పురిమళ్ల సునంద కథ: లోకం తీరు ఇదేనేమో.

లోకులకన్న కాకులే నయం అంటున్న వురిమళ్ల సునంద కథ "లోకం తీరు ఇదేనేమో" ఇక్కడ చదవండి.

Purimalla Sunanda Telugu short story, telugu literature

"ఏమి! రామాచారీ! ఎన్ని రోజులైంది? చిన్న దానికి వెండితో కక్కుటుంగరం చేయమని పనులు లేవు లేవని అంగలారుస్తారు తీరా పనిస్తే 'దాహమైనప్పుడే బాయి తవ్వుకున్నట్ఠు' పీకల మీద కూసుంటే తప్ప చేయరు.  ఎం మనిషివయ్యా! "

సంగయ్య మాటలకు 'దెబ్బ తిన్న పక్షిలా' విలవిలలాడుతున్న మనసును  చిక్కబట్ఠుకుని చేతులు నలుపుకుంటూ  "ఎంత మాట సంగయ్య గారూ! ఇంకెవరిదైనా వస్తుందేమోనని ఎదురు చూస్తున్నా! "  అన్నాడు రామాచారి.

"ఆ నీ పిచ్చి గానీ!  ఏదో ఒక పనిప్పిస్తే  మంచితనంగా చేసుకోక.. ఇలాంటి  జూటా మాటలు మాట్లాడి పరువు తీసుకుంటావు"  విసురుగా లేచి "రేపు సాయంత్రానికి చేసివ్వక పోతే బాగుండదు. జీతగాడ్ని పంపిస్తా!" అని వెళ్ళిపోయాడు.

వాన వెలిసినట్లయింది రామాచారికి.

అదే బంగారు వస్తువైతే పదో పరకో  మిగిలేది.  ఈ వెండి ముక్క కొంటేనే వంద, రెండొందల కంటే ఎక్కువ కాదు.. దాన్ని కరగ బోసి చేయడానికి ఇంకొంచెం వెండి కావాలి.. అదెక్కడ నుంచి తేవాలి.  పనుల్లేక కొడుకులు ఇద్దరు  పనిముట్లను మూటగట్టి  తాతల నాటి భోషాణంలో వేశారు. ఒకడు మెకానిక్ షెడ్ లో   మరొకడు, బట్టల షాప్ లో కుదిరి.. భార్యా పిల్లలతో బతుకులను భారంగా వెళ్ళ దీస్తున్నరు. తనేమో వారసత్వ వృత్తిని వదులుకోలేక  అంత కంటే వేరే పనిచేసే సత్తువ , ఓపిక లేక ... ఇద్దరి బదులు ఒక్కరికే వచ్చిన వృద్ధాప్య పింఛనుతో.. రోగాలు రొప్పుల ఖర్చులు పోను, అడపాదడపా ఇలాంటి పనులొస్తే చేసుకుంటూ గుట్టుగా బతుకీడుస్తున్నాడు.

ఇప్పుడు ఆ ఉంగరం ఎట్లా చేయాలి అదనపు వెండి కావాలి ఎలా.. ఆలోచిస్తున్న  ‌.భర్త మనసును గ్రహించిన  భార్య "ఇవిగోండి''  కాలి వేలి నుంచి అతికష్టం మీద  అరిగిపోయిన మెట్టెలు  తీసి భర్త చేతుల్లో పెడుతుంటే.. కళ్ళలో నీళ్ళు చిమ్మాయి రామాచారికి. అన్ని సిద్ధం చేసి సాగతీసి  ఉంగరం చేశాడు.

                                 *****

ఇంతకు ముందు ఊళ్ళో , వెండి బంగారం పని చేసే వారంటే ఎంతో గౌరవం ఉండేది.  పాలూ పెరుగు, కూరగాయలు పండ్లు , కందులు పెసలు, శనక్కాయలు ఇలా ఏవి పండినా అభిమానంతో పంపేవారు.  ఘడియ సేపు ఇరాం ఉండేది కాదు.  చదువుకుంటనన్న  కొడుకుల ఉత్సాహం మీద నీళ్ళు జల్లి పనికి ఒంగ బెట్టాడు.  ఇంత కంటే ఎక్కువ సదువులతో సంపాదిస్తరా అనుకునేటోడు.  చేతి నిండా పని.   వచ్చే పోయే వారితో ఇల్లు ఎప్పుడూ కళకళలాడుతూ ఉండేది.   పిల్లలిద్దరి పెండ్లిండ్లు ఉన్నంతలో ఘనంగా చేసిండు.  మనవడు మనవరాళ్ళతో  అంతా సందడే సందడి...

                                      *****

అలాంటిది కొడుకుల పిల్లలు ఎదగడానికి వచ్చేసరికి కాలమే మారింది.  కాదు కాదు ప్రపంచమే మారిపోయింది.  కొత్త కొత్త పేర్లతో వెలసిన బంగారు వెండి షాపులు తమ పొట్ట మీద కొట్టసాగాయి. బతకడం దిన దిన గండం  అయ్యింది.  కొడుకులిద్దరూ బతుకు తెరువు కోసం ఊరు విడిచి పట్నం వెళ్ళారు.
ఉన్న ఊరు కన్నతల్లిలాంటిదని మహా ప్రేమ.  అందుకే రామాచారి భార్య జానకిని  చావైనా బతుకైనా ఇక్కడే అని ఒప్పించాడు. గుట్టుగా సంసారం నడుపుకొస్తున్నాడు.

పైసల్లేవనీ రోగాలు రాకుండా ఉండవు కదా.. వచ్చిన పెన్షన్ మందు మాకులకే అయిపోతుంటే... పిడికెడు మెతుకుల కోసం అల్లాడి పోతున్నారు. రోజు రోజుకు కిరాణా దుకాణం లో అప్పు హనుమంతుడిలా పెరిగిపోతోంది.  ఇక ఎలా బతకాలో ..." బియ్యం నిండుకున్నాయండీ ! " జానకి మాటలకు.. మన భాష ఎంత గొప్పదో.  అయిపోయాయి అనే పదం బదులు నిండుకున్నాయని అనుకోవడం.. పేలవంగా నవ్వుకున్నాడు.

                                  *****

పొద్దున్నే కిరాణం కొట్టు పుల్లయ్య, పాల వాడిక లింగయ్య, మందుల షాపు వాడు మూకుమ్మడిగా దాడి చేశారు.. అప్పు కట్ఠమనీ.  తలా ఓ మాట అన్నారు.  వాళ్ళందరి ముందు దోషిగా నిలబడే సరికే  చాలా అవమానం అనిపించింది రామాచారికి.

అందరి చేతులు పట్టుకుని "చేతులు కావు ఇవి కాళ్ళను కోండి"  తప్పకుండా
రెండు రోజుల్లో ఇస్తానని,  అప్పు తీరుస్తానని బతిమిలాడి పంపించాడు. ఊరిలో కొందరైతే తలో మాట అన్నారు.  అప్పు తీర్చలేని సత్తా లేని వాడు అప్పెందుకు చెయ్యాలి.  'కొడుకుల దగ్గరకు వెళ్ళి కలోగంజో తాగి ఉండక ఎంత బాగా అప్పులు చేశాడు రామాచారి' ఇలా తలో మాట అన్నారు.

                                 *****

ఆ రాత్రి ఇద్దరూ ఒకరినొకరు ఓదార్చుకున్నారు. గతాన్ని గుర్తు చేసుకున్నారు.  చచ్చిపోదామా అనుకున్నారు. "ఛీ! ఇంత బతుకు బతికి ఇంటి వెనకాల పడి చచ్చినట్టు" చచ్చి పోవడమా.. అస్సలు వద్దు.  దేవుడిచ్చిన ఈ జీవిని దేవుడే స్వయంగా తీసుకుపోవాలి" అనుకుంటూ ఒకరి కొకరు ధైర్యం చెప్పుకున్నారు.  బాగా ఆలోచించి ఓ నిర్ణయానికి వచ్చారు.  పెద్ద అట్ట ముక్క మీద "మా కోసం వెతక్కండీ! ఇంటిని సామానును వేళం వేయిస్తే ఇప్పుడున్న రేటు ప్రకారం మంచి ధరే వస్తుంది. ఎవరైనా కొనుక్కుని  నా ఈ అప్పులు తీర్చండి" అని రాసి పెట్టి  రాత్రికి రాత్రే వెళ్లి పోయారు రామాచారి దంపతులు.

                                 *****

పొద్దున్నే ఇంటి ముందు గుంపులు గుంపులుగా జనాలు. "ముసలోల్లు పౌరుషానికి చితికి పోయి, ఎందులోనో పడి చచ్చి పోయే ఉంటారు.  పాపం! ఎంత కష్టం వచ్చింది వాళ్ళకు." అంటుంటే ఇంటి ముందు వేప చెట్టు కొమ్మ మీద కాకి ...లోకం తీరు ఇదేనేమో.. అప్పుడు అలా అన్న నోళ్ళే ఇప్పుడు ఇలా.. వాళ్ళ కంటే మేమే నయం కష్టం సుఖం కలిసి పంచుకుంటాం " పాపం ఎక్కడికి వెళ్ళారో .. "కంచం కడిగిన నీళ్ళతో పాటు నాలుగు మెతుకులు మాకోసం విదిల్చే వారు.. అనుకుంటూ వెళ్లి పోయిందా కాకి వాళ్ళను వెతుక్కుంటూ...

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios