Asianet News TeluguAsianet News Telugu

అభ్యుదయ కవిత్వానికి తోడ్పడిన పత్రికలు

అభ్యుదయ కవిత్వం లక్షణాలు తెలుగు సాహిత్యం పైన దాని ప్రభావం గురించి సిద్దిపేట నుండి డా. సిద్దెంకి యాదగిరి అందిస్తున్న వ్యాసం రెండవ భాగం ఇక్కడ చదవండి

Siddenki Yadagiri critical essay on magazines promoted progressive poetry
Author
Hyderabad, First Published Mar 11, 2022, 2:00 PM IST

వార్త యందు జగము వర్ధిల్లుచున్నది అని నన్నయ్య అన్నట్లు అభ్యుదయ సాహిత్యానికి వాహకంగా నిలిచిన పత్రికలూ ఉన్నాయి.  వాటిలో ప్రధానంగా అభ్యుదయ – నవ్య సాహిత్య పరిషత్తు (1958- 69) తెలుగుతల్లి - రాచమల్ల సత్యవతీదేవి,  జ్వాల - ముద్దు కృష్ణ,  ఉదయిని - కొంపెల్ల జనార్ధనరావు (శ్రీ శ్రీ మహాప్రస్థానం అంకితం ఇవ్వబడినది వీరికే), కాగడా – తాపీధర్మారావు, వీణ - పాటిబండ్ల మాధవి శర్మ తెనుగు - ఒద్దిరాజు సోదరులు మొదలైన పత్రికలు ఎంతగానో అభ్యుదయ కవిత్వం వ్యాప్తిలో భావజాల ప్రచురణలో తోడ్పడ్డాయి.

వచన కవితకు ఆద్యుడుగా పేర్కొనదగిన కవి శిష్ట్లా ఉమామహేశ్వరరావు. తన  కవిత్వాన్ని ప్రహ్లాద కవిత్వం అన్నారు.  "ప్రహ్లాద కవిత్వం ఆరిపోయే దీపాన్ని  రగుల్చుతుంది,  పరిగెత్తే పామరుడిని నిలేస్తుంది" 'నూతనంలో బహు నూతన కవిత్వం' అని నవమి చిలుక ముందుమాటలో పేర్కొన్నాడు.  నవమి చిలుక 1938లో గ్రామీణ జీవిత నేపథ్యంగా, విష్ణుధనువు ప్రేమతో నిండిన కావ్యం. ఉమామహేశ్వరరావు నుద్దేశించి సినారె భావ కవిత్వంపై తిరుగుబాటు చేస్తేనే కానీ, కొత్త బాట వేయలేదని ఒప్పుకోక తప్పదు అని అన్నారు.

తొలి అభ్యుదయ కవితా సంకలనం ‘నయాగరా’ 1944లో ప్రచురించబడింది.  బెల్లంకొండ రామదాసు,  కుందుర్తి ఆంజనేయులు, ఏల్చూరి సుబ్రహ్మణ్యం నయాగరా సంకలనం తీసుకువచ్చారు.  వీరే నయాగరా కవులుగా చెలామణి అయ్యారు.  నయాగర కవితా సంకలనాన్ని అనిశెట్టి సుబ్బారావుకు అంకితమిచ్చారు.  నువ్వు చేసిన మన్యం విప్లవం దేశానికి మార్గదర్శనం అని అల్లూరి గురించి రాసుకున్నారు.
తొలి వచన కావ్యం, వచన కవిత్వ సంపుటి నవమి చిలక(1938). అభ్యుదయ కవిత్వంలో తొలి సంకలనం  ‘నయాగరా’. తొలి అభ్యుదయ కవితా సంపుటి శ్రీ శ్రీ ‘మహా ప్రస్థానం’ 1950లో ప్రచురితమైంది. కొంపల్లి జనార్ధన రావు గారికి అంకితం ఇవ్వబడింది.  ముందుమాట రాసింది చలం. నయాగరా కవులలో ఒకరైన బెల్లంకొండ రామదాసు –‘బ్రతికే క్రాస్, మనిషి ఒక క్రైస్ట్’ అని అన్నారు.

వచన కవితా పితామహునిగా బిరుదు గాంచిన కుందుర్తి ఆంజనేయులు  తెలంగాణ (18 పర్వాలు) నాలో నినాదాలు, నగరంలో వాన, హంస ఎగిరిపోయింది. మొదలైన కావ్యాలు రాశారు.  వారి కవిత పంక్తులు కొన్ని
“నా గీతం, నర జాతి విముక్తి సంగీతం.”
“ప్రయోజనం తండ్రిగా పరమ సౌందర్యం తల్లిగా పలికే ప్రతి పలుకు రసానంద కల్పవల్లి.”
“ఒక మనిషి నిద్ర లేచి, లక్ష మందిని నిద్ర లేపుతాడు”
“ఇది నా కవిత్వం, వినేవాడు నరుడు, చదువుసంధ్యలు రానివాడు పామరుడు” అని అన్నాడు.

1930 వరకు తెలుగు సాహిత్యం నన్ను నడిపించింది తర్వాత నేను తెలుగు సాహిత్యాన్ని నడిపించానని శ్రీ శ్రీ అన్నారు.  అభ్యుధయకవిత్వోద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెల్లిన ఘనత వారికే దక్కుతుంది. 

“స్మరిస్తే పద్యం, అరిస్తే వాద్యం, అనల వేదిక ముందు అస్త్ర నైవేద్యం”
“నేనొక దుర్గం, నాదొక మార్గం, అనితర సాధ్యం నా మార్గం”
“మానవుడే నా సందేశం, మనుష్యుడే నా సంగీతం”
“నేను మంటల చేత మాట్లాడించి, రక్తం చేత రాగాలాపన చేస్తాను
“కదిలేది కదిలించేది, పాడేది పాడించేది, పెనునిద్దుర వదిలించేదీ”
“అలజడి మా జీవితం, ఆందోళన మా ఊపిరి, తిరుగుబాటు మా వేదాంతం”
“ఏ దేశ చరిత్ర చూసినా ఏమున్నది గర్వ కారణం, నరజాతి చరిత్ర సమస్తం, పరపీడన పరాయణత్వం
రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదకిన దొరకదు.”
అనేకమైన అంశాలతో కొత్త పద్ధతుల్లో వస్తు ప్రయోగం, వస్తు నవ్యత శిల్ప చాతుర్యంతో శ్రీశ్రీ ఆకట్టుకున్నాడు.

శ్రీరంగం నారాయణ బాబు ‘సంఘర్షణ’, ‘ప్రవర’, ‘కదన కుతూహల రాగం’, మొదలైన కావ్యాలు వెలువరించారు. కదన కుతూహలం అనే కవితలో “రుధిర జ్యోతి జ్వలన లలన ప్రియుండ, విప్లవ రుషిని విద్రోహ కవిని” అని తన గురించి తాను పేర్కొన్నాడు.

“మరఫిరంగి మహతిగా మీటి, కదన కుతూహల రాగం వినిపిస్తాను” అని నారాయణ బాబు తన కవితా పంక్తుల ద్వారా అభ్యుదయాన్ని ప్రాచుర్యం కల్పించారు.

తిక్కవరపు పఠాభిరామిరెడ్డి (పట్టాభి) ఫిడేలు రాగాలు డజన్, పఠాన్ పంచాంగం(1968), కైత నాదయిత 1978 మొదలైన కావ్యాలు రాశాడు.

“అనుసరిస్తాను నవీన పంథా, కానీ భావ కవి కాన్నేనంహంబావ కవిని.”
“నా ఈ వచన పద్యాలనే దుడ్డు కర్రలతో, పద్యాల నడుములు విరుగ దంతాను, చిన్నయసూరి బాలవ్యాకరణాన్ని చాలదండిస్తాను.” అని పట్టాభి తన కవితా పంక్తుల ద్వారా సంప్రదాయం మీద నిరసన తెలిపాడు.  ఆస్కార్ వైల్డ్ ను  -  కళ  కళ కొరకే  -  అని బలపరిచిన కవి పట్టాభి.

“గుడిలోని దైవమా ఆలింపవోయి, గుడిలోని దైవమా పైకి రావోయి”
“మాల మెట్టిన నేల, మాల పెట్టిన సీమ,  మైళ పడినది.”- పురిపండా అప్పలస్వామి
“మానవ స్వాతంత్ర మాగ్నాకార్టాలైన,  రక్తాక్షరాలు వారాలు చేసేశాను”- తెన్నేటి సూరి
“జన్మనెత్తిన మానవులకు జీవితమే పరమ ధనం, అయితే అది ఒక మారి అతనికి ఒసగబడిన ఒక వరం” పట్టాభి పేర్కొన్నారు.

ఆవంత్స సోమసుందర్  వజ్రాయుధం, ఊరు మారింది, వెన్నెలలో కోనసీమ, చీకటినీ ద్వేషిస్తాను మొదలైన పుస్తకాలు వెలువరించారు. అనిసెట్టి సుబ్బారావు ‘అగ్నివీణ’  ప్రచురించారు.

“నా కావ్యం ఒక కల్చర్ - నా కావ్యం ఒక సోల్జర్” -  రెంటాల గోపాలకృష్ణ
“లెండి లెండి బానిసత్వపు నిద్ర నుండి,  మేల్కొనండి బానిసత్వపు నిద్ర”
“అధర్మము ప్రవర్తించిన చోట- అభ్యుదయ కవిగా అవతరింప”
"అదిగో అరుణ పతాకం / పేదవారికి ప్రాణం / పీడిత ప్రజా కాదారం" అని రెంటాల గోపాలకృష్ణ గలమెత్తారు. 

“కవిత కోసం నేను పుట్టాను / కాంతి కోసం కలం పట్టాను” అని ఆరుద్ర గారు అన్నారు. అభ్యుధయకవిత్వోద్యమంలో   బోయి భీమన్న -  దీప సభ, గుడిసెలు కాలిపోతున్నాయి వెలువరించారు.  గజ్జెల మల్లారెడ్డి వజ్ర జిహ్వలో  “తెలుగు నాట భక్తి రసం తెప్పలుగా  పారుతుంది,  డ్రైనేజీ స్కీం లేక డేంజర్ గా మారుతుంది” అని అన్నాడు.

“నేను కవిని, నేను రవిని, నా దేశ ప్రగతి రథం చోదకుడిని” అన్నది ఎల్లోరా. కమ్మిశెట్టి వెంకటేశ్వరరావు అగ్నిశిఖలు – మంచు జడలు, సి. విజయలక్ష్మి- త్రినేత్రం, సి.వి కృష్ణారావు- వైతరణి, మాది మీ ఊరే;  శీలావి - కొడిగట్టిన సూర్యుడు, ముల్లెమ్మ, అద్దె గది, హృదయం దొరికింది; అద్దేపల్లి రామ్మోహన్ రావు - అంతర్జల; కె.వి.రమణారెడ్డి – అడవి, భువన ఘోష, స్టాలిన్ అస్తమయం, అంగార వల్లరి, రక్తాశ్రువులు, రణోణ్మాది;    సుంకర సత్యనారాయణకు వీరు రాసిన  'ప్రజాకవికి బహిరంగ లేఖ'  వీరి అత్యుత్తమ రచన. ఆలూరి బైరాగి రచనలు 'చీకటి నీడలు', 'నూతిలో గొంతుకలు'. నాక్కొంచెం నమ్మకమివ్వు అని పలికాడు. “జీవితం కరిగిపోయే మంచు / ఉన్నదాంట్లో నలుగురికి పంచు” అని అన్నది గోపాలచక్రవర్తి.
సినారె మంటలు మానవుడు, అక్షరాల గవాక్షారాలు, విశ్వంభర, ప్రపంచ పదులు, నాగార్జునసాగర్.మొదలైన గ్రంథాల ద్వారా అభ్యుదయ సాహిత్యం పరివ్యాప్తమైంది.

(మిగతా రేపు : తెలంగాణలో అభ్యుదయ కవిత్వోద్యమం)

Follow Us:
Download App:
  • android
  • ios