Asianet News TeluguAsianet News Telugu

శ్రీనివాస లింగం తెలుగు కథ: పెరట్లో అరటి చెట్టు

శ్రీనివాస లింగం పెరట్లో అరటి చెట్టు అనే కథ రాశారు. కుటుంబ సంబంధాలపై రాసిన ఈ కథ జీవితానుభవాలను వ్యక్తీకరిస్తుంది. మానవ సంబంధాల విలుపలను తెలియజేస్తుంది.

Srinivas Lingam Telugu short story Peratlo arati chettu
Author
Hyderabad, First Published Sep 7, 2020, 10:45 AM IST

ఒసేయ్.. రమాదేవీ...ఎక్కడ చచ్చావ్..
ఓ సారి ఇటురావే..
అబ్బబ్బబ్బా.. చంపుకు తింటారు. 
దేవీ......అని ధీర్ఘం తీసి మరీ పిలుస్తారు. ఒక నిమిషం ఇలా పక్కింటి పిన్నిగారి దగ్గర కెళ్ళాను, వస్తున్నాను.
ఆ.. చెప్పండి.. ఏం కావాలి.
ఎందుకే కోడలా విసుగు. ..ఇదిగో ఈ విసినకర్ర కొంచెం చేతికి అందియ్యి.
చ..చ్చా.. తీసుకోలేరు, మంచం కిందే ఉందిగా......అయినా, రెండుగడపలవతలనుంచి పిలుస్తారు.
మధ్యాహ్నానికి ఏమి చేస్తున్నావు. నోటికి చప్పగా ఉంది. కొద్దిగా ఘాటుగా మిరియాల చారు పెట్టరాదూ..
మిరియాల చారు కాదు, మిమ్మల్ని కూర్చోబెట్టాలి ఎసరు మీద అంటూ గొణిగింది రమాదేవి.
ఏంటే గొణుగుతావ్ అంది జానకమ్మ
ఏమీ లేదు అంది రమాదేవి.
ఒకసారి లేవండి.. పక్క కూడా దులిపి వెళ్తాను, లేపోతే, మళ్ళీ పిలుస్తారు అనగానే, జానకమ్మ తన దిండు తీసుకొని, కొంచెం దూరంగా వెళ్ళింది. ఆ దిండు కూడా ఇవ్వండి. గలేబు మారుస్తాను అంది రమాదేవి
ఆ గలేబు ఆక్కడ పెట్టు, నేను మార్చుకుంటాను అంది జానకమ్మ.
ఎంటో, మంచం కింద ఉన్న విసినికర్ర కి కూడా నన్ను పిలుస్తారు కాని, ఆ దిండు మీద మాత్రం చేయివేయనీయరు. అందులో, ఎవో బంగారం కడ్డీలు ఉన్నట్టు.
అవునే, అవే ఉన్నాయి, మీకోసమే పెట్టాను. ఇస్తానులే నే పోయేలోపు అంది జానకమ్మ.
ఉ..ఉ.. అదొక్కటే తక్కువ అంది, రమాదేవి, మూతి తిప్పుతూ.
సర్లే కాని, పెరట్లో అరటిచెట్టుకి నీళ్ళు పోసావా. రోజూ చెప్పాలి. ఆ చెట్టుకి కంచె కట్టమని. కట్టాడా వాడు. కనీసం సాయంత్రమైనా కట్టమని చెప్పు.
అప్పటికే, చాలా అరటి చెట్లు బాగా గుబురుగా పెరిగాయి, కొన్నైనా తీసెద్దాం అంటే , ఆ చెట్లు తీయడానికి వీల్లేదని, తను చచ్చిన తరువాతే ఆ చెట్లని తియ్యాలని నానా రాద్దాంతం చేసేది.
భార్యా భర్త లిరువరూ చాలా సార్లు చెప్పి చూసారు, ఆ చెట్లు తీసెద్దాం, కొంచెం చోటు కలసివస్తుందని.
అమే ఎప్పుడూ, ససేమీర ఒప్పుకొనేది కాదు. అమే ఉండగా అవి నరికెస్తే, ఆమెకి అనారొగ్యం వస్తుందని, క్షేమం కాదని గట్టిగా చెప్పి గొడవపెట్టేది.
చేసేదిలేక, అమె ఉండగా  ఆచెట్లు తీసే ప్రయత్నం ఇక మానేసారు.
అబ్బ.. ఎన్ని సార్లు చెప్పను. కంచె కట్టమని, నేను పోయేటట్టున్నాను గానీ, కంచె మాత్రం కట్టరు అంది జానకమ్మ
సరే ..సరే.. సాయంత్రం మీ అబ్బయొచ్చాక..చెప్తాను. రేపు ఆదివారమే కదా..కడతారులెండి. పేరుకే జానికమ్మ, అలవాట్లన్నీ, తాటకివే అంది రమాదేవి, ఆవిడ కొంచెం వినేటట్టు.
సాయంత్రం, తన భర్త వచ్చాక, అత్తగారిమీద చాడీలు ఏకరువు పెట్టింది.
సర్లేవే, అమ్మ ని ఈ వేళ చూస్తున్నామా.. ఎప్పుడూ ఇంతేగా. 
అయినా మతి లేక, అరిటిచెట్టుకి కంచే ఏంటి, నా మొహం. ఎక్కడైనా విన్నామా, మరీ ఇంత చాదస్తమా ? అంది రమా దేవి భర్త తో.
అవును నిజమే, కానీ, ఎప్పణ్ణించో చెప్తోంది, ఊరుకోదు. రేపు కడతానులే అని భోజనం ముగించారు.
అవును అమ్మాయి పెళ్ళి గురించి ఏమి అలోచించారు అంది రమాదేవి, డబ్బులు ఏర్పాటు ఎక్కడివరకూ వచ్చిందని అంటూ పెళ్ళి వారి నుంచి ఉత్తరం కూడా వచ్చింది అని గుర్తు చేసింది.
అలోచించడానికి ఏముంది, ఇల్లు అమ్మాలి, ఓ పక్క అమ్మ ఆనారోగ్యం, ఖర్చులు, అమ్మాయి పెళ్ళి. ఎంచేసేది ? ఆఫీస్ లో కూడా ఇప్పటికే, ఆ లోన్లు , ఈ లోన్లు అని బోలుడంత తీసుకున్నాను. ఈ సారి ఇల్లు అమ్మడం తప్ప, వేరే మార్గం లేదు అంటూ, నిద్రలోకి జారుకున్నాడు అవతారం.
ఇంకా నిద్ర పట్టక అటూ, ఇటూ దొర్లుతున్న జానకమ్మ, వాళ్ళ మాటలు వింటూ, ఒక చిన్న నిట్టూర్పుతో ఆమె కూడా నిద్రలోకి జారుకుంది.
మరునాడు, ఉదయం లేవ గానే, కాస్త కాఫీ తాగి, అవతారం అరటిచెట్టుకి కంచె కట్టాడు.
మొత్తానికి, చాలా రోజులు నుంచి పెండింగ్ లో ఉన్న పని అయినందుకు, అవతారం, ఇక అత్తగారు గొడవ తగ్గిందని రమాదేవి, ఎదో కోట్ల ఆస్తి వచ్చినట్టు జానకమ్మ చాల రోజులు తరువాత, ఆనందంగా ఉన్నారు.
సాయంకాలం టీ తాగుతూ, అవతారం అమ్మతో కూర్చుని వుండగా..ఒరేయ్.. అవతారం.. నా  ఆపరేషన్కి ఏమి అలోచించావు అని అడిగింది జానకమ్మ.
లేదు అమ్మా, చూడాలి..ఎక్కడ సర్దుబాటు కావటంలేదు అన్నాడు అవతారం.
ఒకసారి మన బంగారకొట్టు ఆచారిని పిలు, నేను మాట్లాడాలి అంది. ఏందుకమ్మా అనేలోపే, నాకు ప్రాణం మీదకొస్తే, రమా చేతిగాజులు అమ్మైనా, నాకు హాస్పిటల ఖర్చులకి కావాలి కదా అంది. అవతరాన్ని, రమాదేవిని బదులు చెప్పనీయలేదు. 
ఆ రోజు రాత్రి, తన భర్త తో , పెద్ద గొడవే పెట్టుకుంది రమాదేవి. అయినా, అమ్మకు భయపడి, తరువాతి ఆదివారం, బంగారం కొట్టు ఆచారిని పిలిచాడు అవతారం.
ఏరా ఆచారి, బాగున్నావా, ఎప్పుడో, నీ చిన్నప్పుడు, మీ కొట్టుకొచ్చాను, అవతారం వాళ్ళ నాన్నగారున్న రోజులలో, అప్పుడు, నువ్వ్వు చాలా చిన్నపిల్లోడివి అంటూ ఆచారిని పలకరిం చింది. బంగారం రేటు ఎలా వుంది ?  అమ్మితే ఏ రేటు ఇస్తావంటూ అనేక ప్రశ్నలు వేసి, చివరకి, అమ్మినప్పుడు, మంచి రేటు ఇచ్చి, తిప్పించకుండా దబ్బులు ఇస్తానని , ఆ ఆచారి దగ్గర ఒట్టు పెట్టించుకున్నంత పనిచేసింది. బాండుపేపర్ మీద సంతకం ఒకటి తక్కువ అంతే, బ్రతుకు జీవుడా అని, ఆచారి అక్కడనుంచి పడ్డాడు.
అలా రోజులు గడవగా.. అమ్మాయి పెళ్ళికి డబ్బులు ఏర్పాటు కాక, అమ్మ వైద్యానికి కూడా డబ్బులు చేతిలో లేక, అవతారం యొక్క అవతారం మారింది, కాస్త చికాకు, కోపం ఎక్కువయిది.
ఇలా ఉండగా, రమాదేవి, వాళ్ళాయనతో, అత్తగారు చీటికి మాటికీ, , ఆపని చేయి అని, ఈ పని చేయి అని బాగా ఇబ్బంది పెడు తోందని బాగా వాపోయింది.
సర్లే, నేను మెల్లగా అమ్మకి చెప్పి చూస్తాను అన్నాడు అవతారం. ఈలోపు, మగ పెళ్ళివారు కూదా డబ్బులు త్వరగా ఏర్పాటుచేసుకోమని, లేని పక్షంలో పెళ్ళి సంబంధం మానుకోవలసి ఉంటుందని చాలా మార్లు ఇంటికి వచ్చి మరీ చెప్పారు.
ఒకరోజు, జానకమ్మ, సాయంత్రం, అవతారాన్ని పిలిచి మంచం బయట అరటి చెట్టుకింద వేయమని మొండి పట్టు పట్టింది. ఒద్దు, బాగా మంచు ఉంది బయట అని చెప్పినా వినలేదు, ఇక గత్యంత్రం లేక, బయట అరటిచెట్టు కింద మంచం వేసి, వాళ్ళు గొళ్ళెం పెట్టుకొని ఇంట్లో పడుకున్నారు.
ఉదయం, ఎప్పుడూ, నాలుగు గంటలఖే లేచే జానకామ్మ , ఆరు గంటలైనా లేవకపోయేసరికి, అనుమానమొచ్చి చూస్తే, ఉలుకు పలుకు లేకుండా నిద్రలోనే కాలంచేసింది.
బాగా ఏడిచి, ఏడిచి, ఆమేను కింద పడుకోపెట్టడానికి, దిండుతోపాతు లేపి, కింద పడుకోపెడుతొంటే, దిండు లోంచి ఒక ఉత్తరం, పక్క లోంచి కొన్ని గన్నేరు కాయలు కిండ పడ్డాయి. ఒక్కసారి అవాక్కైన రమాదేచి, అవతారం ఆ ఉత్తరం చదవడం ప్రారంభించారు.
ఒరేయ్.. అవతారం, రమాదేవి....
మీ తాతగారి నాన్నగారు, ఈ అరటి చెట్లు ఇక్కడ పాతి నప్పుడు, ఇవి ఎప్పటికీ నరకొద్దని చెప్పారు.
ఒకవేళ నరకివల్సొస్తే, ఎంతో అవరసరమైతే నే ఆపని చేయమని చెప్పారు, అలా చెప్పటం వెనుక రహస్యమేంటంటే,
ఆ చెట్టు కింద, ఒక కొన్ని (ఎన్నో నాకు కూడా తెలియదు) బంగారునాణేలు పెట్టారు. మన వంశంలో ఎవరిక కైనా అత్యవసరం ఉంటే ఉపయోగపడతాయని. కాని, వీటి అవసరం, మన తరానికి వస్తుందని నేను, మీ నాన్నగారు అనుకోలేదు. ఇన్నాళ్ళ తరువాత, వాటి అవసరం నా వైద్యం, లేక అమ్మాయి పెళ్ళి రూపంలో వచ్చింది. కాని, నేను బతికుండగా ఆ చెట్లు తీసే ప్రయత్నం కూడా చేయనని మీ నాన్నగారికి నేను మాట ఇచ్చాను. అందుకే, అస్తమానం, మీతో ఆ చెట్లు నరకొద్దని, కంచె కట్టమని గొడవ పెట్టేదాన్ని.
ఒక సారి, చెట్లు తీసేసి , ఆ నాణేలు చూస్తే, బద్దకం పెరిగి, వాడుకోవటం మొదలు పెడితే, నాలుగు రోజులలో అయిపొతాయని, మీకు సోకులు పెరుగుతాయనె ఆలోచనతో, ఎప్పుడూ, జానకి ని ఆ పనులని, ఈ పనులనీ ఇబ్బంది పెట్టెదాన్ని. దానికి బద్దకం పెరగకూడదని.
నేను, తాటకిని కాదమ్మా, ఆ రాముని మాటనిలబెట్టె జానకిని. నా ఈ దిండు లో, ఈ ఉత్తరం ఎప్పుడో రాసిపెట్టు కున్నాను , అందుకే, ఆ దిండు ముట్టుకోవద్దని వారించేదాన్ని.
అమ్మాయి పెళ్ళి చేయండి. పెళ్ళి అయిపోయి ఉంటే , బాంక్ లో వేయండి అమ్మాయి పేరున. వాళ్ళ పిల్లలకి ఉపయోగపడుతుంది.
ఇట్లు, మీ అమ్మ,
జానకమ్మ.

గన్నేరు కాయలు చూసి, అమె నోట్లో నురగ చూసి, ఇద్ధరూ బోరున విలపించారు. అమ్మాయి పెళ్ళికి ఇల్లూ అమ్మవలసివస్తుందని, లేదా నాన్న మాటకి వ్యతిరేకం గా, అమ్మ ఉండగానె, చెట్లు కొట్టాల్సివస్తుందని , అమ్మ ఇలా గన్నేరు పప్పు తిని.... ఇక అవతారానికి మాటలు రాలేదు. వాళ్ళకి ,జానకమ్మ , కనీసం ఊహ కి కూడ అందనంత ఎత్తులో కనిపించింది.
అమ్మా, ఎంత తెలివిగా, ముందే, ఆచారితో, రేటు కూడా మాట్లాడి పెట్టవమ్మా అంటూ , మళ్ళీ ఒక సారి అమ్మని గుర్తు చేసుకుని కన్నీటి పర్యంతం అయ్యారు. 
రమాదేవి చాలా పశ్చాతాప పడింది, అమ్మాయి పెళ్ళి ఘనం గా జరిగింది.
జీవితాంతం, మళ్ళీ పెరట్లో పెంచిన అరటి చెట్లో, వాళ్ళ అమ్మను చూసుకున్నారు ఆ దంపతులు ఇరువురు.

Follow Us:
Download App:
  • android
  • ios