దేశభక్తికి పర్యాయపదం హనుమప్ప నాయకుడు

డా. తిరుమల కృష్ణదేశికాచార్యుల విరచిత  "హనుమప్ప నాయకుడు"  కావ్యం పైన సంబరాజు రవి ప్రకాశ రావు రాసిన వ్యాసం ఇక్కడ చదవండి:

Sambaraju Ravi Prakash Rao reviews Tirumala Desikacharyulu book Manumappa nayakudu

దేశభక్తి ఒక దివ్యానుభూతి.  అది కొందరిలో ఏ మూలో దాగి ఉండవచ్చును. అవసరమైనప్పుడు ఒక జలపాతంలా దూక వచ్చును. మరికొందరిలో నిత్య చైతన్య కెరటమై   ఎగసిపడుతూ ఉండవచ్చు. దేశ భక్తి లేని దేహం మాత్రం  ఉండదు . ఆ ఆరాధన రూపాలు విమర్శకులు చెప్పినట్లు బహుమూర్తులుగా ఉండవచ్చు. "నన్ను కన్న నా తల్లి రాయలసీమ రతనాల సీమ" అని గోరేటి వెంకన్న పాట విన్న రాయలసీమ పౌరునితో పాటు ఆ ప్రాంత పరిచయం ఉన్న ఏ సగటు మనిషి అయినా చలించకుండా ఉండగలడా? "పూసిన పున్నమి వెన్నెల మేన తెలంగాణ వీణ" అన్న అదే కవి మరో పాటను ఊపిరి బిగబట్టి , చెవులు కొట్టకుండా వినని తెలంగాణ వానితో పాటు తెలుగు వాడు ఉంటాడా?  దేశభక్తి సార్వజనీనం. అది ఒక సార్వ కాలిక సత్యం. నివురుగప్పిన నిప్పులా   ఎద ఎదలో ఉండి తీరుతుంది. ఎవరి హృదయ సంగీతంలోనైనా దేశభక్తి సరిగమలు తప్పకుండా  వినబడుతాయి. "ఏ దేశమేగినా ఎందు కాలిడినా" అన్న రాయప్రోలు వారి గేయం మనకు తెలియకుండానే రక్తంలో ఇంకిన సంగతిని ఈ సందర్భంగా ప్రత్యేకంగా  గుర్తు చేస్తున్నాను.  ఇక తెలంగాణ ఉద్యమ గీతాలు మన చుట్టూ దివ్యమైన వెలుగులను విరజిమ్ముతూ ఉండనే ఉన్నాయి.

ఇటీవల నేను "హనుమప్ప నాయకుడు"కావ్యం చదివాను. ఇది 1986లో ప్రథమ ముద్రణ పొందింది. యువభారతి వారిచే ప్రచురితం. కావ్య రచయిత తిరుమల కృష్ణదేశికాచార్యులు. ఈయన ప్రస్తుత నాగర్ కర్నూలు జిల్లాలోని బల్మూరు గ్రామ వాస్తవ్యులు. ఉద్యోగరీత్యా కెనడాలో స్థిరపడ్డారు.

ఈ కావ్యంలో అవసరమైన ప్రతి సందర్భంలో కవి దేశభక్తిని ప్రభోదించారు. ఈ కావ్యంలోని కథ తెలుగునాట ప్రసిద్ధమే. సురవరం ప్రతాపరెడ్డి రాసిన హైందవ ధర్మ వీరులు గ్రంథంలోని "సోమనాద్రి కథ" ను తీసుకుని కావ్యానికి అనుగుణంగా మార్పులు చేర్పులు చేసి కృష్ణ దేశికాచార్యులు ఈ కావ్యాన్ని రచించాడు. సురవరం వారి సోమనాద్రి కథకు సోమనాద్రి కథానాయకుడు. హనుమప్ప ఒక వీరుడు.  హనుమప్ప నాయకుడు కావ్యంలో బహుజనుడైన(బోయ) హనుమప్ప ప్రధాన కథానాయకుడు.  కథకు, కావ్యానికి మధ్య ఉన్న భేదాలను ఈ వ్యాసంలో ప్రస్తావించను. ఈ కావ్యంలో ఉన్న దేశభక్తిని మీకు తెలియజేయడమే ఈ వ్యాసపు ప్రధాన ఉద్దేశ్యం.

హనుమప్ప నాయకుడు  ఆరు ఆశ్వాసాల కావ్యం. మొదటి ఆశ్వాసంలో పెళ్లయి పదేళ్లు అయినా సంతానం కలగని బహుజనులు అయిన అన్నమ దంపతులకు భగవంతుడైన హనుమంతుడు వరం ఇవ్వడం, రెండవ ఆశ్వాసంలో హనుమ పుట్టి పెరగడం, రాజస్థానంలో ఉద్యోగంలో చేరమని తల్లిదండ్రులు సూచించడం, మూడవ ఆశ్వాసంలో సోమనాద్రి యుద్ధంలో సయ్యద్ ను ఓడించడం, హనుమప్ప తన అశ్వచాలన నైపుణ్యంతో రాజును మెప్పించి ఉద్యోగం పొందడం, వివిధ యుద్ధ రీతులలో శిక్షణ తీసుకుని యోధుడిగా రాటుతేలడం, నాలుగవ ఆశ్వాసంలో సయ్యద్ నిజాం రాజు తో కూడి సోమనాద్రి పైకి మళ్ళీ యుద్ధానికి రావడం, సోమనాద్రి అశ్వాన్ని  అపహరించడం, ఐదవ ఆశ్వాసంలో హనుమప్ప తన కుడి చేతిని నరికేసుకుని సోమనాద్రి అశ్వాన్ని తీసుకురావడం, రాజుచే దాన పత్రాన్ని స్వీకరించడం , ఆరవ ఆశ్వాసంలో యుద్ధంలో సోమనాద్రి అరివీర భయంకర విజృంభణకు తాళలేక శత్రువులు పారిపోయి కర్నూలు కోటలోకి ప్రవేశించడం, సోమనాద్రి వారిని వెంబడిస్తూ లోపలికి వెళ్ళిన తర్వాత కోట తలుపులు మూసి వేయడం, గద్వాల సైనికులు హనుమప్ప ఇచ్చిన స్ఫూర్తితో తలుపులను ధ్వంసం చేయడం , తమ రాజుకు అండగా నిలబడడం, తురుష్క రాజులు పంపిన మతసంధి ప్రతిపాదనకు సోమనాద్రి అంగీకారం మొదలైనవి ఈ కావ్య కథాంశాలుగా ఉన్నవి.

మొదటిసారి యుద్ధంలో ఘోర పరాజయాన్ని చవిచూసిన సర్దారు సయ్యద్ మళ్లీ రెండోసారి  నిజాం, కర్నూలు, గుత్తి, ఆదోని ,బళ్లారి, రాయచూర్  రాజులతో కలిసి సోమనాద్రి పై దండెత్తాడు. ఈ విషయాన్ని ముందే వేగుల ద్వారా పసిగట్టిన సోమనాద్రి తన సైన్యాధికారులను సమావేశపరిచి దేశభక్తి పూరిత ప్రసంగం చేశాడు. తన సైనికులలో జన్మభూమి పట్ల మమకారాన్ని రగిలించాడు. "మాతృభూమి రక్షణకు పాటుపడని వాడు ఈ భూమికి బరువు" అని తెలిపాడు. తన సైనికులలో పౌరుషాగ్నిని ప్రజ్వలింప చేసాడు.  కింది పద్యాన్ని చూడండి.

"మాతృభూ రక్షణంబున మందుడైన
యట్టి వాడె పో భారమీ యవని కరయ
కావు మృగములు, కావు నగములు, కావు
సింధువులు, కావు భారము సింధురములు"

జంతువులు, గుట్టలు, సముద్రాలు ,బరువుగా ఉండే ఏనుగులు ఈ భూమికి భారం కావు. తన జన్మభూమిని రక్షించుకోవడంలో సోమరి అయినవాడు ఈ భూమికి బరువు  అన్న పై పద్యార్థం మీకు అవగతమై ఉంటుంది.
ఇదే సందర్భంలోని మరో పద్యం చూడండి.

"స్వల్ప సౌఖ్యంబులాశించి జన్మధాత్రి
బరుల కర్పించి లభియించె పాయసాన్న
మనుచు దనివొందు తనయుల గనుటకంటె
తెనుగు తల్లికి గొడ్రాలి తనమె  మేలు!"

తాత్కాలిక సుఖాన్ని ఆశిస్తే దేశం పరుల పాలు కాక తప్పదు. మాతృదేశాన్ని ఇతరులకు అర్పించే సంతానం పుట్టుట కంటే సంతానం కలుగక పోవడమే మేలు అన్న సోమనాద్రి ఘాటు వ్యాఖ్యల సారం పై పద్యం ద్వారా మనకు అర్థమవుతుంది.

మొదటి రోజు యుద్ధం తర్వాత సోమనాద్రి అశ్వం అపహరణకు గురౌతుంది. తన కులీనాశ్వం  లేకుండా రెండవ రోజు చేసిన యుద్ధంలో సోమనాద్రి తన ప్రతాపాన్ని చూపలేకపోయాడు. ఎలాగోలా యుద్ధం ముగిసిందని అనిపించి గుడారానికి చేరుకున్నాడు. తన వీరులనందరినీ సమావేశపరిచి స్ఫూర్తిదాయక ప్రసంగం చేశాడు. ఆ సందర్భంలోని ఒక పద్యం చూడండి.

"వానిది భాగ్య వైభవము, వానిది సాత్విక జీవనంబు, స్థైర్యా నూనత శైశిరాల్పతుహినోపమమైన యనిత్యసౌఖ్యమాయా ధీనత నుజ్జగించి యతి ధీరత నెవ్వడు మాతృ దేశ సంరక్షానయ వృత్తికై తనువు, స్వాంతము నొడ్డి సదా శ్రమించనేర్చున్"

సుఖము ఒక తాత్కాలికమైన స్థితి. ఎప్పుడూ దాని వెనుక కష్టం పొంచి ఉండనే ఉంటుంది. శిశిర కాలంలోని మంచుబిందువుల లాగా సుఖం అనిత్యం. అశాశ్వతం. సుఖమనే మాయా పొరలో మానవుడు  చిక్కుకుపోకూడదు. కష్టమైనా ధీరత్వంతో మాతృదేశ సంరక్షణకు పాటుపడాలి. మనసును, శరీరాన్ని ఏకం చేసి పోరాటం చేయాలి. ఎలాంటి పరిస్థితులలో ధైర్యాన్ని కోల్పోకూడదు. ప్రతి క్షణం మనను మనం ప్రేరేపించుకోవాలి. అలాంటి వానిదే సార్థక జీవనము మరియు భాగ్య వైభవము అని పై పద్యార్థం. ఇది వ్యక్తిత్వ వికాస  పాఠంలా ఉంది కదా.  ఈ పద్యం చదివినప్పుడు తమ జీవితాలను త్యాగం చేసిన ఎందరో మన కళ్ళముందు కనబడతారు. కదలాడుతారు. ఒక శతాబ్దం వయసు కూడ దాటని మన స్వాతంత్ర పోరాట చరిత్ర గుర్తుకు వచ్చి దేహం ఒక అలౌకిక స్థితికి లోనవుతుంది.

'త్యాగ శౌర్యాభిరతి  చేత తరతరమ్ములకు ఖిలము గాని జాడల రచన చేయువాడే' మాతృ దేశభక్తుడని కవి అభిప్రాయం ఈ కావ్యం నిండా కనబడుతుంది. మాతృ దేశభక్తుడు శాశ్వత ధ్రువతారగా ప్రపంచచరిత్రలో వెలుగులను విరజిమ్ముతూనే ఉంటాడన్న భావాన్ని కలిగిన ఈ కింది పద్యం చూడండి.

"విశ్వజ్ఞేయంబుగ నే వీరుడు మాతృ ధ
రాశ్వ శ్రేయస సిద్ధికి బ్రతుకు వ్యయించున్
శాశ్వతముగ ధ్రువతారా సంకాశంబుగ
విశ్వ చరిత్రాంబరమున వెల్గునతండే

ఇక ఆరవ ఆశ్వాసంలోకి ప్రవేశిద్దాం.  సోమనాద్రి కొద్ది సైన్యంతో శత్రువులను తరుముతూ కర్నూలు దుర్గంలోకి ప్రవేశించాడు. ఇదే మంచి అదనుగా భావించిన శత్రు సైన్యం కోట తలుపులు మూసేసింది. దుర్గం లోపల సోమనాద్రి... బయట ఆయన సైన్యంలో అధిక భాగం.... ఎంత ప్రయత్నించినా కోట తలుపులను చేధించలేక పోయారు. వెనుకకు తిరిగిపోవాలనే ఆలోచన బీజ ప్రాయంగా వారిలో మొలకెత్త సాగింది.  దానిని గమనించిన హనుమప్ప 'నిరుపమాన ధృతి     సమంచితాత్ముడై' పలికిన మాటలు బేలగా ఉన్న సైన్యంలో ఉత్తేజాన్ని నింపాయి.  వారిలో పట్టుదలను ప్రేరేపించాయి. వారిని కార్యోన్ముఖులను చేశాయి.  ఆ సందర్భంలోని ఒక పద్యం చూడండి.

"పాటలీపురి ఆంధ్ర పాలనమ్మును నిల్పు
శాతకర్ణుల నాటి సంగ్రామ పాటవంబు
దిగ్దంతి ముఖములన్ దిగ్జయో దంతములు
విలిఖించు కాకతీంద్రుల నాటి విక్రమంబు
పంచపాండవులట్లు పరి పంథి మంథన
ప్రవణులౌ పల్నాటి వడికాండ్ర  ప్రాభవంబు
కుండలీంద్రములట్లు క్రూర యవనానీక
ముల మ్రింగు కృష్ణరాయల చమూ సాహసంబు
పెంపు గావింప నిత్యాభివృద్ధి గాంచి
సర్వ జగతికి నీర్ష్యాభిజనకమైన
తెనుగు విభవంబు గాపాడుకొనగలేని
అసువులేటికి యోచింపుడన్నలార!"

పై పద్యంలో గతవైభవ కీర్తన కనిపిస్తుంది. గత వైభవాన్ని గానం చేయడం కూడా దేశ భక్తే. శాతకర్ణుల యుద్ధ పాటవాన్ని ,కాకతీయుల విక్రమాన్ని, పల్నాటి వీరుల ధైర్య శౌర్యాలను, కృష్ణదేవరాయల సైన్య పోరాటశక్తిని తన సేనకు  గుర్తుచేశాడు హనుమప్ప. తద్వారా  కోట వెలుపల ఉన్న తన సైన్యంలో వీరత్వాన్ని  నింపి సమరాగ్నిని రగిలించాడు. విజయమో, వీరస్వర్గమో అని ప్రబోధించాడు. హనుమప్ప మాటలను విన్న సైన్యంలో ఉత్సాహం  ఉప్పెనలా ఉప్పొంగింది. కర్నూలు కోటగోడ ద్వారాలు బద్దలయ్యాయి. సోమనాద్రి పోరాటం విజయవంతంగా ముగిసింది.

మొత్తం మీద ఈ కావ్యంలో అటు సోమనాద్రి , ఇటు హనుమప్ప నాయకుని ముఖతః వెలువడ్డ దేశభక్తి ప్రపూరితమైన మాటలు ఎన్నటికైనా, ఎప్పటికైనా మరువరానివి, మరువలేనివి.  ప్రత్యేకించి బహుజన నాయకుడైన హనుమప్ప యొక్క  మూర్తిమత్వం, స్వామి  భక్తి, ఆచంద్రతారార్కంగా నిలిచే దేశభక్తి శ్లాఘనీయం. హనుమప్ప నాయకుడు చూపిన తెగువ, శౌర్యం సైన్యాన్ని ఏకతాటిపై నిలిపిన విధానం నిత్య స్మరణీయాలు. హనుమప్ప వంటి వీరుడు లేకుంటే సోమనాద్రికి పరాజయం తప్పక పోయేది. స్వామి భక్తికి పరాకాష్టగా తన చేతిని తానే నరుక్కున్న  సంఘటన చరిత్రపుటల్లో శాశ్వతంగా నిలిచిపోతుంది .  ఆంధ్ర రాజ్యం  కోసం నిత్యం పరితపించిన అపర దేశభక్తుడైన హనుమప్ప సమస్త తెలుగు లోకానికి పూజనీయుడు.

"ఆజాదీకా అమృతోత్సవ్"  సందర్భంగా హనుమప్పను మళ్లీ ఒకసారి అందరం గుర్తుచేసుకుందాం. ఆ బహుజన వీరునికి మన గుండెల్లో గూడు కట్టుకుందాం. తన రాజును గెలిపించడానికి తెగిన హనుమప్ప చేతి నుండి కారిన రక్తపు బొట్లు ఇంకిన ఈ నేలను ముద్దాడుదాం.  హైందవ ధర్మ వీరులు పుస్తకానికి పరిచయం రాసిన మల్లంపల్లి సోమశేఖర శర్మ "సోమనాద్రి కథ ఆంధ్రులకు ముదావహం. ఎందరికి  తెలియును ఈ వీరగాథ? "అని ప్రశ్నించాడు. సమయం, సందర్భం కలిసి వచ్చిన ఈ తరుణంలో "అందరికీ తెలియును" అని జవాబు చెప్పాలంటే ప్రతి ఒక్కరు  హనుమప్ప చరితాన్ని చదివి తీరాలి. ఆయన అకుంఠిత దేశభక్తిని ఆవాహన చేసుకోవాలి. ఆ వీరునికి జోహార్లు పలకాలి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios