రమాదేవి బాలబోయిన కవిత: పూలగోపురంలో గౌరమ్మ కొలువు

బతుకమ్మపై రమాదేవి బాలబోయిన కవిత రాశారు. పూలగోపురంలో గౌరమ్మ కొలువు అనే ఆ కవితను మీ కోసం అందిస్తున్నాం, చదవండి

Ramadevi Balaboina Telugu poem on Bathukamma in Telugu literature

మేదరిశిబ్బిలో గుమ్మడాకు చాపేసి
తంగేడు పూల మేడలు గట్టంగ
రుద్రాక్ష,గునుగూ,బంతీ చేమంతులు
కట్లాయి,గోరింట,మందార,గులాబీలు
గోడవైవెలిసిన కోటగోడలవగా
చిక్కుడాకుసింహాసనాన చిరునవ్వు పసుపుగౌరు

పసిడివన్నెల కుంకుమచీరగట్టి కొలువవగా
అవ్వొండీన సద్దులను ఆరగింపుజేసి
పట్టుచీరగట్టి,పసిడినగలేసుకున్న
అతివలంత  సంబరాన్ని అంబరమంటించగ
యేటిగట్టున చేరి వావీవరులఆనందకేళీలో
రంగులసీతాకోకచిలుకల గుంపులయ్యే తరుణం

ఆకాశాన తారలు కొలను కొప్పున జేరి
ఆడిపాడిన దేవతామూర్తుల సౌందర్యం
ప్రతిఇంటీ ఆడబిడ్డ ఊరివారికి బంధువయ్యేవేళ
వరుసలతో కలగలిసిన మాటాముచ్చట్ల
పసుపూకుంకుమల ఇచ్చుపుచ్చుకునువాయినమపుడు

తనివితీరని కనులపంటగా
బంగారుబతుకమ్మను కొలిచేటి పండుగిది
పుట్టిల్లుజేరిన ఆడబిడ్డల ఆనందం
పలకరింపుల పులకరింపుల ఆనందనందనవనం
కోరి కోలిచిన వారికి కొంగుబంగారం
పూలగోపురంలో కొలువైన గౌరమ్మ సంబరం

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios