నాగిళ్ల రమేష్ తెలుగు కవిత: నేలమీది పచ్చబొట్టు
తెలుగు సాహిత్యంలో తెలుగు కవిత్వ ప్రక్రియది ప్రత్యేక స్థానం. నాగిళ్ల రమేష్ రాసిన నేల మీద పచ్చబొట్టు కవిత మీకోసం అందిస్తున్నాం
అది సుతిమెత్తని పద్యం నాకు
నా దేహపుతిత్తికి
పదేండ్లు ప్రాణములూదిన జీవతరువు
ఆ కానుగుచెట్టు.
చెట్టంటే చెట్టుగాదు
మా బడి చిలుకలకు
మధువును తాపిన అమ్మ.
నిలువనిట్టాడు లేని య్యాల్ల
వంటతల్లులకు నీడనిచ్చిన సాయమాను.
మూలవాగు నొసటన పొడిచిన పచ్చబొట్టు.
దగ్గరదగ్గరగా నలభైయేండ్లసంది
మా మల్లయ్య సాదుకున్న పెద్దకొడుకు
అలసిన పోరుపాటలను
నిద్రపుచ్చిన జోలపాట
ఇపుడు ఆ చెట్టే నేలకూలిందంటే
ఎంతన్న బాధ నాకు.
అసలు చెట్టే
ఒక చారిత్రక సాక్ష్యం.
చెట్టు లేని లోకం
ఆవుసు లేని దేహమే.
ఎక్కడైనా చెట్టంటే చెట్టెకాదుగదా
ఎక్కడికక్కడ నిలబడ్డ తల్లి.
అసలు చెట్టు కూలిపోవడం అంటే ఏమిటి?
నువ్వు,నేనూ స్వార్థంతో
ముక్కలు ముక్కలుగా రేపటిని కూల్చడమే కదా
మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature