రామా చంద్రమౌళి కవిత: బరిబాత పిల్లలు
తెలుగు సాహిత్యంలో రామా చంద్రమౌళి లబ్ధప్రతిష్టులు. కవిత్వంలోనూ కథానికా ప్రక్రియలోనూ ఆయనది అందెవేసిన చేయి. ఆయన రాసిన బరిబాత పిల్లలు కవితను ఇక్కడు ఇస్తున్నాం. చదంవడి.
సముద్రం ఎక్కడికీ పోదు.. అక్కడే ఉంటుంది
నదులుగానీ, మనుషులుగానీ.. వాళ్ళే వెళ్ళాలి కడలి దగ్గరికి
వెళ్ళనినాడు అవేవైనా స్తంభించి పోతాయి
సముద్రమంటేనే ఒక నిరంతర అంతఃసంఘర్షణ, ఒక నిశ్శబ్ద కల్లోలం
సముద్ర సందర్శనమంటే
మనిషి తనలోకి తాను తొంగి చూచుకొని భయపడ్డం
తననుతాను అన్వేషించుకుని మరమ్మత్తు చేసుకోవడం
లోలోపలికి ప్రయాణిస్తూ ప్రయణిస్తూ
దారి తెలియని దారుల్లో కాటకల్సిపోవడం
చివరికి ఒక తుఫానుగా మారి విముక్తమైఫోవడం
అంతిమంగా ..అలసిపోకుండా తలలను తీరానికి బాదుకుంటూన్న
ఆగిపోని కెరటాలను చూస్తూ చూస్తూ
జీవితాన్ని ఒక ' రహస్యంగా ' తెలుసుకోవడం –
ఒక్క సముద్రమే కాదు
భూమైనా, గాలయినా, నిప్పయినా
చివరికి ఆకాశమైనా అంతే.. ఏవీ ఎక్కడికీ పోవు
అన్నీ అక్కడే ఉంటాయి.. వ్యవస్థలై
తల్లిలా బాహువులను చాచి మనుషులను పిలుస్తూ ,
ఐతే గమనించం మనం ఏది చరమో ఏది అచరమో -
ఊర్కే.. బరిబాత పిల్లలు కొందరు సముద్రం ఒడ్డున చేరి
బోసిపాదాలను తడి ఇసుకలోకి చొప్పించి
తపస్సు చేస్తున్నట్టు ఇసుకగూళ్ళను కడ్తారు
పసిడి చేతులతో ఇసుకను మెత్తీ మెత్తీ ఒక ఆకారాన్నిచ్చి
చివరికి పదిలంగా గూడు కూలిపోకుండా పాదాన్ని ఉపసంహరించుకుంటారు
తర్వాత తలెత్తి.. ఠీవిగా నిలబడ్డ గూడునూ
ఎదుట గర్జించే సముద్రాన్నీ తీక్షణంగా చూచీ చూచీ
తనే నిర్మించిన తన ఇసుకగూడును కాలితో తన్ని కూల్చి
జీవిత వినిర్మాణ రహస్యాన్ని కూడా తెలుసుకుంటూ
పిల్లలు నిష్క్రమిస్తారు
వెంటనే వాళ్ళ పాదముద్రలనూ, కూలిన ఇసుకగూళ్ళనూ
కల్లోల కెరటాలు ధ్వంసిస్తాయి
రహస్యమేదైనా అంతే.. ఎవరికివారే స్వయంగా తెలుసుకోవాలి -