుక తెరపైఆడుతుంటుంది
సరిగ్గా అప్పుడే...
తెల్లారింది లెమ్మంటూ
అమ్మ కుదిపిన కుదుపుకి
ఆలోచనలన్ని అదుపులోకి వచ్చి
వర్తమానమంతా స్వప్నదూరమై
మళ్ళీఈలోకంలోకి వచ్చిపడతాను....
రాత్రి నాలో వీచిన స్వప్నసమీరాల హాయిలో నిజంచేయాలన్నతపనతో!!