Asianet News TeluguAsianet News Telugu

"యారాడకొండ" నవలపై నాలుగు మాటలు..!

ఆటా బహుమతి నవల " యారాడకొండ" పై విశాఖపట్నం నుండి మూర్తి కెవివిఎస్ రాసిన నాలుగు మాటలు

Murthy KVVS on ATA prize winning novel Yaradakonda
Author
Hyderabad, First Published Oct 5, 2021, 4:50 PM IST

నేను ఇటీవల చదివిన నవల యారాడకొండ. రచయిత ఉణుదుర్తి సుధాకర్.  చదివిన తర్వాత నా అనుభూతిని కొన్ని వాక్యాల్లో పంచుకోవాలనిపించింది. తెలుగు నవల చదివి చాలా కాలమైంది. ఇంగ్లీష్ నవలలు చదువుతూ వాటి మీద ఏదో నాలుగు మాటలు నా బ్లాగు ల్లోనూ,అడపాదడపా పత్రికల్లోనూ రాసుకుంటూ కాలక్షేపం చేస్తున్న నన్ను యారాడకొండ వైపు లాక్కెళ్ళింది ఏమిటీ అంటే మూడు అంశాలు.

ఒకటి శ్రీశ్రీ ఆ కొండని కొన్నిమార్లు ఉగ్గడించడం, రెండు ముఖచిత్రంగా ఉన్న కెప్టెన్ జె.టి.బ్లంట్ యొక్క పేయింటింగ్. దీనిమీదట విశాఖ నగర సౌందర్యంపై నాకు గల మోహభావం. వీటిని పట్టుకుని యారాడ కొండపైకి ఎక్కాను.  సముద్రం అంత జీవితాన్ని ఎంతో శ్రద్ధతో, ప్రేమతో చిత్రించిన రచయిత అంతరంగాన్ని అవలోకించి ఔరా అనుకుని ఒక్క ఉదుటున నవల మొత్తం చదివేశాను.  కాదు..కాదు యారాడ కొండనే నన్ను తీసుకుపోయింది తనతో..!  

ఇది ఒక జాలరి కుటుంబానికి చెందిన కథ.  బ్రిటీష్ వారి పాలనలో మొదలయి ఆ తర్వాత రోజులవరకు అనగా ప్రస్తుత కాలం వరకు సాగిన కథ. దానితో బాటే విశాఖ నగరం కాలంతో బాటు మార్పులకు లోనవుతూ వచ్చిన కథ. మరి అంతమాత్రమేనా..? ఇంకా ఎన్నో ఉన్నాయి..ఆనాటి ఆంగ్లో ఇండియన్లు వారి సామాజిక పరిస్థితుల్ని కెప్టెన్ జిమ్మీ పెరీరా కుటుంబం ద్వారా చూపించారు. మన తెలుగు నవలల్లో ఇంత సావకాశం గా వారి జీవితాల్ని చిత్రణ చేసిన నవల నాకు తెలిసీ బహుశా అతి తక్కువ.

రచయితకి సముద్రయానంపై గల అనుభవాలు ఈ నవలకి పెద్ద ఎస్సెట్ అని చెప్పవచ్చు.  నూకరాజు, ఎల్లమ్మ పాత్రలు వారి బాల్యం...ఆంగ్లో ఇండియన్ ప్రభావంతో ఎదిగిన వైనం మనుషుల మధ్య జీవిత గమనాన్ని ఎలా మార్చుతాయో కళ్ళకి కట్టినట్లు చిత్రించారు. అలాగే వారి మధ్యనుంచే వచ్చిన సింహాచలం బయటి నుంచి వచ్చిన పెట్టుబడిదారులకి తాబేదారునిగా మారిన వైనం నేటి స్థితిగతుల్ని గుర్తు తెప్పిస్తాయి.  అప్పల్రాజు పాత్ర రెండు స్వభావాల మధ్య నలిగిపోయిన అభాగ్యుల్ని గుర్తు చేస్తుంది.  

భాస్కర్ పాత్ర ఆ రోజుల్లో ఆదర్శాల కోసం ప్రాణ త్యాగం చేసిన మనుషుల్ని సజీవంగా మనముందు నిలుపుతుంది.  వీటన్నిటికీ మించి విశాఖ అంతర్లీనం గా ప్రతి పాత్రతోనూ పడుగూ పేకలా కలిసిపోయింది. సెల్వన్, కమల పాత్రలు మనతో ఎన్నో నేటి వాస్తవాల్ని ముచ్చటిస్తాయి. ఇంత ఏలా..?ఎయిర్ పోర్ట్ లో నూకరాజు, ఎం.పి. నాయుడుతో మాట్లాడుతున్నప్పుడు ఒక హేళన ధ్వనించే గొంతుతో అతను ఏకవచనంతో సంభోదించినపుడు తిరిగి అదే విధంగా నూకరాజు కూడా సంభోదించడం ఆత్మగౌరవం అంటే ఏమిటో ఒక సూక్ష్మ విధానంలో తెలియజేశారు.  

మనం యారాడకొండ ఎక్కి ఒక దృశ్యకావ్యాన్ని చూస్తాం.  చదువుతున్నంత సేపు మైమరపు, చదివిన తర్వాత మనలో ఒక భాగంగా మారిపోవడం ఈ రెండు లక్షణాలు గొప్ప నవలల్లో నేను గమనించినవి. ఈ యారాడకొండ ఆ కోవకి చెందినది. ఇంతమంచి నవల ని తెలుగు వారికి అందించిన ఉణుదుర్తి సుధాకర్ గారికి, ఆటా వారికి, అన్విక్షికీకి అభినందనలు.

ఇటీవల ఒక ట్రెండ్ గమనించాను. ఫలానా పుస్తకం బాగుందండీ అంటే దాని పిడిఎఫ్ ఎక్కడ ఉంది అని అడుగుతున్నారు. తెలుగు భాషని ఉద్ధరించుకోవడం అంటే మంచి తెలుగు పుస్తకాల్ని కొని చదవడం కూడా అని ఎందుకనుకోరో అర్ధం కాదు. మళయాళంలో గాని, కన్నడ భాషలో గాని మంచి పుస్తకం అని పేరు వస్తే మొదటి ఏడాదిలో కనీసం మూడువేల ప్రతులు అమ్ముడవుతాయి.  అంటే వారికి పిడిఎఫ్ ల గూర్చి తెలియదా ...భాషాభిమానాన్ని మాటలతో బాటు చేతల్లో చూపించాలి. అది నేటి అవసరం. 

Follow Us:
Download App:
  • android
  • ios