టైమ్ మిషన్ ఎక్కకుండానే శ్రీకృష్ణ దేవరాయుల కాలంలోకి ప్రయాణం
కృష్ణుడంటే మరెవరో కాదు శ్రీకృష్ణ దేవరాయులు. అప్పటికి ఇంకా ఆయన రాజు కాలేదు. పట్టాభిషేకం జరగలేదు. ఆయన కళ్లు పీకేయమని అప్పటి రాజు ఆజ్ఞ. మంత్రి ఆ ఆజ్ఞను అమలు చేసాడా...ఏం జరిగింది...అని ఆ పై వాక్యాలు చదివాక ఖచ్చితంగా ఆసక్తి కలుగుతుంది.
--సూర్య ప్రకాష్ జోశ్యుల
అప్పాజీ ...మా తండ్రి గారి తర్వాత అంతగా మిమ్ములను మీరు అభిమానిస్తారు కదూ
అదేమిటి ప్రభూ...తమ కోసం ప్రాణాలు అర్పించమూ
అయితే మాదొక కోరిక ఉంది మన్నిస్తారా
ఆజ్ఞాపించండి ప్రభూ
మాట తిరగనని ప్రమాణం చెయ్యండి
సరే ప్రభూ అలాగే. సెలవివ్వండి
గాలికి దీపాలు రెపరెపలాడాయి. పరదాలు అటు ఇటు కదిలాయి. అప్పాజీ నీడ ఊగిసలాడింది. క్షణం మౌనం
కృష్ణుడుని వధించి, ఆ నేత్రాలు మాకు చూపించండి
ప్రభూ..కృష్ణుడు రాజ్యానికి చేసిన సేవ అనన్య సామాన్యం.
అప్పాజీ...ఈ విషయంలో మరో మాటకు,చర్చకు తావు లేదు. మా ఆజ్ఞని పాలించవలిసిందే. కార్యం ముగిసిన తర్వాతనే మీ దర్శనం. అప్పటిదాకా శెలవు..కఠినంగా పలికాడు ప్రభువు.
-----
కృష్ణుడంటే మరెవరో కాదు శ్రీకృష్ణ దేవరాయులు. అప్పటికి ఇంకా ఆయన రాజు కాలేదు. పట్టాభిషేకం జరగలేదు. ఆయన కళ్లు పీకేయమని అప్పటి రాజు ఆజ్ఞ. మంత్రి ఆ ఆజ్ఞను అమలు చేసాడా...ఏం జరిగింది...అని ఆ పై వాక్యాలు చదివాక ఖచ్చితంగా ఆసక్తి కలుగుతుంది. ఇలాంటి ఉత్కంఠను రేపే సన్నివేశాలు ఈ పుస్తకం నిండా కోకొల్లలు. అలా రాయటం మామూలు విషయం కాదు..కత్తి మీద సామే. ఎందుకంటే చరిత్రలలో కల్పన తగ్గితే పాఠంలా ఉంటుంది. కల్పన పెరిగితే స్వేచ్చ తీసుకుని మార్చేసాడంటారు. అది బాలెన్స్ చూసుకుంటూ ముందుకు వెళ్లాలి.
-----------------
మణిరత్నం 'పొన్నియిన్ సెల్వన్' అనే చారిత్రిక నవలను తీసుకుని సినిమా చేస్తున్నారంటే ఆశ్చర్యం వేసింది. ఆ వెంటనే ఆ నవల చదవాలనే ఆలోచన కలిగింది. దాన్ని ఆర్. కృష్ణమూర్తి అన్న ప్రసిద్ధ రచయిత వ్రాసారు. ఆయన కలంపేరు 'కల్కి'. అయితే ఆ పుస్తకాన్ని తెలుగులో అనువాదం ఎవరూ చేసినట్లు లేరు. దొరకలేదు. కానీ నా మనస్సులో చారిత్రక నవలలు చదవాలనే ఆలోచన మాత్రం కలిగించింది. అయితే మన తెలుగులో అలాంటి పుస్తకాలు తక్కువే. మన తెలుగులో చారిత్రిక నవలలు అనగానే విశ్వనాథ సత్యనారాయణ, మహీధర రామమోహనరావు, తెన్నేటి సూరి, నోరి నరసింహశాస్త్రి వంటివారు రాసిన రచనలే గుర్తుకు వస్తాయి.
ఆ తర్వాత ప్రసాద్ గారు లాంటి వాళ్ల చారిత్రక రచనలు వచ్చాయి. కానీ ఎందుకో అంత పాపులర్ కాలేదు. అందుకు సాహిత్యేతర కారణాలూ ఉండవచ్చు. ఈ క్రమంలో నాకు కనిపించిన పుస్తకం 'శ్వేత పద్మము'. విజయనగర సామ్రాజ్యం,శ్రీకృష్ణ దేవరాయులు కాలంలో జరిగిన కొన్ని సంఘటనలు బేస్ చేసుకుని ఈ నవల నడుస్తుంది. రామరాజు అనే రచయిత రాసిన ఈ నవల ఈ మధ్యన ప్రచురించిందే. ఈ విషయం తెలిసిన వెంటనే సంపాదించి చదవాను. కొంచెం గ్రాంథికశైలి కానీ చారిత్రక విశ్లేషణ అపూర్వమని చెప్పాలి. జరిగిన సంఘటనలను తీసుకుని, కల్పన కలిపి రాసిన నవల ఇది.
ఆనాటి కాలమాన పరిస్థితులలోకి వెళ్తూ.. ఒక రకంగా టైమ్ మెషిన్ లో ఆ నాటికి ప్రయాణింపచేయటమే ఈ నవలలలోని ప్రత్యేకత. ఏకబిగిన చదివించే శైలితో రచన పరుగులెత్తింది. కృష్ణదేవుడు..శ్రీ కృష్ణ దేవరాయులు గా ఎలా అయ్యారు. విజయనగర సామ్రాజ్యాన్ని ఎలా పాలించాడు. ఆయన చిన్న భార్య చిన్నాజి ఎవరు...ఆమెను పెళ్లి చేసుకోవటం వెనక జరిగిన కథేంటి..అలాగే పెద్ద భార్య తిరుమల దేవి ఎక్కడ నుంచి వచ్చింది. వీళ్లద్దరిలో ఆయన ప్రేమించి పెళ్లి చేసుకుంది ఎవరిని...అప్పటి సంఘటనలు కళ్లకు కట్టినట్లుగా వర్ణిస్తాడీ రచయిత. అలాగే ఈ కథలో మరో ప్రత్యేకత అలివేణి కథ. ఇదే ఈ టైటిల్ ని సూచిస్తుంది.
ఆ కాలాన్ని కళ్ల ముందు ఉంచుతూ, విభిన్న పాత్రలతో ఎక్కడా విసుగనిపించకుండా, కథా గమనంలో బిగువు సడలకుండా కథను రచయిత రామరాజు నడిపించిన తీరు అసామాన్యం. అడవి బాపిరాజు వ్రాసిన ‘హిమబిందు’, ‘గోన గన్నారెడ్డి’ , వేదం వెంకటరాయశాస్త్రి వ్రాసిన ’ ప్రతాపరుద్రీయం’ లాగ చారిత్రిక ఆధారంతో వెలువడిన సాహిత్యమే ఈ పుస్తకం కూడాను.ఈమధ్య కాలంలో అంటే ఇటీవల కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చిన రాయలసీమ చారిత్రక నవల శప్తభూమి కు ఏ మాత్రం తగ్గదు. దీనిని చదివి ఆనందించ వలసిందే కానీ చెప్పడం కుదరని పని. ఈ నవలని సినిమా చేస్తారో లేదో కానీ చదవుతూంటే మాత్రం ఓ సినిమా కళ్ల ముందు కనపడుతుంది. చరిత్ర అంటే ఆసక్తి ఏ మాత్రం ఉన్నా ఖచ్చితంగా ఈ పుస్తకం ఓ విందుభోజనమే అనటంలో సందేహం లేదు.
శ్వేతపద్మము
వెల:100/-
సాహితి ప్రచురణ
దొరుకుచోటు: ఆన్ లైన్ లోనూ, అన్ని లీడింగ్ పుస్తకాల షాపుల్లోనూ.