ప్రముఖ సాహితీవేత్త, చిత్రకారుడు శీలా వీర్రాజు ఇక లేరు

కథ రచయిత, నవలారుడు, చిత్రకారుడు, కవి శీలా వీర్రాజు ఇకలేరు. హైదరాబాదులోని తన స్వగృహంలో బుధవారం ఆయన తుదిశ్వాస విడిచారు. వీర్రాజు రచించిన పలు రచనలకు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. 

Telugu literary gaint Sheela Veerraju no more

హైదరాబాద్: బహుముఖ ప్రతిభాశాలి శీలా వీర్రాజు ఇక లేరు. కథ రచయిత, నవలారుడు, చిత్రకారుడు, కవి శీలా వీర్రాజు తెలుగు సాహిత్యలోకాన్ని శోక సముద్రంలో ముంచి వెళ్లిపోయారు. హైదరాబాదులోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఆయన రాసిన మైనా నవల తెలుగు సాహిత్యంలో విశేషమైన ప్రశంసలు అందుకుంది. పలు సాహిత్య గ్రంథాల కవర్ పేజీలను ఆయన వేసిన చిత్రాలు అలంకరించాయి. శీలా వీర్రాజు 1939 ఏప్రిల్ లో రాజమహేంద్రవరంలో జన్మించారు. కళాశాల విద్య అభ్యసించే సమయంలోనే కథలు రాయడం ప్రారంభించారు. సాహితీ మిత్రులు ఆయనను శీలావీగా పిలుచుకుంటారు.

సమాధి, మబ్బు తెరలు, వీర్రాజు కథలు, హ్లాదిని, రంగుటద్దాలు, పగా మైనస్ ద్వేషం, వాళ్ల మధ్య వంతెన, మనసులోని కుంచె, ఊరు వీడ్కోలు చెప్పింది, శీలా వీర్రాజు కథలు అనే కథాసంపుటులను వెలువరించారు. 

వెలుగురేఖలు, కాంతిపూలు, కరుణించని దేవత, మైనా అనే నవలలను ఆయన రాశారు. కొడిగట్టిన సూర్యుడు, హ్రుదయం దొరికింది, మళ్లీ వెలుగు (దీర్ఘ కావ్యం), కిటికీకన్ను, ఎర్రడబ్బా రైలు, పడుగు పేకల మధ్య జీవితం, శీలా వీర్రాజు, బతుకుబాస (నవలా కథకావ్యం) కవితాసంపుటులను వెలువరించారు. కలానికి ఇటూ అటూ అనే వ్యాససంపుటిని కూడా వెలువరించారు.  

శీలా వీర్రాజు ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి ప్రాంతంలో జన్మించారు. 1961 - 63 ప్రాంతంలో ఆయన క్రిష్ణా పత్రికలో పనిచేశారు. పౌర సంబంధాల శాఖలో అనువాదకుడిగా పనిచేశారు. కొడిగట్టిన సూర్యుడు కవితా సంపుటికి గాను ఆయనకు 1967లో ఫ్రీవెర్స్ ఫ్రంట్ అవార్డు లభించింది. మైనా నవలకు 1969లో ఆంధ్రప్కదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు వచ్చింది. ఆయన సతీమణి శీలా సుభద్రాదేవి కూడా సాహితీవేత్త.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios