శైలజామిత్ర తెలుగు కవిత: ఎడారి బతుకులు
ఎడారి జీవితాలన్నీ బహుమతి చిత్రాలుగానే ఉండిపోవాలి అంటూ శైలజామిత్ర తమ 'ఎడారి బతుకులు ' కవితలో ఏ విధంగా వ్యక్తీకరించారో చదవండి.
ఎలాగోలా బతకడం అంటే
ఎలాగంటే అలా బతికేయమని కాదు అర్ధం
చెమటోడిస్తేనే జీవితం అనుకున్నా
కంటి చెమ్మ పోవడం లేదే అనే ఒకే ఒక్క
బాధతో
ఎలాగంటే అలా బతికేస్తున్నారు
ఐదేళ్ల పాలనను
పరిచయం లేని నోటు కొనుక్కున్నప్పుడు
నిలువ నీడలేక రోడ్డుపక్క నిలుచున్నప్పుడు
చేస్తున్న కష్టమే కట్లపామై కాటేస్తున్నప్పుడు
ఎంత కాలమని
మెరమెచ్చు మాటల్ని వింటామనే
బాధతో చాలామంది ఎలాగంటే అలా
బతికేస్తున్నారు
రోగం, అప్పు రెండికి మందుల్లేవు
మందు లేకుంటే రోగం పోదు,
తీర్చేవాడు అప్పు చేయడు.
నా అన్నవారి దగ్గర కూడా నల్ల ముఖమే మిగిలినప్పుడు
ఇల్లుగాని ఇంటిలో పొయ్యి వెలగడానికి
తప్పనిసరై ఎలాగంటే అలా బతికేస్తున్నారు..
ఒకడు చైన్ లాగుతాడు
ఒకడు దొంగతనం చేస్తాడు..
మరొకడు మోసం చేస్తాడు
ఇంకొకడు అబద్ధపు మాటలు చెబుతాడు
ఇనప సంకెళ్ళకి, ఊచలకి అలవాటు పడి
జీవితమే చేయి జారింది అనిపించినప్పుడు
ఎలాగంటే అలా బతికేస్తున్నారు
వీరికి ఉదయాస్తమయాలతో సంబంధం లేదు
గుడిసె నుండి ప్లాట్ ఫామ్ వరకు దారిద్య రేఖల వెనుక
ప్రతి ఊహలో సుందరమైన భవిష్యత్ ఉన్నా
శాంతి లేని మనిషి బతుకు చంద్రుడు లేని
రాత్రే..
ఇది ప్రగతికి, ఆటంకానికీ,
ఆదర్శానికి, అవకాశవాదానికి మధ్య సంఘర్షణ
శ్రమ ఫలానికి, కుటిల నీతికీ మధ్య
ఒక సందిగ్ధపు తెర
సగం కాలిన శరీరాల పొగ తాలూకు వాసన...
ఎడారి బతుకుల్లో ఆక్రమించిన చీకటిని ఎవరు అర్థం చేసుకోరు
పుట్టి పెరిగిన ఇంట్లో పురుగుల్లా మిగిలిపోయాక
ఈ బతుకులకు అతుకు వేసినా వృధా అనిపించినప్పుడు
వెనక వేసుకునే నాలుగు రాళ్లు మూత్రపిండాలవైనప్పుడు
తన ఇంట్లో తనకి పర్యాయతత్వం
తన ఒంట్లో తనకి పరాయి రోగం వెంటాడుతుంటే
నైరాశ్యంతో అంతా ఎలాగంటే అలా బతికేస్తున్నారు
నిప్పంటుకుంటున్న జనారణ్యం ..
ఉన్నట్లుండి బడబాగ్ని రేపుతున్న సముద్రం
కూలిన నిర్మాణం , భూకంపం
ఇలా ఒక్కటేమిటి ? అనేక విషమ క్షణాలు
అయినా వీరి బతుకు విధానంపై చర్చ మిగిలే ఉంటుంది
ఆ ఇంటి గోడలకు కన్నీటి చారికలు ఉంటాయి
పరిచయం లేకున్నా అందరు చెప్పుకుంటారు
విచారానికే అలవాటు పడిన వీరు అనుభవాలుగా ఉండిపోతారు
అభద్రత బతికి ఉన్నప్పుడే కాదు
పోయాక కూడా ఉంటుంది..
ఉదాహరణల సోదాహరణంలో
ఆ పేర్లు వినిపిస్తూనే ఉంటాయి ..
ఎండిపోయిన ఆకుల్లా అటునిటు దొర్లుతూనే ఉంటాయి
ఆకాశం పైకప్పుగా విశ్వమంతా ఒకే ప్రదేశం
అనుకున్నా
బతుకు వాస్తవంలో ఇల్లు ఇటికలతోనే కట్టుకోవాలి
సగం కాలిన సమాధులైనా శరీరాలతోనే నిర్మించుకోవాలి
ఎడారి జీవితాలన్నీ బహుమతి చిత్రాలుగానే ఉండిపోవాలి