త్యాగాల బాటలో పోరాట పాట
నాగన్న సాంస్కృతిక ఉద్యమ జీవితం- సమాలోచన అనే అంశంపై ఈ నెల 21వ తేదీ ఆదిావారం సదస్సు జరగనుంది. ఈ సందర్భంగా ముఖేష్ సామల నాగన్నపై రాసిన వ్యాసాన్ని ఇక్కడ అందిస్తున్నాం.
రచయిత: ముఖేష్ సామల
“కళ కళ కోసం కాదు ప్రజలకోసం, ప్రగతి కోసం” అన్న నానుడికి నిలువెత్తు నిదర్శనం అరుణోదయ నాగన్న జీవితం. తన కళా జీవితాన్నంత పేద ప్రజల విముక్తి కోసం, వర్గ పోరాటాల కోసమే నినదించిన కంచు కంఠం, విప్లవ గేయాలకు ప్రాణం పోసి పాడుతూ అరుణోదయ సాంస్కృతిక సంస్థ పేరునే తన ఇంటి పేరుగా మార్చుకున్న పాటల పాలికాడు కామ్రేడ్ నాగన్న. కామ్రేడ్ వినోద్ మిశ్రా గారు కమ్యూనిస్టుల గురించి "Some leftists want prestage of leftists and previlizes of rightist"(కొంతమంది వామపక్షీయులు లెఫ్టిస్టులకున్న గౌరవం, రైటిస్టులకుండే వసతులు కావలనుకుంటున్నారు) వంటి విమర్శలకు సైతం దొరకని నిరాడంబరమైన జీవితం నాగన్నది. కమ్యూనిస్టు అనే పదం కేవలం గౌరవం కోసం పిలుపించుకునేందుకు కాంకుడా, పెట్టుబడి దారి ప్రలోభాలకు లొంగకుండా నిబద్ధత గల నిఖార్సయిన కమ్యూనిస్టుగా బ్రతకడమెలాగో నాగన్న జీవితాన్ని చూస్తే తెలుస్తోంది.
ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని పైకెక్కి దిగినదాంక నమ్మకమే లేని, ఓ నాలుగు తాళ్ళు ఎక్కి రెండు ఈదులు గీస్తే గానీ పూట గడవని గౌండ్ల కులంలో నిరుపేద ఇంట పుట్టిన బిడ్డ విప్లవాక్షరాలుదిద్ది పేద ప్రజల విముక్తికై, సర్వాయి సర్ధార్ పాపన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని బహుజన రాజ్య స్థాపనను కాంక్షిస్తూ పోరాటమే జీవితంగా బతుకుతున్న నాగన్న జీవితం బహుజనలకు ఆదర్శప్రాయం. ఖమ్మం జిల్లా తిరుమలాయిపాలెం మండలం రాజారం గ్రామంలో పరకాల లచ్చుమమ్మ పాపయ్యల కొడుకు పరకాల నాగయ్య ఉద్యమంలో చేరాక నాగన్న అయ్యాడు. స్వగ్రామంలోనే రెండవ తరగతి వరకు చదువుకున్నాడు. పై తరగతుల కోసం పక్క ఊరైన నర్సింహపురం వెళ్ళాలి అది నల్గొండ జిల్లాలో ఉంటుంది. నాగన్నకు ఒక అక్క, తమ్ముడు. తల్లికేమో పుట్టుకతోనే కాలు పనిచేయదు. కాసింత వ్యవసాయం చేసుకొని, ఓ నాలుగు తాటి చెట్లెక్కే కుటుంబ ఆర్ధిక భారమంత తండ్రి పైనే ఉండేది. తండ్రికి ఆసరాగా ఉంటుందని రెండు మేకలు కొని వాటిని నాగన్నకు అప్పచెప్పగా, జీతాలు చేస్తూ, కుల వృత్తి అయిన తాళ్ళెక్కడం, ఈదులు గీయడం నేర్చుకొని ఇరవై ఏళ్ళ వయస్సు వరకు తండ్రికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. మేనత్త కూతరు లక్ష్మి జీవితానికి మాత్రమే సహచరి కాదు ఉద్యమంలో కూడా తనకు తోడుగా నిలిచింది. కొమ్రేడ్ లక్ష్మీ నాగన్నతో కలిసి అడుగులో అడుగై పాటలో గొంతుకై అరుణోదయలోనూ, POW సంస్థల్లో పనిచేస్తూ అనేక నిర్బందాలను నిలదొక్కుకొని సమసమాజ స్థాపనలో సహచరునితో కలిసి ఉద్యమాల్లో పాల్గొన్నది. వీరికి అజయ్ అనే ఏకైక సంతానం. తల్లిదండ్రుల బాటలోనే ఉగ్గుపాలతో పాటను నేర్చుకొని వారసత్వాన్ని కొనసాగిస్తున్నాడు. వీరికే తినడానికి తిండిలేక ఆర్ధిక ఇబ్బందులు ఎదురవడం, పోలీసుల అక్రమ అరెస్టులు, జైలు జీవితాలు, నిర్బందాలతో ఉక్కిరిబిక్కిరవుతుంటే ఒకానొక సందర్భంలో కొడుకుని ఎవరికైనా ఇచ్చేద్దామని నాగన్న అంటే, కన్నపేగు కంటశోకం పెట్టి ఎలాగైనా సాదుకుందామని సహచరుణ్ణి సమాధానపరిచింది. వీళ్ళు పాటలు పాడుతుంటే స్టేజి పక్కన పడుకోబెట్టితే పాలు సరిపోక నోట్లో వేలు పెట్టుకొని కడుపు నింపుకునేవాడు పసిగుడ్డు అజయ్. కమ్యూనిస్టు ఉద్యమాల్లో వర్గ పోరాటాలు నేర్చుకున్న నాగన్న పక్క ఊరిలో తాళ్ళెక్కపోయినపుడు, పక్క ఊరిలో దినాలకని వెళ్ళినప్పుడు పెద్ద కులం వాళ్ళతో కలిసి భోజనం చేస్తావా అని వారిస్తే, తండ్రికి కంప్లైంట్ ఇస్తే కుల రక్కసిపై అసమ సమాజంపై మరింత కసిని పెంచుకున్నాడు. దేశంలో కులం, వర్గం పై పూర్తి అవగాహన ఉన్న నాగన్న భారతదేశంలో కులం పోతే గానీ అభివృద్ధి చెందదు అని నమ్ముతాడు. తన స్వంత గ్రామానికి చెందిన శ్రీపాద శ్రీహరి గారి ఎన్కౌంటర్ నాగన్నను కలిచివేసింది. రెండు రోజులు అన్నం సహించలేదు. న్యాయం వైపు నిలబడితే కాల్చివేతలేంటి అని కలతచెంది సమసమాజ స్థాపనకు శ్రీహరి బాటలో నడవాలని విప్లవోద్యమం వైపు అడుగులేశాడు.
బుర్రకథలతో , పాటలతో నాగన్న దంపతులు ప్రజలను చైతన్యం చేసేవారు. సామజిక కార్యక్రమంలో భాగంగా 'సారా వ్యతిరేక ఉద్యమం' లో 'పెద్దత్తో దాన్ని పయనం చెయ్యి' అనే పాటను స్వయంగా రాసి పాడారు. అదేవిధంగా 'అక్షరదీపం' కార్యక్రమంలో ' బావ నేను బడికిపోతా' అనే సంవాద గేయాన్ని రాసి చదువు ప్రాముఖ్యతను పల్లెపల్లెను తిరిగి ప్రచారం చేశారు. విప్లవోద్యమం కోసం ' ఎర్ర పూల వనంలోన పువ్వు పూసిందో' అనే తన మొదటి పాట మంచి గుర్తింపు నిచ్చింది. ' అన్న అమరుడా మన రామనర్సయ్య' అనే పాట పాడి శ్రోతలను కంఠతడి పెట్టిస్తాడు. ' కాంచన పల్లి అడవుల్లో కనుమూసినారా…' అంటూ ఆలపించిన పాట అన్న కలం నుండి వచ్చినదే. కవి, వాగ్గేయకారుడు యోచన అరుణోదయ రామారావు మరణ వార్తను తట్టుకోలేక రాసిన 'నువ్వు గొంతెత్తితే గోదావరి లోయ లోయంత ఊగింది ఉయ్యాల' అనే పాటను నాగన్న కంచు కంఠంతో పాటకు ప్రాణం పోసిండు. మలి దశ తెలంగాణ ఉద్యమంలో భాగంగా అనేక తెలంగాణ ధూమ్ ధామ్ కార్యక్రమాల్లో నిస్వార్థంగా పాల్గొని తెలంగాణ రాష్ట్ర ఆవశ్యకతను తన పాటలతో ప్రజలకు తెలియజేస్తూ చైతన్యాన్ని నింపిండు. ఆర్. నారాయణ మూర్తి , వందేమాతరం శ్రీనివాసరావును నాగన్న ఇంటికి పంపించి 'దండోరా' సినిమా కోసం 'కొంగు నడుముకు చుట్టవే చెల్లెమ్మ కొడవండ్లు చెప్పటవే' పాటను పాడించింరు. 'చలో అసెంబ్లీ' సినిమాలో 'ఆగదు ఆగదు ఆకలి పోరు ఆగదు' పాటను ఆలపించింది నాగన్నే. 'జైబోలో తెలంగాణ' సినిమా టైటిల్ సాంగ్ నాగన్న పాడారు. విప్లవ సినిమాల చిరునామా నారాయణ మూర్తి అలసిపోతే నాగన్నతో పాట పాడించుకొని సేద తీరుతాడని తానే స్వయంగా చెప్పుకున్నారు. 'ఆళ్లకోస 'పుస్తకావిష్కరణ సభలో నాగన్న కంచు కంఠాన్ని విని ముగ్దుడనయ్యాను.
సిద్ధాంతం, ఆచరణ వేరువేరు కాదంటూ, ఖమ్మం మెయిన్ రోడ్ లో ప్రభుత్వ స్థలంలో బడ్డీకొట్టు పెట్టుకొని, చిన్న రేకుల షెడ్డులో జీవనం కొనసాగిస్తున్న నాగన్నను చూసి నేటి రివిజనిస్టు కమ్యూనిస్టు పార్టీల్లో ఉంటూ అన్ని భోగాలను అనుభవిస్తున్న వారంత నేర్చుకోవాల్సిందే. పెట్టుబడిదారి ప్రభావంలో కొట్టుకుపోకుండా భావి తరాలకు ఆదర్శ కమ్యూనిస్టు, సమసమాజ స్వాప్నికుడు నాగన్నను సమాజం ఆదర్శంగా తీసుకొని, నమ్మిన సిద్ధాంతం కోసం ఆచరణే జీవితంగా బతుకుతూ ముళ్ల బాట అని తెలిసినా తన కంఠంతో సమాజానికి సవాల్ చేస్తూ, ప్రాణం ఉన్నంత వరకు పాటతోనే, ప్రజల వైపు నిలబడి, చైతన్యాన్ని నింపుతున్న పాటల గిజిగాడు, పోరుపాటల యుద్ధ గీతాన్ని ఆలపిస్తున్న నాగన్న జీవితాన్ని సమాజానికి పరిచయం చెయ్యాల్సిన భాద్యత నేటి సమాజంపై ఎంతైనా ఉంది.