మనిషి కోసం తపించే 'పూల పరిమళం'

కోడం కుమార స్వామి కవితా సంపుటి ' పూల పరిమళం ' పైన డా. సిద్దెంకి యాదగిరి చేసిన సమీక్ష ఇక్కడ చదవండి :

Review on Telugu Poetry book Poola Parimalam

వ్యవస్థ కల్లోలం అవుతున్నప్పుడు కలం ఖడ్గంతో అక్షరాలను జలిపిస్తూ వాస్తవాలను వ్యక్తీకరిస్తున్న కవి కోడం కుమార స్వామి. ఆలోచనలో అక్షరాల పదును,  ఆచరణలో ఖచ్చితత్వం, నిజాయితీ, నిబద్ధత  కోడం కుమారస్వామి కవిత్వంలో పుష్కలంగా ఉన్నవి.  జనగామ జిల్లాలో జన్మించి అక్కడి పరిస్థితులను ఆకలింపు చేసుకున్నాడు.  సమాజంలోని అవహేళనలను చూసి అక్షరాన్ని వింటి చేయగల నేర్పిరినం నేర్చుకున్నాడు.  సామాజిక దురాగతాలను పరిష్కరించే దిశగా సాహిత్య సృజన గావిస్తున్నాడు.   సామాజిక అంతరాలను రూపుమాపడానికి అహర్నిశలు కృషి చేస్తూ చైతన్యానాన్ని మేల్కొల్పడానికి అక్షరాలను వాడుకుంటుంన్నాడు కవి కోడం కుమార స్వామి.

తన 49 కవితలతో వర్తమాన కాలాన్ని దోసిట్లో పట్టి పూల పరిమళాలను మనకు అందిస్తున్నాడు కవి.  తన కలం బాధ్యతను  వివరిస్తూ -
"    కలంతో అక్షరాలను సాయుధీకరిస్తూ
     నిజమైనన దేశభక్తుల చరిత్రలను
     నవోదయం కోసం లిఖిస్తాను నేస్తం!
     'నేను' ధ్వంసమయ్యేవరకు చీకటిని చీల్చే
      కిరణాల కోసం రాస్తూనే ఉంటా
      కలం కలలకు  పహారాకాస్తూనే ఉంటా..!! "
ఈ కవిత చదివితే సమాజం పట్ల కవికి ఉన్న  బాధ్యత స్పష్టంగా అవగతమవుతుంది.  ఏమి రాయాలో ఏమి రాయకూడదో తెలిసిన కవి రాస్తే  నిఖార్సయిన తెలంగాణ జీవితం  నిలువెత్తుగా కనబడుతుంటది.  ఇంకా  అనాలోచిత మూఢనమ్మకాలను తొలగించే వరకు అక్షర యజ్ఞం చేస్తానని, ఆ పరంపరలో నిజాన్ని పలికే కలాలకు నేను పహారా కాస్తానని కవి అభయమిస్తున్నాడు.

దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన నేత జయప్రకాష్ నారాయణ అస్తమించినప్పుడు  ప్రజాకవి కాళోజి పుట్టుక నీది చావు నీది బతుకంతా దేశానిది అని మూడు పాదాలలో వారి జీవితాన్ని ఆవిష్కరించారు.   అట్లాగే కోడం కుమార్ మనిషి జీవితాన్ని మేల్కొల్పే పాటను అద్భుతంగా ప్రారంభిస్తాడు. ఉదయం ఒక జననం పొద్దస్తమానమే ఓ జీవితం అని జీవన సంఘర్షణను ఒకప్పటి నిర్బంధాన్ని వ్యక్తికరిస్తాడు.

మనిషి వస్తువు అవుతున్న వేళ మనిషి ప్రవర్తన అంతా వ్యాపారం అవుతున్న సమయంలో వాణిజ్యమే మనుషుల్ని ఏలుతున్న సందర్భంలో మానవ సంబంధాల కోసం తహతహలాడుతాడు. జీవితమంతా బిజీ అనే మాటను ఉదాహరిస్తూ  ' ఒక్క మాట ' అనే కవితలో       '  'దుఃఖం సముద్రమైనప్పుడు
ఓదార్పు కెరటమై మాట్లాడాలి
చిరుగాలి సంగీతమై మాట్లాడాలి
మనోక్షరమై మాట్లాడాలి '  అని మాట్లాడడం నేరం కాదు అంటూ సాంఘిక అసమానతల మీద మానవ సంబంధాల మీద తప్పకుండా మాట్లాడాలని పురమాయిస్తాడు.

తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ స్మృతిలో రాసిన ' జయహో శంకర ' కవితలో
' అసెంబ్లీలో దొంగాట ఆడుతున్న పందికొక్కలను
పలుగజీరడానికి కదులుతున్న పటాలం తెలంగాణ
జయహో శంకర
జయ జయ శంకరా ' అంటూ దొంగాటాడుతున్న కురచ రాజకీయ నాయకుల కుటిలత్వాన్ని, దగుల్బాజీతనాన్ని నిరసిస్తాడు.

కవి ఎన్నిక గాని ప్రజాప్రతినిధి. కవి ప్రజాపక్షం వహించాలంటాడు. కవికి రాజ్యంతో స్నేహమేమిటని,  ఎటు దిక్కు నిలబడతావని కవిని నిర్మొహమాటంగా ప్రశ్నిస్తాడు.  అప్పుల పాలై అలమటిస్తున్న నేత కుటుంబాలను చూసి చలించిపోతాడు.  నాగరికతకు బట్ట కట్టడం నేర్పిన నేతన్న ఇప్పుడు నానా యాతన పడుతున్న దీనస్థితిని చూసి బాధపడతాడు.    ఏదేమైనా మనమంతా నేతన్నను ప్రేమించాలని సందేశమైతాడు.
' బొంత పేగుల జీవన సమరంలో
మీ ఇంటికొస్తే చేనేత వస్త్రమై
ఆలింగనం చేసుకోండి
ఫినిక్స్ లా పుంజుకొని మన పరువు కాపాడుతాడు ' అని కలనేత కవిత ద్వారా వాస్తవాన్ని వివరిస్తాడు.

మనిషి మనుగడ అంతా తిరుగుబాటే అని ప్రకటించి, జీవితంలోని అన్ని కోణాలని,  అనేక విషయాలని చిక్కగా చక్కగా కవిత్వమై వ్యక్తీకరించిన ' పూల పరిమళం ' అందిస్తున్న మానవ సంబంధాలను మీరూ చదివి  ఆస్వాదించండి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios