అర్థరాత్రి ఒంటిగంట దాటింది.ఏదో శబ్దం రావడంతో ఉలిక్కిపడి లేచింది లక్ష్మి.పక్క రూంలో నాన్న శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు.

గాబరా పడుతూ, మంచినీళ్లందించింది.పక్కనే వున్న అమృతాంజనం తీసి, గొంతు,చాతిపై రాసినా ప్రయోజనం లేకుండా పోయింది.బాధగా వుంది హాస్పిటల్ కు పోవాలి బిడ్డ.... మాట్లాడడానికి ఇబ్బంది పడుతూ, ఆయాసంతో అన్నాడు నాన్న.బ్రీతింగ్ ప్రాబ్లం ఎక్కువ కావడంతో అతిగా ఆయాస పడుతున్నాడు.

వెంటనే హాస్పిటల్ కి వెళ్ళడానికి ఆక్సిజన్ అంబులెన్స్ కావాలి.గుగూల్ లో సెర్చ్ చేసి, ఫోన్లు చేయగా చేయగా అరగంటకు పదివేల రూపాయలకు ఒక అంబులెన్సు డ్రైవర్ రావడానికి ఒప్పుకున్నాడు.లొకేషన్ షేర్ చేసి అతడొచ్చేలోపల చెల్లెలు, నేను ఇద్దరం కలిసి నాన్నను హాల్లో సోఫాలో కూర్చోబట్టాం.నాన్న అసహనంగా తలను అటూ ఇటూ తిప్పుతూ ఊపిరి పీల్చుకునేందుకు బాధ పడుతున్నాడు.అంబులెన్స్ రాగానే అందులోని ఆక్సీజన్ కు సంబంధించిన ట్యూబులు మూతికి తగిలించారు.ఊపిరాడడంతో నాన్న ముఖంలో కొంత ప్రశాంతత కనిపించింది.నా ముఖంలో ఆందోళనతో కూడిన ఒక నవ్వు అలా మెరిసి ఇలా మాయమైంది.
                       
దాదాపు మూడు గంటల ప్రాంతంలో ఆ ఆక్సిజన్ అంబులెన్స్ లో నాన్న, నేను మా చెల్లెలు తిరగని హాస్పిటల్ లేదు, కార్పొరేట్ మొదలుకొని చిన్నా చితకా హాస్పిటల్స్ అన్నీ చుట్టేశాం.ఎక్కడికి వెళ్ళినా ఆక్సిజన్ బెడ్స్ ఖాళీ లేవన్న మాట వినీ వినీ చికాకొచ్చేస్తుంది.రెండు లక్షలు ఇస్తామన్నా కూడా బెడ్ దొరకలేదు.ఏం చేయాలో అర్థం కావడం లేదు, చివరికి గవర్నమెంట్ హాస్పిటల్ లో నన్నా ప్రయత్నం చేద్దామని డ్రైవర్ ను అంబులెన్సు అటు వైపుకు తిప్పమన్నాను.

అక్కడ పరిస్థితి మరీ దయనీయంగా ఉంది.అక్కడి అధ్వాన్న మేంటేనెన్స్ చూసాక,అప్పుడనిపించింది,అందరూ ప్రభుత్వ హాస్పిటల్స్ వెళ్ళడానికి ఎందుకు భయపడుతారో?

నగరంలో కరోనాతో ఇంత మంది బెడ్స్ లేక బాధ పడుతుంటే బెడ్స్ కెపాసిటీనీ పెంచే ఆలోచన చేయోచ్చు కదా ప్రభుత్వం, అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ మెడికల్ కాలేజీలను కోవిడ్ హాస్పిటల్స్ గా మారిస్తే బెడ్స్ కొరత ఉండదు కదా? అలాగే అన్ని ప్రైవేటు హాస్పిటల్స్ విధిగా యాభై శాతం బెడ్స్ నామినల్ థరలకే ఇవ్వాలనీ జీవో జారీ చేయవచ్చు కదా! లేదంటే మీ లైసెన్సులు రద్దు చేస్తామని ఆర్డర్ వేయవచ్చు కదా,అలా చేయకపోవడం వల్ల హాస్పిటల్ యాజమాన్యాలు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రభుత్వం అదుపు తప్పుతుంది.దీని మూలంగా మధ్యతరగతి ప్రజలే ఎక్కువ బాధ పడుతున్నారు.ఇతర దేశాలలో లాగా ఇక్కడ కూడా విద్య, వైద్యం రెండు ఫ్రీ చేసి, ప్రభుత్వ హాస్పిటల్స్, ప్రభుత్వ పాఠశాలల్లో,ఇన్ ఫ్రాస్టక్చర్ డవలప్ చేసి,ఈ రెండు వ్యవస్థలను తమ కంట్రోల్ లో వుంచుకోవడం ఎంతైనా అవసరం.నా ఆలోచనలను డిస్టర్బ్ చేస్తూ, బెడ్ గురించి కనుక్కోవడానికి లోపలికి వెళ్ళిన డ్రైవర్ ఆక్సిజన్ షార్టేజ్( కొరత),ఉందటమ్మా అంటూ చావు కబురు చల్లగా మోసుకొచ్చాడు.
                    
అప్పుడే నా ఫోన్ మోగింది.అంతకు ముందు తిరిగిన హాస్పిటల్ లలో ఒక హాస్పిటల్ కి చెందిన వ్యక్తిది ఆ ఫోన్.ఒక ఆక్సిజన్ బెడ్ ఇప్పుడే ఖాళీ అయ్యింది మేడం మీరు మీ నాన్న గారిని తీసుకురావచ్చు అంటూ చెప్పాడు, హమ్మయ్య, ప్రాణం లేచొచ్చింది.అంబులెన్స్ హాస్పిటల్ వైపుకు పరుగుపెట్టింది.
                    
హాస్పిటల్ చిన్నదే.ఒక యాబై పడకలుఉంటాయనుకుంటా,ఈ మధ్యనే కట్టినట్లుంది.అందుకే ఆంబియన్స్ బాగుంది.నాన్నను క్యాజువాలిటీలో వుంచారు, అక్కడ డాక్టర్, మేం ట్రీట్మెంట్ మొదలెట్టాలంటే మీరు ముందు రిసెప్షన్ లో కలిసి రండి అంటూ చెప్పాడు.చెల్లిని నాన్న దగ్గర వుంచి రిసెప్షన్   వైపుకు వెళ్ళాను.ప్రస్తుతం మీ నాన్న పరిస్థితి అంతా సీరియస్ గా  ఏం లేదు.ఐసీయు లో వుంచాల్సిన అవసరం అంతకన్నా లేదు.సింగిల్, లేదా షేరింగ్ రూంలో వుంచి ఆక్సిజన్ పెట్టి, ట్రీట్మెంట్ ప్రారంభిస్తాం.సింగిల్ రూంకి రోజుకి ముప్పై అయిదు వేలు, షేరింగ్ రూంకి ముప్పై వేలు అవుతుంది.

మెడిసిన్స్, ఇన్వెస్టిగేషన్స్ ఖర్చు మీదే.మీ నాన్నకు బీపీ, షుగర్ ఉన్నందువల్ల, రోజు కార్డియాలజిస్ట్,డయాబెటాలజిస్ట్ చూడాల్సివుంటుంది.
వాళ్ళ కన్సల్టేషన్ ఫీజులు విడిగా చెల్లించాలి.ఒకవేళ సాచురేషన్స్ తగ్గిపోతే, ఐసీయూలో వుంచాల్సి వస్తుంది.ఐసీయూలో రోజుకి యాబై వేలు, వెంటిలేటర్ అవసరం వస్తే, రోజుకి డెబ్బై వేలు అవుతుందని, మీకు ఒకే అయితే,లక్ష రూపాయలు కట్టి ఈ పేపర్ మీద సంతకం పెట్టండి అంటూ హాస్పిటల్ మెనూ కార్డ్ ను ఏకరువు పెట్టాడు.ఏం చేయాలి,నా బ్యాంకు అకౌంట్ లో,నాన్న అకౌంట్ లో కలిపి అరవై వేలు వున్నాయి.ఆ రెండు కార్డులు స్వైప్ చేయమని చెప్పి,మిగితావి రేపుదయం ఇస్తానని చెప్పాను.ఆ తరువాత నాన్నను షేరింగ్ రూంకి షిఫ్ట్ చేసారు.నేను, చెల్లెలు కిందికొచ్చి వెయిటింగ్ ఏరియాలో కూర్చున్నాం.ఆప్పుడప్పుడే తూర్పున భానుడు ఉదయిస్తున్నాడు. ఆ కొత్త ఉషోదయాన్ని రాత్రి తాలూకు నిద్ర లేమి కారణంగా ఆస్వాదించ లేకపోయాను. కుర్చీలో కూర్చొని గతంలోకి జారిపోయా..
                     
నాన్న ఒక ప్రైవేటు ఉద్యోగి.నాన్న జీతం సరిపోకపోవడంతో, అమ్మ కూడా ఒక ప్రైవేటు స్కూల్ లో టీచర్ గా చేరింది.అలా ఆ ఇద్దరు కష్టపడుతూ మా ఇద్దరినీ ఏ లోటూ లేకుండా పెంచారు.మేడం,హెచ్ఆర్ సీటీ తీయాలి అయిదు వేలు రిసెప్షన్ లో కట్టండి అంటూ ఎవరో అరవడంతో ఈ లోకం లోకి వచ్చాను.వళ్ళు తిరిగినట్లవడంతో తమాయించుకుని, లేచి రిసెప్షన్ దగ్గరకు వెళ్ళాను.ప్రస్తుతం మీరైతే చేయండి,ఒక గంటలో పే చేస్తాననీ రిక్వెస్ట్ చేసాను.చెల్లెను హాస్పిటల్ లో వుండమని చేప్పి, నేను వేగంగా ఇంటికి బయలుదేరాను.మా ఇద్దరి పేరు మీద బ్యాంకులో వున్న ఫిక్సింగ్ డిపాజిట్లు నాలుగు లక్షల రూపాయలు తప్ప వేరే ఆధారం లేదు.ఇంట్లో ఆ పేపర్లు తీసుకుని బ్యాంకుకు వెళ్లి, డిపాజిట్లు క్యాన్సల్ చేసి డబ్బులు తీసుకోవడం, హాస్పిటల్ లో పే చేయడం ఒకేసారి జరిగిపోయాయి.సాయంత్రానికి రిపోర్ట్ వచ్చింది కోవిడ్ పాజిటివ్ అనీ.
                       
మేడం ప్రిస్క్రిప్షన్ లో అన్ని మెడిసిన్స్ వున్నాయి కానీ రెమిడెసివిర్ ఇంజెక్షన్లు మాత్రం బయట తీసుకోండి అవి షార్టేజ్ అయ్యాయనీ ఫార్మసిస్ట్ చెప్పాడు ప్రిస్క్రిప్షన్ తీసుకొని నా ఆక్టివా బండిపై చుట్టు పక్కల అన్ని ఫార్మసీలు తిరిగాను.ఎక్కడా నో స్టాక్ అనే సమాధానం.చివరీకి వచ్చి రెమిడెసివిర్ డ్రగ్ ఏదైనా లైఫ్ సేవింగ్ డ్రగ్ గా అని అడిగాను.అదేం కాదు కానీ అన్ని కంపెనీల బ్రాండ్స్ షార్టేజ్ నడుస్తున్నాయనీ,బ్లాకులో ట్రై చేయమంటే చేస్తాను అంటూ సమాధానమిచ్చాడు.

ఒక ఇంజెక్షన్ ఎంత వుంటుంది,అంటే ఒరిజినల్ ఎంఆర్ పీ అయితే మూడు వేల నాలుగు వందలు.బ్లాకులో ఒక టి ఇరవై వేలు.అంటే ఆరు ఇంజెక్షన్ల ఖరీదు లక్షా ఇరవై వేలు అన్నమాట.తెప్పించండి డబ్బులు ఇస్తానన్నాను, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో. మనుషుల బలహీనతలను ఇంతగా వాడుకుంటున్నందుకు బాధ కలుగుతుంది.కానీ తప్పదు.
                    
నాన్నను కోవిడ్ వార్డుకు షిఫ్ట్ చేయడంతో ఆయన దగ్గర వుండేందుకు కూడా వీలు లేకుండా పోయింది.మూడు రోజులు గడిచాయి.నాలుగవ రోజు డాక్టర్ పిలిచి,సాచురేషన్స్ డెబ్బై లోపుకు పడిపోయాయి. ఐసీయూకి షిఫ్ట్ చేస్తున్నాం.అవసరమైతే వెంటీలేటర్ కూడా పెట్టాల్సి వస్తుందేమో? అని చెప్పారు.బాధతో కళ్ళల్లో నుంచి నీళ్లు జల జలా రాలాయి.ఎలాగైనా మా నాన్నను బతికించండంటూ డాక్టర్ ను ప్రాధేయపడ్డాను.

నాకు గుండె ధైర్యం ఎక్కువే గాని విషయం నాదాకా వచ్చేసరికి తట్టుకోవడం కష్టంగా ఉంది.లోపల ఏదో భయం,ఏం జరుగుతుందోనన్న టెన్షన్.రాత్రి పన్నెండు అయ్యింది.డ్యూటీ డాక్టర్ వచ్చి చాలా సీరియస్ గా వుంది వెంటీలేటర్ పెట్టాం అని చెప్పడంతో రాత్రంతా నిద్ర రాలేదు. తెల్లవార్లూ మెలుకువతోనే కుర్చీలో కూర్చున్న.ఎప్పుడు నిద్ర పట్టిందో తెలియలేదు.
                        
ఎవరో తట్టి లేపుతుంటే కళ్ళు తెరిచి చూసాను.ఎదురుగా సిస్టర్, డాక్టర్ గారు మిమ్మల్ని పిలుస్తున్నారు అంది, సమయం ఉదయం అయిదు గంటలు అయ్యింది.భయం భయంగానే ఐసీయూ దగ్గరకు వెళ్ళాను.ఏం వార్త వినాల్సివస్తుందో అని,నా భయం నిజమైంది.మీ నాన్నకు కార్డియాక్ అరెస్ట్ అయ్యింది, ఎంత ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయిందనీ ఆయన చెపుతూనే వున్నాడు...

నాన్న అన్న అరుపుతో ఆ ప్రదేశమంతా దద్దరిల్లింది. గుండెలో నుంచి దుఃఖం తన్నుకుంటూ వస్తుంది. చెల్లెలు వచ్చింది, దానిని వోదార్చడం నా తరం కాలేదు. బిల్ సెటిల్ చేసి అయినంత తొందరగా బాడీనీ, ఇక్కడి నుంచి తీసుకెళ్ళండి,అన్న మాటలు మాత్రం వినిపించాయి.కిరాయి ఇల్లు, చుట్టు పక్కల వాళ్ళే కాదు,ఓనర్ కూడా ఒప్పుకోడు.తన ఇంట్లో ఎవరైనా పోతే,ఎలా వుంటుందన్న విషయం ఆలోచించడు.ఏం చేయాలి? నా చెల్లెలితో, బండి మీద అన్ని శ్మశాన ఘాట్ లకు తిరిగాను.ఎక్కడా కోవిడ్ బాడీనీ దహనానికి ఒప్పుకోలేదు.ఇంత దారుణమా, మనిషి చనిపోతే దహనానికి ఇంత కష్టమా! చివరగా ఒక చోట అడిగితే ఈ నెంబర్ కి ఫోన్ చేయండి, మీకు హెల్ప్ చేస్తారని చెప్పాడు.ఫోన్ చేసాను.సరే అండీ, మేమే మీ హాస్పిటల్ కి అంబులెన్స్ పంపిస్తాం,మా మనుషులే బాడీనీ వెయికిల్ లో పెడుతారు.దహన కార్యక్రమాలన్నీ మేమే పూర్తి చేస్తాం.ఈ మొత్తం తతంగానికి ముప్పై వేలు ఖర్చు అవుతుంది.మీరు అంగీకరిస్తే, ఇప్పుడే అంబులెన్స్ పంపిస్తామంటూ, ఫోన్ పెట్టేసాడు.మరోవైపు రి‌సెప్షనిస్ట్ బాడీ డీ కంపోజ్ అవుతుంది, త్వరగా తీసుకెళ్ళండి అంటూ, ఒత్తిడి చేయసాగాడు. తప్పని సరి పరిస్థితుల్లో ఓకే చెప్పక తప్పలేదు.

పదకొండు గంటలకు అంబులెన్స్ వస్తుంది, బాడీనీ అందులో పెట్టేసి, నేను ఫోన్ చేసినప్పుడే బయలుదేరి రండి అని చెప్పాడు.నేను ఇంతసేపు తిరిగినా కుదరన్నారు అందరూ, ఇప్పుడు వీళ్ళకెలా సాధ్యమైందని, వివరాలు సేకరించా, కొందరు ప్రైవేటు వ్యక్తులు శ్మశాన్ ఘాట్ లను హైర్ చేసుకుని, ఎవరికీ అనుమానం రాకుండా చాలా సీక్రెట్ గా దహనం చేస్తున్నారు.శవం తాలూకు వాళ్ళ దగ్గర అధిక మొత్తంలో డబ్బులు తీసుకుంటారు.అలా ఒక్కో ప్లేసులో రోజులో దాదాపు అయిదు నుంచి పది శవాలను దహనం చేస్తుంటారనీ తెలిసాకా కాష్టాన్ని కూడా వ్యాపారం చేసేశారనీ అర్థం అయింది.పదకొండుగంటల నుంచి ఎదురు చూస్తే మధ్యాహ్నం 2గంటలకు రమ్మని చెప్పాడు. మేం అక్కడికి వేళ్ళే సరికే కట్టెలు పేర్చి రెడీగా వుంచారు.అంబులెన్స్ నుంచి డైరెక్ట్ గా చితి మీదకు నాన్నను తీసుకెళ్లారు.తనవాళ్లెవరూ లేక ఒక బ్రాహ్మణుడు లేక,పూజా లేక,ఆయన మంటల్లో కలిసిపోతుంటే దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను.నేనూ, చెల్లెలు ఏడుస్తూ కూర్చున్నాం.
                       
ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది.నాన్న జ్ఞాపకాలు అన్ని గదుల్లో నిక్షిప్తమై ఉన్నాయి.చుట్టూ నిశీధి ఆవహించింది.గాలి స్తంభించింది.నాలో ఆలోచనలు నిర్విరామమై గుండెను తొలుస్తున్నాయి.ఎవరు ప్రశ్నించాలి? అవును నిలదీయాలి?ఎవరిని అడగాలి?ఏమయిపోతుంది ఈ వ్యవస్థ, హాస్పిటల్ లో బెడ్డుతో లక్షల్లో వ్యాపారం, ఆక్సిజన్ కొరతతో ప్రాణాలతో చెలగాటం,మందుల బ్లాక్ మార్కెట్,కాష్టాల గడ్డ లో శవాలతో వ్యాపారంవీటన్నింటినీ ఎవరు ప్రశ్నించాలి? అన్ని వ్యవస్థలు నాశనం కావడానికి ఎవరు బాధ్యులు.....

ఊపిరి సలపని ప్రశ్నలు మనసుతో కలహించుకుంటుంటే, అభివృద్ధికి ఓటేయండంటూ ఏదో పార్టీ ర్యాలీ వీధిలో నుంచి వెళుతూ మా ఇంటి ముందుకొచ్చి ఆగింది......