దారిలో
ముళ్లను  ఏరుకుంటూ
రాళ్లను తొలగిస్తూ వెళ్తూ ఉంటే  


పూర్వపు మనుషుల అడుగు జాడలు చిత్రంగా అగుపించాయి
సత్యం లో నడిచిన 
 హరిశ్చంద్ర సంతతి

శుష్కాలంకారాలు
 గుండెల్నిపిండే 
గడ బిడల 
శబ్ధ   ప్రయోగాలు లేవు

వ్యాకరణ
వంది మాగదులై
దుష్ట సమాసాలను
మోయలేదు!

ఈటెలతో కాదు
మాటలతో రాజ్యాన్ని 
జయించిన దాఖలాలు

ఉప్పెనలను
ఉపద్రవాలను
ఎదురుకొన్న
శక్తి యుక్తి  

దారులిప్పుడు
రహదారులైనాయి
మాటలు మాత్రం
బోన్సాయ్ వృక్షాల్లా
కుండీల కతుక్కున్నాయి

ఏడారులైన మనస్సుల్లో
ఖర్జురం తీయదనంతో
 మాటల ఒయాసీస్సులు
  ప్రవహిస్తే ఎంత బాగుండు?

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి:https://telugu.asianetnews.com/literature