Asianet News TeluguAsianet News Telugu

ప్రవీణ్ సింగ్ చావడా కథ: ఇంటి వైపుకు ...

ప్రవీణ్ సింగ్ చావడా గుజరాతీలో రాసిన కథానికను రూప్ కుమార్ డబ్బీకర్ ఇంటి వైపుకు అనే పేరుతో తెలుగులోకి అనువదించారు. ఆ కథను మీ కోసం అందిస్తున్నాం.

Roop Kumar Dabbikar translates Praveen Singh's Gujarati short stor
Author
Hyderabad, First Published Oct 8, 2020, 9:51 AM IST

రంజిత్  జాగ్రత్తగా  ఇస్త్రీ   చేసిన బట్టలు వేసుకొని, "ఇప్పుడే వస్తాను" అంటూ  తండ్రికి చెప్పి బయల్దేరాడు. 
     
అతని  తండ్రి  భుజం మీద కండువా  వేసుకొని  బయట వాకిట్లో వాలు కుర్చీలో  రోజంతా కూర్చుంటాడు.  కోల్పోయిన  చూపు అతను కూర్చునే  తీరుకు  ఒక గాంభీర్యo  తెచ్చి పెట్టింది.   ఏదైనా వాహనo  శబ్దం విన్నా,  ఎవరి అడుగుల  చప్పుడు దగ్గరవుతున్నా వాటిని  ఊహించి నవ్వుకుంటాడు.   అడుగుల  చప్పుడు  దూరమవుతూ  ఆగిపోయినా,  అతని నవ్వు మాత్రం ఆగిపోదు.  ఆదివారం వస్తే చాలు  సమయాన్ని ఎలా గడపాలా అన్నది  రంజిత్ కు పెద్ద సమస్య . ఖాళీ సమయాన్ని ఎలా పూరించాలా అని ఆలోచిస్తూనే ఏదో ఒక వైపుకు  నడక ప్రారంభిస్తాడు. దారిలో  ఏది  ఎదురైనా వాటిని చూస్తూ ఆనందిస్తాడు.  అతని దృష్టి  చాలా పదునైనది.  ఏది  కనబడినా  అనుభవంలోకి తీసుకొని  సంతోషంగా జీవితానికి అన్వయిస్తాడు. 
     
ఎక్కడికెల్తావు బిడ్డా?  అని  అలాంటి  ప్రశ్నలు అతని తండ్రి  వేయడు. వాకిట్లో అలా  సోమరిగా  కూర్చోవడంలో, అతని కొడుకులా పిచ్చిగా తిరగడం ఈ రెండింటిలో ఎలాంటి తేడా లేదన్న విషయం  బహుశా  అతని తండ్రికి  తెలుసు.
     
ఆ  ఉదయం రంజిత్  ఒక కొత్త ఉత్సాహంతో నడకకు బయల్దేరాడు.  పాతకాలపు బ్లాక్ అండ్ వైట్  ఫొటోగ్రాఫ్ నుండి బయటికొచ్చిన వాడిలా,  స్కూల్  యూనిఫామ్,  ఖాకీ నిక్కర్  వేసుకొని  పలువరస బయటికి  కనబడే విధంగా నవ్వుతూ వుండే శ్రీ రాం  మూలే  గుర్తుకొచ్చాడు.  ఈ మధ్య కాలంలో అంత తరచుగా కలుసుకోవడం లేదు. కొన్ని సార్లయితే  ఆరు నెలలు దాటిపోతాయి.   ఒక్కొక్కసారి  సంవత్సరం కూడా అవుతుంది.  నది పక్కన  వున్న శ్రీ రాం  ఇంటి చుట్టూ వున్న పెరటి,  సజీవంగా నా జ్ఞాపకాల్లో కదలాడుతూ  వుంటుంది.  స్కూల్ కు  వెళ్తూ,  స్కూల్ బాగ్ మోసుకొని దారిలో  'సాల్వివాద్'  చేరగానే శ్రీ రాం  తల్లి  వాకిట్లో నిలబడి అతన్ని సాగనంపడానికి  సిద్ధంగా వుండేది.  రోజూ జరిగే  సంఘటనలను, సేకరించిన వార్తలను జాగ్రత్తగా మోసుకొచ్చి ఆ ఇంటితో పంచుకునే వాణ్ని.  శ్రీ రాo  మంచి నీళ్లకై  నన్ను లోపలికి తీసుకెళ్లేవాడు ;  అక్కణ్ణుంచి  పెరట్లోకి  వెళ్ళేవాళ్ళం.  తాను ఇప్పటికీ ఆ సంఘటనలను సజీవంగా చూస్తున్నట్లు అనుభూతి  చెందుతాడు.  శ్రీ రాం తల్లి,  చేతిలో గిన్నెనిండా బిస్కట్లు , లడ్డూలు , నువ్వుల ఉండలు పెట్టుకొని మా వైపుకి నడుచుకుంటూ వస్తుంది .
    
 ఎలాంటి ఆర్భాటం లేని టీ కొట్టు,  పొరుగున వున్న ఇంటివాళ్ల  ప్రవేశ ద్వారం వద్ద ఆ పిండి గిర్నీ,  ఇంకా  అలానే వున్నాయి.  ఆ ప్రాంతంలో పెద్దగా ఎలాంటి మార్పులు లేవు.  వాకిట్లోని అరుగు మీదకు  మెట్లు ఎక్కుతూ వుoటే తాను గతంలోకి ప్రవేశిస్తున్న అనుభూతి కలిగింది .  ఇనుపజాలి వున్న తలుపును మెల్లగా తట్టి  కాసేపు నిలబడ్డాను.  బరువుగా, అలసిపోయినట్లు నడుచుకుంటూ వచ్చి తలుపును లాగుతూ, తన షర్ట్  సర్దుకుంటూ తలుపు చువ్వల వెనక నుండి నా వైపు ఎవరా? అన్నట్లు ప్రశ్నార్థకంగా చూస్తున్న శ్రీ రాo ను చూస్తే ఏదో అనంతం లోకి తొంగి చూస్తున్నట్లనిపించింది.
      
 "ఎవరది భయ్?"
      
 "అలా దారినపోతున్న బాటసారిని.  కాసిన్ని  మంచినీళ్ళ కోసం ఇక్కడికి వచ్చాను." 
      
శ్రీ రాo గట్టిగా ఏమీ నవ్వలేదు.   "రండి" అని నిర్లక్ష్యంగా  చెప్పి వెనుదిరిగాడు . 
      
ఇదొక  కొత్త రకం పలకరింపు.  గతంలో ఎప్పుడు కలిసిన  ఒకరినొకరు  పలకరింపుల్లో  నిందించుకుంటూ వుండే వాళ్ళం .  "నీవు చాలా పెద్దవాడివై పోయావు.  నీ సమయం  చాలా విలువైనది",  అన్నాడు  శ్రీ రాo .  ఆఖరుకు,  ఇద్దరిలో ఎవరూ గొప్ప కాదు అన్న  నిర్ణయానికి వచ్చాక సంతృప్తి చెందాం. షాలిని బేన్  తెచ్చిన కప్పు టీ,  మా శాంతి  ఒప్పందానికి సాక్ష్యంగా  నిలిచింది.
      
 శ్రీ రాం మెట్ల దాకా నడిచి వెళ్ళాడు.  రంజిత్  ఇంకా హాల్ లోనే వుండి పోయాడు.  ఒకవేళ  ఆ పాత పద్దతిలోనే ఫిర్యాదులను నా పై వేస్తె మనః స్ఫూర్తిగా  అంగీకరించడానికి సిద్ధంగావున్నాను.  ఔను , నిశ్చయంగా ఈ రోజు నేను  ఒక ముఖ్యమైన వ్యక్తిగా ఎదిగిపోయాను.    టెక్స్ టైల్  మిల్లు మూతబడిన  తరువాత  టవర్ దగ్గరున్న బంధువుల ఒక హోటల్ లో క్యాష్  కౌంటర్  పైన కూర్చునేవాణ్ణి .  కాదా మరి , చెప్పండి. నాకైతే  అది మేనేజర్  పోస్ట్ కన్నా తక్కువేమి కాదు గదా? అతని  భార్య  తన బ్యాగ్  సర్దుకొని  తల్లిదండ్రుల ఇంటికి వెళ్ళినపుడు, నా విలువైన సమయాన్ని,  ఆడంబరమైన బహుమతిగా ఇవ్వడానికి  శ్రీ రాo ఇంటికి వెళ్తే,  ఆ పరిస్థితుల్లో అతని అవస్థను చూసి, ఈ వయసులో నేను ఒంటరిగా    వుండడం ఒక వరమనే అనిపించేది.   ఆ దూరపు బంధువు ఔదార్యం , ఇచ్చే జీతంతో ఏదో  అంబలి, జావా తింటూ వయసుడిగిన ముసలి తండ్రి, అతని మధ్య వయస్కుడైన  కొడుకు జీవితo సాఫీగా గడిచిపోతుంది. మహారాజా లాంటి  జీవితం కాకపోవచ్చు ,  దీన్నేమంటావ్  శ్రీ రాo ? 
      
"పైన మొదటి అంతస్తుకు పోయి వద్దాం " -  శ్రీ రాo చెప్పాడు . 
    
అతను  మెట్లెక్కుతుంటేనే తెలిసిపోయింది, హాలు గదిలో కూర్చోవడం లేదని.  ఈ గది ఖాళీగా ఏమీలేదు.  మెట్ల  పక్కనే , మాటున  ఒక  స్త్రీ ,  పురుషుడు ఇద్దరూ కుర్చీల్లో  ఒదిగి కూర్చొని వున్నారు.  వాళ్ళ శరీరంలోని  ఏ భాగంలో కూడా  చలనం కనబడటం లేదు.  ఆ మసక  వెలుతురులో కూడా వచ్చిన  సందర్శకుడికి  అటు వైపు దృష్టి  పడితే,  వారి చూపుల్లో ఒక రకమైన  ద్వేష  భావనని  లెక్కచేయకుండా దాటవేస్తే,  వారిద్దరూ  శిలా ప్రతిమల్లా కనబడతారు .
    
 శ్రీ రాo ఇంటికి వచ్చిన  విజిటర్స్ కు  ఈ దినం  ఆదివారంలా కనబడుతుంది.  ఆ  ఇద్దరు ముందుగానే వచ్చి వేచి వున్నారు.  రంజిత్ లో ఒక అపరాధ భావన కలిగింది -  అతిధులుగా వారికి ప్రధమ  హక్కువుంది.  అతని  విషాద గాథ తో  పాటు నిజానికి తాను వున్నపలానా  వెనుతిరిగిపోవాలి . 
   
 రంజిత్ చివరి మెట్టు దగ్గర ఆగిపోయాడు, " శ్రీ రాo,  ప్రత్యేకంగా  నాకెలాంటి పని లేదు.  కేవలం అలా నిన్ను కలిసి పోదామని వచ్చాను." 
     
 "నాక్కూడా ఏమి పనిలేదు." 
      
" ఆ మనుషులు --"
      
"వారి సంగతేమిటి?" 
      
 "అతిధులా  --" 
     
"అతిధులు కారు వారు .  "బావమరిది, నా 'సాలొ ' -- బావమరిది భార్యనేమని పిలుస్తారు ?" 
     
"సాలవేలి " 
     
 శ్రీ రాo  పళ్ళికిలిస్తూ,  పెదాలు కదపకుండా  "వేలి ,  వేలో,  4. 30  గంటలకు,  ఉదయం రైలు బండికి వచ్చినప్పటి నుంచి ఇలాగే కూర్చున్నారు.  అంత తెల్లవారు,  తలుపు చప్పుడైతే  మేము భయపడి పోయాము.  ఏ బందిపోటు దొంగలు దాడి చేశారో సమయం కానీ సమయంలో ?”  అని భావించాము . 
     
రంజిత్ కు, మొదటి అంతస్తులో ముందు పెద్ద బాల్కనీ లో వుండే  ఊయల గుర్తుకొచ్చింది.  శ్రీ రాo నాన్నగారు ధోతీ, బనియన్ వేసుకొని సాధారణంగా అక్కడే కూర్చునేవారు.  అమ్మగారు , దుమ్ము, ధూళి  దులుపుతూ,  తిరిగి వస్తువులను వాటి స్థానంలోనే అమర్చుతూ హడావుడి చేస్తూ వుండేది .  శ్రీ రాo ఊయల మీద కూర్చొని కళ్ళు మూసుకున్నాడు, వచ్చిన అతిధిని  గాలికి వదిలేసాడు.  కిటికీ పక్కన వున్న కుర్చీని  కదపకుండా  తనూ  అక్కడే కూర్చున్నాడు .  కిటికీ నుండి ఎండిపోయిన నది అడుగు భాగం స్పష్టంగా  కనబడుతుంది .
       
"ఇంకేమిటి కొత్త విషయాలు? "  శ్రీ రాo కళ్ళు తెరవకుండానే అడిగాడు . 
      
 "అంతా  బాగానే వుంది. మజామే.  నువ్వెలా వున్నావు ?" 
        
"అద్భుతంగా వున్నాను .  ఎవరికైనా ఏం  సమస్యలుంటాయి ?"
      
క్షణం క్రితం తను చెప్పిన దానికి ప్రతికూలం అన్నట్లు శ్రీ రాo తలను వూపుతూ  వున్నాడు.  కాసేపటి  తరువాత  లోపల గూడు కట్టుకొని,  దాగివున్న మాటలు ఒక్కసారిగా బయటికొచ్చాయి.  ఎదురుగా  వింటూవున్న వ్యక్తి మీద అకారణంగా కోపంతో మండిపోతున్నాడు .  "ఎలా అన్నీ బాగుంటాయి ! నువ్వనుకుంటుండవచ్చు -  ఏదైనా బావుంటుంది, ములియా కనబడటం లేదు కదాయని.  కనీసం  పిలవాలన్న ద్యాస కూడా లేదు,  కానీ ఈ ఇంటి పరిస్థితులను చూసావా!  నీకు మంచినీళ్లు కావాలా.. ? కాస్త టీ యైనా?" 
      
రంజిత్ వద్దన్నాడు.   శ్రీ రాo ఈ చర్యను తన పై ఒక సానుభూతిగా,  జాలిగా పరిగణించాడు.   తన జేబులో నుంచి ఒక ఉత్తరం తీసి  "దీనిని చదువు "  అన్నాడు . 
        
 " ఏమైనా గంభీరమైన విషయం వున్నదా, మూలే ?"
         
"అంతా  సర్వనాశనం.  ఇప్పుడేమి మిగల్లేదు.  ఇవి కోర్టు సమన్లు.  చదువు, సరదాగా వుంటుంది నీకు ."
     
అతని ముందుoచిన  దాన్ని చదవడానికి రంజిత్ ఏ మాత్రం ఆతురత  చూపలేదు.  కాగితాలతో తడబడుతూ, మూలే  కోర్టు కేసులో వున్న రహస్యం విప్పి చూపాడు.  అతని ఒక్కగానొక్క కొడుకు,  సునీల్,  ఇంట్లో పెంచిన విష సర్పంలా  .. ఫిర్యాది .    ప్రతివాది, నిందితుడు శ్రీరాo వసంతరావు మూలే.  వృత్తి : ప్రభుత్వ ఉద్యోగి,  శ్రీమతి షాలిని;   శ్రీ రాo, మొదటి ప్రతివాది భార్య.  నెలరోజుల క్రితం, సునీల్ అతని భార్య సామాన్లు సర్దుకొని అహ్మదాబాద్, మణినగర్ లో వున్న సునీల్ మామగారింటికి  బయల్దేరి వెళ్లారు.  తండ్రి పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ లో క్లర్క్.  అతను సంపాదించిన ఆస్తంతా వీరికి కట్టబెట్టాలి - అని ఆ కాగితాల్లోవుంది.  బ్యాంకుల్లో వున్న ఫిక్స్ డ్  డిపాజిట్లు  విత్ డ్రా  చేయాలి.  మూడంతస్తుల  భవంతిని ఖాళీ చేయాలి.  మూడు వేల ఐదు వందల రూపాయలకు, 1942 లో  ఆ ఇల్లు కట్టబడినది.  అందంగా చెక్కబడిన  ధారు స్తంభాల  మీద భవంతి నిలబడివుంది.  దీని కార్పెంటర్  అంబాలాల్  సుతార్  కొడుకు ఇప్పటికీ   సంవత్సరాలుగా మన్ననలు,  గౌరవం పొందుతూనే వున్నాడు.  మూలే కు,  వంశ పారంపర్యంగా వస్తున్న వాటిని కుర్రాడికివ్వడానికి  అభ్యంతరమేమి లేదు.  ముసలివాళ్లకు  ఎక్కడో ఓ చోట అద్దె కొంప దొరకాలి కదా!  ఎట్టకేలకు ఇవన్నీ చూడవలసి వచ్చింది.  ఇప్పుడివన్నీ  పనికిమాలిన విషయాలు.  యువరాజు గారు,  ముఖ్యంగా ఆ మహారాణి  గారికి  ఈ చిల్లులు పడి, పాతబడిన పడవలో వుండే ఉద్దేశం లేదు కదా?  ఇంత  పెద్ద పెరటి ఇప్పుడేం చేసుకుంటాం? దాగుడు మూతలు ఆడుకుంటామా?  ఆ మామగారు,  కొత్తగా దొరికిన  ఆ కొడుక్కి  తన వ్యాపార సంస్కృతీ , లెక్కపత్రాల సంస్కారం, కట్న కానుకల కింద ఇచ్చాడు.  ఈ స్థలం షాపింగ్  సెంటర్ కు చాలా అనువుగా వుంటది.   కనీసం ఓ పది అంతస్తుల అపార్ట్ మెంట్  కట్టుకోవడానికి కూడా పనికొస్తుంది  ...
      
అతను  చెప్పేదంతా వింటూనే రంజిత్  సంతోషంతో ఓ పేజీ దగ్గర ఆగిపోయాడు.  భవంతి నిర్మాణం మొదట్లో తీసిన చిత్రాల మాలిక గతంలోకి లాక్కెళ్ళాయి .   అప్పట్లో భవంతికి ముందు వెనకాల ఎలాంటి గృహ నిర్మాణాలు లేవు . జనం సందడి కూడా లేదు.  పచ్చని పొలాలు,  దట్టంగా పెరిగిన చెట్లు, అదే విధంగా కనువిందు చేస్తూ నెమళ్ళ గుంపులు. అంబాలాల్ సుతార్, చెవిలో వెనకాల పెన్సిల్ గుచ్చి పెట్టుకొని ఆ సుందర ప్రకృతి దృశ్యాలను చెక్కుతూ ప్రాణం పోస్తూ వుంటే,  జిజ్ఞాసతో  ఆ పక్షులు చూస్తూ వుండిపోయి ఉండవచ్చు.  నది పొంగి పొర్లి పోతూ వుండేదేమో?
      
నేను  తెలియాలని చెప్పాను -  ఐనా ఎందుకీ విషయాలన్నీ, ఉబుసుపోక  కబుర్లకు మంచి మేత ?" -  శ్రీరాo. 
     
రంజిత్ ఏమీ చెప్పలేదు.  స్నేహితుడికి సలహా ఇచ్చే స్థితిలో లేడు.  సునీల్ ను వెతికి పట్టుకొని, కాలర్ పట్టి లాగి,  అతని బాధ్యతలను గుర్తు చేయించాలి.  సుఖమయంగా ముగింపు తేవాలి.  ఈ ఆలోచనలు  అతన్ని వెంటాడుతున్నాయి. అతని కుటుంబ విషయాల్లో జోక్యం చేసుకునే హక్కు తనకు లేదు.  అలాగని ఇతర విషయాల్లో కూడా తాను కల్పించుకో కూడదు.  ఒక వేళ  సునీల్ మామగారు కానీ, మరే  బంధువు కానీ  అమాయకంగా లేదా ఏమీ పనిపాట లేక సమస్య పరిష్కారం  కోసం  మధ్యలో దూరి  స్థాయి బేధాలు ప్రశ్నించవచ్చు,  ఎలా సమస్యను  పరిష్కారం  జేస్తావు? అని అడగవచ్చు.
       
"నువ్వు,  షాలిని బాబీ  ఒంటరిగానే  వున్నారా ఇప్పుడు ?"
     
 "మాతో ఇల్లు ఖాళీ చేయించ వచ్చు.  ఇంటి బయట, వీధుల్లోకి  గెంటి పారవేయవచ్చు.  నువ్వేమో " మీరిద్దరే  వున్నారా ..?  అని  అడుగుతున్నావు.  
      
మాట్లాడేటప్పుడు ఎప్పుడూ  తరుచుగా ఇలాంటి తప్పుడు పనులు చేస్తూ వుంటాడు. గతంలోని  జ్ఞాపకాలు దృశ్యాలుగా కదలిపోతూవుంటే  పట్టుకొని నిలవరించవచ్చు.  కానీ భవిష్యత్తను దర్శించడమే చాలా కష్టం.  ఒక నిట్టూర్పు విడిచి  లేచి నిలబడ్డాను.  బయలుదేరడానికి సిద్దమవుతూ .
          
"కూర్చో", అన్నాడు శ్రీ రాం.
       
మెట్ల పక్కన గదిలో ముడుచుకు కూర్చున్న ఆ ఇద్దరు మనుషుల  గురించి విచారం పట్టుకుంది రంజిత్ కు . కుర్చీలో తిరిగి వెనక్కి వాలి అన్నాడు --"మరెవరి ద్వారానో  అంకుల్, ఆంటీ ఈ సంగతి వినివుండవచ్చు."
        
"ఏ అంకుల్ , ఏ ఆంటీ ?" 
       
 "అదే ఆ అతిధులు -" 
       
 " ఏ అతిధులు !? "
     
పదేపదే  అడగడం, తిరిగి అవే  సమాధానాలు రావడo జరుగుతున్నది.  అలసి పోయిన స్వరంతో రంజిత్ అన్నాడు - "నీ బావమరిది, అతని భార్య - ఎవరైతే కింద మెట్ల పక్కన కూర్చున్నారు. నేను వారి నుద్దేశించే మాట్లాడుతున్నాను.”
      
 శ్రీ రాo ఒక్కసారిగా పగలబడి నవ్వాడు . " ఆ నమూనాలను దగ్గర నుండి చూసావా?" 
     
రంజిత్ కు వారిని దగ్గరనుండి చూసే అవకాశం దొరకలేదు.  మేడ  పైకి హడావుడిగా  వచ్చేసాడు.  ఆ కొద్ధి  సమయంలో,  కుర్చీల్లో ముడుచుకు కూర్చున్న  వారిని స్పష్టంగా చూడటంగాని, మాట్లాడటంగాని జరగలేదు . 
          
శ్రీ రాo గట్టిగా నవ్వి చెప్పినపుడు రంజిత్ స్పష్టంగా వినలేదు.  తన స్నేహితుడి ముఖంలో వస్తున్న ఆ చిన్న మార్పులు  శ్రీరాo కు సంతోషాన్నిచ్చాయి.  తనకు పరిచయమున్న గొంతు విన్నందుకు, తాము చర్చించే విషయాలను పక్కన  పెట్టి ఆనందించసాగాడు.
      
పాలవాడు, న్యూస్ పేపర్  బాయ్  కంటే ముందే  ఈ అతిధులు వచ్చారు. అప్పటినుంచి అక్కడే అలా కుర్చీలకు అతుక్కు పోయారు.  ఉదయం పూట,  కాలకృత్యాలు తీర్చుకోవడానికైనా సమయ సమయానికి  మనుషులు కదలాల్సి  వుంటుంది.  కానీ ఈ తిరుగుబాటుదారులు అందుకు కూడా లేవలేదు.  ఇంట్లోకి అడుగుపెట్టినప్పటినుండి  కోపంతో వున్నారు. మంచి నీళ్లు తాగారు. టీ ఇచ్చినా తీసుకోలేదు. ఇక వారి తిట్లకు అంతులేదు. వారి గురించి పట్టించుకోకు. మన సంగతి వాళ్లకేం పట్టదు. 
‘మేము మీ బందువులంకాము. కేవలం రోడ్డు మీది గులకరాళ్ళం’ -  అంటూ మండి పడుతున్నారు.  
    
బంధువుల గురించి, వారి ప్రవర్తన గురించి శ్రీరామ్ వైఖరి.., “ప్రతి ఒక్కరూ ఎంతో కొంత...!"
        
బావమరిది వృత్తి సరిగ్గా సాగలేదు.  అతని తండ్రి  అతనికి  యదునందన్  అని పేరు పెట్టాడు. అంతటితో తన బాధ్యత పూర్తయ్యిందనుకొని వుండవచ్చు.  మన మహాశయుడు  ఆ పేరును కిరీటం లా ధరించి చాలా ఆటలే ఆడుకున్నాడు.  యాభై ఏళ్ళు వచ్చే వరకు  దొమ్మి తిరుగుళ్ళు తిరిగాడు. వయసు పెరిగితే  మాత్రం,  కోతి తన బుద్ధులను మార్చుకుంటుందా?
      
కారణం,  అతనికి నాటకాల పిచ్చి.  ఏదేదో సాధించాలనుకున్నాడు.  దేని మీద సరిగ్గా దృష్టి  పెట్టలేక పోయాడు.  తన లక్ష్య సాధన మీద గురిలేనివాడు.  సమయం దొరికిన ప్రతిసారి నాటకాలంటూ  తిరిగి ఏవో చిన్న చిన్న నౌకరు , వంటవాడు, దొంగ లాంటి  పాత్రలు వేసేవాడు.  అలా జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు.   అలా కూర్చొని నిరసన తెలపడానికి కారణం చాలా చిన్నది  -  అతనికి రెండు లక్షల రూపాయలు అప్పు కావాలి.  అదీ వడ్డీ లేకుండా.  అంతే కాదు తిరిగి ఇచ్చే ఒప్పందం , గ్యారంటీ ఏమీ వుండకూడదు.  ఎందుకంటే, వారికర్దమయ్యేది  కేవలం శ్రీరాo,  పబ్లిక్ వర్క్స్ డిపార్ట్ మెంట్  లో పని చేస్తున్నాడు.  దానితో అతని ఖజానా కరెన్సీ నోట్లతో నిండివుంటుందన్న అపోహ మనుషుల్లోవుంది. 
      
 "మరేం  చేస్తావు  శ్రీ రాo?" 
       
"విచారించకు.  డిమాండ్  తీవ్రత గంట గంటకు తగ్గుతూ పోతుంది.  నువ్వు తలుపు తట్టినపుడు అతని డిమాండ్ పదిహేనువేలకు తగ్గింది. ఒకటి రెండ్రోజులు ఆగుతారు .  లడ్డూ, దూద్ పాక్  లాంటి స్వీట్లు తింటారు . చివరికి బస్సు లేదా రైలు చార్జీలు తీసుకొని సంతోషంగా వెళ్ళిపోతారు. "నీకాలస్యం  అవుతుండొచ్చు."
     
చివరి మాట  పూర్తి కాగానే  శ్రీ రాం  లేచి నిలబడ్డాడు . 
      
 "నాన్నగారొక్కరే వున్నారు  ఇంటి దగ్గర " -- రంజిత్
      
 "ఎవరు కట్టి పడేసారు నిన్ను?" 
      
బాల్కనీ లోనే అతన్ని వదిలి  ముందుకు కదిలాను. బహుశా అతను  అక్కడే వుండి వుండొచ్చు . 
       
 "పాపం ఆ అమ్మాయి?"
        
తలుపు దగ్గర మెట్లకు కొన్ని అడుగుల దూరంలో వారు నిలిచిపోయారు . 
         
"ఏ అమ్మాయి ?"
       
మసక చీకట్లో నువ్వు సరిగ్గా గమనించలేకపోయావు.  ఈ జోకర్ తో వుండి  ఆమె తన సౌందర్యాన్ని వృధా చేసుకుంది.  కానీ ఒకప్పుడు దేవకన్యలా అద్భుతమైన అందంతో వుండేది.  పేరు కూడా అంతే  అందంగా వుండేది  -- రాజేశ్వరీ!  నీ కో రహస్యం చెప్పనా?"
      
 శ్రీరాo కన్నుగీటి , రంజిత్ చెవిలో మెల్లగా రహస్యo విప్పాడు - " నిజానికి , నాకు ఆమెతో.."
        
"ఆమెతో.. ఏమిటి ?" 
          
" ఇది .." అంటూ శ్రీ రాo  అతని చేతులు గట్టిగా కలిపి పట్టుకొని పెళ్లి సందర్భం లో జరిగే  'హస్త్ మిలాప్ '   కార్యక్రమాన్ని సూచించే  విధంగా సంజ్ఞ చూపాడు.
       
కానీ , స్వర్గస్తులైన నా తండ్రికి సిక్స్త్ సెన్స్ ,  అంతకు మించిన దూరదృష్టి  అమోఘంగా వుండేది.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ ప్రపోజల్ ను  అంగీకరించలేదు.  జరిగిందేదో మంచికే జరిగిందని ఇప్పుడు నేను  భావిస్తున్నాను. ఆమె ఇప్పుడు ఈ జోకర్ కు అంకితమై పోయిన భార్య .  తన భర్త ఒక అసాధారణమైన వ్యక్తి అన్న అపోహలొ వుంటుంది . లక్షల్లో ఒకడు,  పైసా సంపాదించలేడు కాబట్టి అతను ఒక సాధుజీవి.
       
 "ఆమె ఉద్దేశంలో అదేమీ తప్పు కాదు కదా"  అని రంజిత్ అన్నాడు. 
      
"ఆమెదేo తప్పుకాదు.  నా కొడుకుదేమి తప్పులేదు.  ఏదైనా తప్పువుంటే అది నాదే.  లోకంలో తప్పులు నేను మాత్రమే చేస్తాను.  రా! మెట్లు దిగి కిందికి పోదాం” - శ్రీ రాo  
      
తాను ఇంటికి వచ్చినపుడు జరగాల్సిన  ఫార్మాలిటీస్,   బయల్దేరేటప్పుడు మెట్లమీద జరిగాయి . "నువ్వు చాలా పెద్ద మనిషివై పోయావు ."
      
 "నిజమే కదా !"  రంజిత్ అన్నాడు .  
      
 "ఇక్కడికి  రానే రావు.  ముఖం కూడా చూపించవు." 
      
 "ఈ మొహానికి చాటు వుంటేనే  విలువ" అని మనసులో అనుకున్నాడు రంజిత్.  శ్రీరాo నిందారోపణలు చేస్తూనే  కిందికి దారి తీసాడు.  రంజిత్ నేర్పుగా తప్పించుకుంటూ అతన్ని అనుసరించాడు . 
       
నిర్జీవమైన శిలా ప్రతిమలను దాటుకుంటూ గేటు వరకు వచ్చాము. 
        
"ఏదో ఒక రోజు వెళ్లి మనం కూడా నాటకం చూద్దాం."
       
 "ఇంతకూ వీళ్ళ సంగతేమిటి ?"
       
ఎటూ పూర్తికాని ఈ విషయాలను తీసుకొని రంజిత్ కాస్త గందరగోళానికి గురయ్యాడు .  కుర్చీల్లో ముడుచుకు కూలబడిన  ఆ ఇద్దరి చూపుల్లో వున్న దైన్యతను అర్ధం చేసుకోగలుగుతున్నాడు.  శ్రీరాo  తన నిస్సహాయతను తెలిపే సైగలతో అతని ప్రశ్నలను గాలికొదిలేశాడు.  "రజియా - డాన్స్, మ్యూజిక్ అనేవి ఇష్టం లేవు ఇపుడు.  డామిట్."
          
అప్పుడే రంజిత్ కు ఇంటి వెనకాల వున్న గార్డెన్ లో పికాక్ - బ్లూ  చీర పై దృష్టి  పడింది.  స్నానం  చేసి వదిలేసినట్లున్న, వదులైన కేశాలతో వున్న ఆమె పువ్వులను తెంపుకుంటోంది.  కాలి వేళ్లపై నిలబడి పువ్వును అందుకునే ప్రయత్నం చేస్తూ తన దృష్టినంతా కేంద్రీకరించి  చేతి వేళ్ళ కొసలతో విచ్చుకున్న పువ్వును తాకుతోంది . గులాబీ , తెలుపు రంగుల  పూలతో నిండిన  ప్లేటు  ఆమె సుందరమైన మోమును పోలివుంది. ఎవ్వరినీ చూడలేదన్నట్లు, ఎవ్వరూ తనకు తెలియదన్నట్లు, తన ప్రపంచమే వేరుగా, సుతారంగా ఒక మొక్కనుంచి మరోమొక్క  వైపుకు కదులుతూ  ఎక్కడైతే వాళ్ళు నిలబడి వున్నారో అక్కడ వాకిలికి  దగ్గరగా వస్తోంది.
       
ఆమెను,  మోము నుండి కాలివేళ్ళ వరకు  చూసి శ్రీ రాo,  "తప్పకుండా  ఆమె సతీదేవికి మరో రూపం" అన్నాడు . 
    
 గట్టిగా  వినబడే విధంగా  చేసిన పొగడ్తను  అతని  భార్య  పట్టించుకోలేదు.  వచ్చిన అతిధిని చూసినప్పటికీ,  పలకరింపుగా ఒక్క మాట కూడా  మాట్లాడకుండా మొహం తిప్పేసుకుంది.  ఆమె చర్యతో  శ్రీరాoకు అవకాశం దొరికిందని మరింత సంబరపడిపోయాడు .  తలవూపుతూ "ఈ గెస్ట్  గంటసేపట్నుంచి ఇక్కడే వున్నా, ఎవ్వరూ అతనికి ఒక గ్లాసు  మంచినీళ్లు కూడా ఇవ్వలేదు . ఈ ఇంట్లో ఎవరికీ భయం లేకుండా ఐపోయింది, రజియా" అన్నాడు.
        
నవ్వులు, కూనిరాగాలు అలుముకున్నాయి .  తన భర్త వైపు చూడకుండానే షాలిని బేన్,  రంజిత్ ముందు ఆగి      "ఈ రోజు ఉదయం మిమ్ములను కలగన్నాను.  కలలో,  నిద్రనుండి లేపినందుకు చింతిస్తున్నాను."
        
తరువాత  ఆమె తలుపు వరకు వెళ్ళింది, అలాగే  ఎలా వచ్చిందో  అదే   వయ్యారంగా,  ఒక్క అడుగు కూడా వెనకా ముందు కాలేదు . 
      
 శ్రీ రాo నవ్వుకున్నాడు,  "ఈ కుటుంబంలోని వ్యక్తులకు  కాస్త పిచ్చి వుందని నీకనిపించదా రజియా?" 
         
రంజిత్  సమాధానమివ్వలేదు.  పెరట్లో వున్న ప్రతి చెట్టు వైపు నిశితంగా చూసాడు.  ప్రౌఢ స్త్రీ  స్వప్నం మీద  తేలియాడుతూ  ఇంటివైపుకు  బయల్దేరాడు .

గుజరాతి కథ : ' ఏక్ ఎవున్ ఘర్ మాలె ' 
(కథా సంపుటి నుండి సేకరణ)
మూల రచయిత : ప్రవీణ్ సింగ్  చావడా
ఆంగ్లానువాదం : మీరా దేశాయ్ 
తెలుగు అనువాదం : డా. రూప్ కుమార్ డబ్బీకార్

Follow Us:
Download App:
  • android
  • ios