Asianet News TeluguAsianet News Telugu

ఆర్. నవజీవన్ రెడ్డి కథ : మిణుగురులు

చీకటైన తన జీవితాన్ని మిణుగురులా మార్చుకొని కాంతిని పంచిన ధైర్యశాలి కథ ' మిణుగురులు '  ను బెంగళూరు నుండి ఆర్. నవజీవన్ రెడ్డి  రాసారు.   ఆ కథ ఇక్కడ చదవండి:

R. Navajeevan Reddy's story: Minuguru..ISR
Author
First Published Jan 27, 2024, 11:55 AM IST

తెల్లవారగానే నిద్ర లేచి కాఫీ తాగి అలా బయట గాలి కోసం వరండాలో తిరుగుతున్నాను.  కానీ మెదడు నిండా   ఆలోచనల వేడి.   జీవితంలో ఏదైనా సాధించాలి.  అవును సాధించాలి.  అవే ఆలోచనలు.   దానికి కారణం మా నాన్న. దేశం కోసం పోరాడుతూ యుద్ధంలో ప్రాణాలు వదిలారు ఆయన.

మా నాన్న ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తూనే ఖాళీ సమయం దొరికినప్పుడు మాకు ఉత్తరాలు రాసేవారు.  అమ్మ వాటిని కోహినూర్ వజ్రం అంత భద్రంగా దాచుకునేది. నాన్న గుర్తొచ్చినప్పుడల్లా ఆ ఉత్తరాలను చదువుతూ కన్నీళ్ల కల్లోల సముద్రం అయ్యేది. మేము కనపడగానే కన్నీళ్ళని దాచేసేది ఆ కన్నీళ్లు మాకు కనపడకూడదని.

అప్పుడు నా వయసు నాలుగు సంవత్సరాలు.  అంత తెలిసేది కాదు. ఒకనాడు ఒక ఉత్తరం వచ్చింది. ఆతర్వాత ఉత్తరాలు రావడం ఆగిపోయాయి. నాన్న వీరమరణం పొందారని చెప్పారు. అన్నీ ప్రభుత్వ లాంఛనాలతో జరిగిపోయాయి. అమ్మ తన కన్నీళ్ళని అలానే దాచేసుకుంది నాన్నతో గడిపిన క్షణాలను నెమరేసుకుంటూ.

ఇప్పుడు నా వయస్సు 23 సంవత్సరాలు. చదువుకు ఏలోటూ రానివ్వకుండా అమ్మ నన్ను తన కష్టంతో చదివించింది. ఇవన్నీ తలచుకుంటూ జీవితంలో ఏదైనా సాధించాలి, దేశం కోసం ఏదైనా చెయ్యాలి అన్న తపన నాలో బాగా పాతుకుపోయింది. బహుశా నాన్న ప్రేరణ అయిండొచ్చు. ఇంతలో నా స్నేహితురాలు రేవతి తన కారు లో హార్న్ వేసుకుంటూ మా  ఇంటిముందుకు వచ్చింది. ఆ శబ్దంతో ఒక్కసారిగా  నా లోకం నుంచి బయటకు వచ్చాను.
వాళ్ళ అన్నయ్య పెళ్లి పనుల్లో అది మునిగి తేలుతుంది.  అంత సందడిలోను అది నాకోసం వచ్చింది. వెంటనే అమ్మకు వెళ్ళొస్తానని చెప్పి  అప్పటికే సర్దిపెట్టుకున్న నా బట్టల బ్యాగ్ తో వెళ్లి కారు ఎక్కేసాను.

నా స్నేహితురాలు కారు బాగా నడుపుతుంది.   కానీ ఆరోజు అనుకోకుండా రాంగ్ రూట్ లో ఒక ట్రక్ వచ్చి  ఆక్సిడెంట్ అయ్యింది. రక్తం పారుతుంది , కళ్ళు బైర్లు కమ్మాయి.  నేను కళ్ళు తెరిచి చూసేసరికి ఆసుపత్రిలో ఉన్నాను. ఒళ్ళంతా ఒకటే నొప్పి. నా స్నేహితురాలి పరిస్థితి ఏంటి అని అడిగాను. తను బాగానే వుంది పక్క వార్డ్ లో అని చెప్పారు.

నా స్నేహితురాలి కుటుంబ సభ్యులు అందరు  పెళ్లి కూడా రద్దు చేసుకుని అక్కడికి వచ్చారు. ఇంతలో అమ్మ వచ్చి పక్కన కూర్చొని ఏడుస్తూ తల పట్టుకు కూర్చింది.  ' ఏమీ అవలేదు కదమ్మా, నేను బాగానే ఉన్నాను '  అని చెప్పాను. ఇంతలో డాక్టర్స్ వచ్చి విసిటింగ్ హవర్స్ అయిపోయాయి అని అమ్మను బయటకి పంపేశారు. నేను ఉన్నది ఐసీయూలో.

అంతలా ఏమీ గాయాలు అవలేదు కదా అని అనుకుంటూనే కాస్త నొప్పిగా ఉన్నా, కాళ్ళు కదపాలని చూసాను. మోకాలి కింది భాగం మాత్రం కదలట్లేదు. ఇంతలో డాక్టర్స్ వచ్చి ఏవో ఇంజెక్షన్స్ వేసి వెళ్లిపోయారు. నా స్నేహితురాలు పక్క వార్డ్ లో ఉందని వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ అక్కడకి వెళ్లారు. తను స్పృహలోకి వచ్చింది అని విని నేను సంతోషిస్తూ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం నన్ను చూసి ఏడవడం మొదలెట్టారు.

కొద్దిసేపటి తర్వాత డాక్టర్స్ వచ్చి ' మమ్మల్ని క్షమించండి. మీ కాళ్ళను రెండిటిని తొలగించాల్సి వచ్చింది' అని చెప్పారు. అంతే ఒక్కసారిగా కన్నీళ్లు కట్టలు తెంచుకున్నాయి నాకు. కదల్లేని పరిస్థితి అది. గట్టిగా ఏడ్చేసా.  అమ్మ మరియు నా స్నేహితురాలు రేవతి, వారి కుటుంబం మొత్తం అక్కడికి వచ్చి నన్ను ఓదార్చేందుకు చూసారు. కానీ నా కన్నీళ్లు ఆగలేదు.

అలా ఒక నెల హాస్పిటల్ లోనే ఉండిపోయాను. రేవతి కొద్దిగా నడుస్తుంది అని విని సంతోషపడ్డాను. రేవతి వాళ్ళ అన్నయ్య తరుణ్ ఆ సమయంలో నాకు అన్నీ తానే అయ్యి చూసుకున్నాడు.  తన చెల్లి వల్లనే ఇలా అయ్యిందని బాధపడ్డాడు.  రోజూ ఆత్మవిశ్వాసం నింపుతూ, ఇలా ఉండాలి అలా ఉండాలి అంటూ నవ్విస్తూ మళ్ళీ జీవితంలో కొత్త ఆశలను చిగురింపజేసాడు.

రేవతి నెమ్మదిగా నడుస్తూ నన్ను చూడ్డానికి వచ్చేది. తను చాలా బాధపడ్డది.  నేను నిన్ను పిలవకుండా ఉంటే పెళ్ళికి సరిపోయేది అంటూ చెబుతూ ఏడ్చేది. అయినా తరుణ్ నాలో నింపిన ధైర్యం నన్ను జీవితంలో అన్నీ సానుకూలంగా తీసుకునేలా మార్చింది అనే చెప్పాలి.

కొన్ని నెలల తర్వాత డాక్టర్స్ కృత్రిమ కాలును అమరుస్తాము అని చెప్పి నన్ను ఒప్పించి వెళ్లారు . కృత్రిమ కాలుతో లేచి నడవాలని, కొద్దిగా నొప్పి ఉంటుంది అని చెప్పి నెమ్మదిగా నడిపించడం మొదలుపెట్టారు. తరుణ్ నా పక్కనే ఉండి నడిపిస్తూ, నవ్విస్తూ తనే నా జీవితం అనేలా అయిపోయాడు.  

నెమ్మదిగా నడవడం మొదలుపెట్టాను. అక్కడితో ఆగిపోతే ఎలా అని, జీవితంలో ఏదో సాధించాలి అన్న తపన మళ్ళీ ఊపిరి పోసుకుంది. అప్పుడే భారత్ నుంచి ప్రోస్తెటిక్ లెగ్స్ వున్నవాళ్లు పాల్గొనే పరుగు పందెం జరుగుతుందని విన్నాను. ఎలాగైనా అందులో పాల్గొనాలని నిశ్చయించుకున్నాను. అమ్మకి చెప్పి ఒప్పించాను. ఇక తరుణ్ అయితే నా దగ్గరే ఉండి నన్ను నడిపించడమే కాదు. తానే కోచ్ అవతారమెత్తి మరీ పరుగులు తీయించాడు నాతో.

కాళ్ళు లేకపోతే నేమి. పట్టుదల ఉంది కదా. లక్ష్యం ఉంది కదా.  కాళ్ళు లేకపోతేనేమి.  దృఢ సంకల్పం ఉంది కదా. కష్టానికి ఎదురెళ్ళే తత్త్వం ఉంది కదా - ఇలా నాలో ఉత్తేజాన్ని నింపాడు.

అలా మొదలైన పరుగు పందెం భారత దేశానికి ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించే వరకు వచ్చింది.  ఈ రోజు మా నాన్న ఏ లోకాన వున్నా గర్విస్తుంటాడు అని సంతోషపడ్డాను. నా కష్టాన్ని చూసి బాధపడ్డ అమ్మ ఈరోజు మళ్ళీ నవ్వుతూ భరతమాతకు జై అంటున్నది. ఇక నాతో పాటు నన్ను పరిగెత్తించిన తరుణ్ నా జీవితంలో కూడా భాగమయ్యాడు. ఇప్పుడు నాకు ఇద్దరు పిల్లలు. చాలా సంతోషకరమైన జీవితం నా సొంతమైంది.

ఇక్కడితో ఆగిపోతే ఎలా అని అందరికి నా జీవితం గురుంచి తెలియాలి అని, జీవితంలో దెబ్బ తిన్న తరువాత నిలుచుని పోరాడితే విజయం వరిస్తుందని నా పేరు మీద ఒక పుస్తకం విడుదల చేసాను. అంతే కాదండోయ్ !  పరుగు పందేలలో నాపరుగు ఆపలేదు. పరిగెడుతూనే ఉన్నాను. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ "భారతావని". నాన్న పెట్టిన పేరు అది.
 

Follow Us:
Download App:
  • android
  • ios