Asianet News TeluguAsianet News Telugu

వలస బతుకుల వెతలను వల్లెవేసిన సంగెవేని

క్షతగాత్రుల శిబిరంగా మారిన బొంబాయి మహా నగరిలో  చితికిపోయిన తన స్వప్నాలను ఒక్కటొక్కటిగా ముల్లె కట్టుకున్న తీరును కళ్ళముందు కదలాడుతున్నట్లుగా  చెప్పిన  కవి సంగెవేని రవీంద్ర దీర్ఘ కవిత  'నేను ముంబైకర్ ని..!'  పై కూకట్ల తిరుపతి అందిస్తున్న సమీక్ష.

Kukatla Tirupathi reviews Sangiveni Ravindra book
Author
Mumbai, First Published Apr 30, 2021, 10:47 AM IST

"ఇక్కడకు/నా అంత నేనుగా రాలేదు/పల్లెను, తల్లిని, కాదని/పేగు బంధం/మట్టిగంధం వదులుకొని..." అని దీర్ఘ కవితను ఆసక్తికరంగా ఆరంభించారు.  దీంట్లో ఇతివృత్తానికి తగిన ఎత్తుగడను అవలంభించారు సంగెవేని. ఎంచుకున్న వస్తువును ఎలా కవిత్వీకరించాలి? ఎక్కడ ప్రారంభించాలి? ఎట్లా కొనసాగించాలి? ఇలా చాలా మంది కవుల కవనానికి అనేక  విషయాలు అడ్డంకిగా నిలువడం సహజం. ఊహించి రాసినపుడో! ఎవరో చెబితే విని రాసినపుడో! ఇట్లాంటి సంక్లిష్టాలు కవికి తారసపడవచ్చును.  కానీ వస్తువు అనుభవైకవేద్యం అయినపుడు కవికి ఎలాంటి ఆటంకాలు ఎదురుకాకపోవచ్చు.  ఇక్కడ కవి సంగెవేని రవీంద్ర ఒక వలస కార్మికుడు.  వలస బతుకును అనుభవించినవారు.  ఆ అతుకుల బతుకుల లోతుపాతులను తరచి చూసినవారు.  ఆ అవమానాలను, అవహేళలను స్వయంగా భరించినవారు.  ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ముంబై మహా నగర నిర్మాణానికి కండలు కరిగించి, నెత్తరు ధారవోసి, మేథో మథనం చేసిన ప్రవాస తెలుగు సంతతికి ఇతడు వారసుడు.  కాబట్టి "నేను ముంబైకర్ ని" అని సహజాతిసహజంగా కవనం చేయగలిగారు. చిన్న తనంలోనే నాన్నను కోల్పోయిన సంగెవేనిదీ ఓ దీనగాథ.  తల్లీ, చెల్లీ, తమ్ముడూ, తనను పొట్టచేతబట్టుకొని ముంబైకి తీసుకెళ్ళిన తాత. ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని కోరుకునేటటువంటిది.  ఆయన కన్నీటి గాథను పాఠకున్ని కదిలించేలా అక్షర బద్ధం చేయడంలో రవీంద్ర కృతకృత్యులయ్యారని చెప్పవచ్చు. ఆనాడు తెలంగాణ పల్లెల్లో పేరుకుపోయిన పెత్తనాలు పల్లీయులను ముంబాయికో... బొగ్గుబాయికో... దుబాయికో... వలసబాట పట్టించాయి.  ఆ బాధితులందరి గొంతుకగా ఇందులో సంగెవేని మాట్లాడిన విధం ఆలోచనాత్మకం.

ఆత్మీయ మిత్రులు సంగెవేని రవీంద్ర రచన  "నేను ముంబైకర్ ని..! ఒక దీర్ఘ కవిత.  కవి ఎంచుకున్న వస్తువును సమగ్రంగా ఆవిష్కరించడానికి అనువుగా ఉండే కవితా రూపమిది.  వస్తువులోని భిన్న పార్శ్వాలను కవితామయం చేసే నిడివి ఇందులో పుష్కలంగా ఉంటుంది.  కవి హృదయం తనివి తీరే వరకు అనివార్యంగా పెరిగే కవితనే దీర్ఘ కవిత.  కాబట్టి కవి గైకొన్న ఇతివృత్తాన్ని ఈ ప్రక్రియలో సమగ్రంగా వివరించగలిగారు.  రవీంద్ర బాల్యదశలోనే ముంబైకి వలసవెళ్ళిన తెలంగాణ బిడ్డ.  ఇతను చైతన్యవంతమైన కవి.  జీవితానుభవాల నుండే కవిత్వాన్ని నిండుగా పండిస్తున్న అక్షర కృషీవలుడు. ఇప్పటికి 16 పుస్తకాలు రచించారు.  ఇవన్నీ అపురూపమైనవే కావడం గమనార్హం.  రవీంద్ర చేసిన సాహిత్య కృషికి ఎన్నో పురస్కారాలు సైతం ఇతన్ని వరించాయి.  ముంబై గడ్డ మీది నుండి తెలుగు సాహిత్యాన్ని సుసంపన్నం చేస్తున్న రచయిత సంగెవేని. ఈ పొత్తం దీర్ఘ కవిత ప్రక్రియకు చెందింది.  ఇందులో ముంబై వలస కార్మికుల వేదనాభరిత జీవితం ఉంది. ముంబై మహా నగర నిర్మాణంలో వలస పక్షుల అద్వితీయమైన పాత్రను కవి అద్భుతంగా వర్ణించారు. ఈ కావ్యంలో మూడు తరాలకు చెందిన వలస కార్మికుల కష్టాలు, కడగండ్లను హృద్యంగా వివరించారు.  కష్టజీవుల అనిర్వచనీయమైన కృషిని కవి కళ్ళకు కట్టినట్టు అక్షరీకరించారు.  మహారాష్ట్ర ప్రాంతానికి బతకడానికి పోయిన తెలుగువారు ఆ ప్రాంత భాషను, సంస్కృతీ సంప్రదాయాలను అమితంగా గౌరవించారు.  వాటిని ప్రేమతో వారు అక్కున చేర్చుకున్న వైనాన్ని చక్కగా బొమ్మ కట్టించారు.  వారు ఆ మట్టి మీద పెంచుకున్న మమకారం చాలా గొప్పది.  వలస పిట్టలకు నీడ నిచ్చిన చెట్టును కన్నతల్లిగా భావించి, ఆ తల్లి ఒడిలో సేదతీరిన మధుర జ్ఞాపకాలను కలకాలం వాళ్ళ మదిలో పదిలంగా  దాచుకున్న విధానాన్ని లోకమంతటికి అక్షరాలా తెలిసేలా ఈ కావ్యం ద్వారా వివరించిన కవి సంగెవేని రవన్న అభినందనీయులు.

క్షతగాత్రుల శిబిరంగా మారిన బొంబాయి మహా నగరిలో  చితికిపోయిన తన స్వప్నాలను ఒక్కటొక్కటిగా ముల్లె కట్టుకున్న తీరును కళ్ళముందు కదలాడుతున్నట్లుగా చెప్పారు రచయిత.  " నా శ్వాస నిండా నా ఊపిరి పరిమళాలే/నా కళ్ళ నిండా నా ఊరి పొలిమేరలే/అయినా అన్నం పెట్టిన ఈ పరాయి నేలను/నా దేహజలంతో అభిషేకించాను/ నరాల తీగెలు పరిచి పరిసరాలు వెలిగించాను " అంటారు కవి రవీంద్ర.  ఇటూ జన్మనిచ్చిన తెలంగాణ పల్లెతల్లినీ, అటూ జీవితాన్ని ప్రసాదించిన ముంబైమాతకు ప్రణమిల్లుతారు.  ఇదీ తనను కన్నతల్లికి, పెంచి పెద్ద చేసిన తల్లికి తానిచ్చే గొప్ప గౌరవం.  ఇదే కదా! ప్రతి వ్యక్తికి ఉండాల్సిన కనీస బాధ్యత, కర్తవ్యం.  "ఇక్కడ మొట్ట మొదటి/రైలు పట్టాలు నేనే/షోలాపూర్ చద్దర్ కు రంగులు నేనే/ఠాణేలో వైభవం నేనే/పుణేలో రాజసం నేనే/రెండు రాష్ట్రాల/రెండు చరిత్రల, రెండు కాంతుల వారధిని నేనే"  అంటూ అక్కడి అభివృద్ధిలో తన భాగస్వామ్యాన్ని ఏకరువు పెడతారు.  కన్నతల్లిలా ఆదరించిన ముంబైమాతను కల్పవల్లిగా భావి తరాలకు అందించిన ఘనత వలస పక్షులదే.  ఇపుడు శివాజీ కోటకు రక్షణ కవచంగా నిలిచిందీ మరాఠీ నేల దత్తపుత్రులేనని సగర్వంగా ప్రకటించుకున్నారు కవి.

ధారావి గుడిసెలు, కమాటిపురా గల్లీ బతుకులు, పంచతార హోటల్ వెలుగులు, దోభీఘాట్ రేవులు, ఫుట్ పాతుల బేపారాలు, మీటరు రాతల ట్యాక్సీ డ్రైవర్లు, బోరిబందర్ జనారణ్యంలో నలిగిపోయిన సగటు జీవులు, ముంబైలో ఎక్కడ పడితే అక్కడ వాలిన వలస పిట్టల రొదలే, రోదనలే వినిపిస్తాయంటారు సంగెవేని.  "ఎన్ని గాయాల పాదాలకు/మలాము రాసిందో/ఎన్ని స్వప్నాల చీకట్లకు/కిరణాల దారి చూపిందో/బాటసార్లనే కాదు/వేటగాళ్ళనూ ఆదరించింది/ఒళ్ళంతా రాళ్ళే అయినా/పిల్లల కోడిలా అందర్నీ/రిక్కల మాటున దాచుకుంటుంది." అని బొంబాయి పట్టణ చెట్టు ఎందరినో చేరదీసిందంటారు.  దాని సహృదయతను, వలస పిట్టల పట్ల తనపర తేడా చూపించకుండా వ్యవహరించిన ఉదారతను, ఆపదలో ఉన్న వాళ్ళనందరినీ తల్లిలా అక్కున చేర్చుకున్న మరాఠనేలను మానవతకు నిలువెత్తు రూపంగా కవి అభివర్ణించిన తీరు ఆకర్షణీయంగా ఉంది.  సాధు జీవులతో పాటు వేటగాళ్ళకు సైతం ముంబై ఒక తల్లికోడి అయ్యిందని ఉన్నది ఉన్నట్టుగా దృశ్యమానం చేశారు.

కవి ఉత్తమ పురుష కథనంలో కవిత్వం చెప్పడం వస్తువుకు మరింత బలం సమకూర్చింది.  బట్టల మిల్లు యజమానుల కఠినమైన విధానాలు కార్మిక కుటుంబాలను రోడ్డున పడవేసిన స్థితికి సంగెవేని రవీంద్ర కలత చెంది ఊరుకోలేదు. అలాంటి శ్రామిక వ్యతిరేక పోకడలపై ఈ కవి న్యాయం కోసం ప్రత్యక్ష పోరాటాలు చేయడం ఆయన వృత్తి నిబద్ధతకు, ప్రవృత్తి బాధ్యతకు తార్కాణం.  ఈయన కవిత్వాన్ని శక్తివంతముగా ముందుకు నడుపుతూనే పుస్తకంలో మధ్య మధ్యన సందర్భానుగుణంగా అచ్చేసిన వచనం కావ్య నిర్మాణానికి కొత్త వెలుగులను అద్దినట్లున్నది. అవి "తెలుగు వారి వలుసలు", "భవన నిర్మాణ రంగంలో తెలుగువారు", "కమాటి పుర", "రాజకీయ రంగంలో తెలుగువారు", "మహారాష్ట్రలో తెలుగు పత్రికలు" మొదలైన సమాచారాన్ని సంక్షింప్తంగా అందించడం మూలంగా ఈ కవిత్వాన్ని అవగాహన చేసుకోవడానికి పాఠకునికి సులభతరమయింది. నేను ముంబైకర్ ని అంటూ కవి గొంతెత్తి చాటిన విషయానికి పాఠకుల మద్దతు తప్పకుండా ఉంటుంది. అలాగే మరాఠా ప్రభుత్వంతో పాటుగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాల అండదండలు కూడా ఉంటాయని ఆశీస్తున్నాను.

" ఓ తెలుగు రాజా.. ఓ మరాఠీ తేజా..!/నేనో వలస బతుకమ్మని/వేలు విడిచిన గుడిపాడ్వాని../నన్ను కేవలం ఓటు ముద్రను చేయకండి/అక్కడో ఇక్కడో ఎక్కడో/ నన్నో మట్టిరేణువుగానైనా గుర్తించండి/ఆ మట్టిలో నన్ను మొలకెత్తనివ్వండి/నన్ను మొలకెత్తనివ్వండి/వేయి కొమ్మలై పరుచుకోనీయండి" అని మొరపెట్టుకుంటున్న వలసజీవి నినాదంలో మనమూ నాదమవుదాం.  ఇకనైనా మనం వలస గొంతుకల జీరను సిరాగా మలుచుకొని, వారి ఆకాంక్షలను అక్షరీకరిద్దాము.  ప్రాంతాలకతీతంగా తోటికవులుగా, రచయితలుగా వలస గోసలకు బాసటగా నిలుద్దాం.  వారి అస్థిత్వాన్ని, ఆనవాళ్ళను కాపాడుకుందాం.  అది మనందరి కనీస బాధ్యతని గుర్తెరుగుదాం.  రండీ..! ఇక ఆలస్యమెందుకు తెలుగు కవులారా! సంగెవేని రవన్నకు వంత పాడుదాం మరీ.

Follow Us:
Download App:
  • android
  • ios