మేఘాల లాలాజలం కన్నీటిరాతలు
సందేహాల వెల్లువకెదురీద కుదరదంది
మనస్సులెట్లాగూ తళుక్కుమనడంలేదు
మట్టి తన రత్నానికి నీతిరంగునద్దింది. కథల్లో మలచిన వెతల మందు
బిడ్డలంత సమానమేనన్నా ,కొందరినే ఇష్టంగా ఎంచుకున్నది ,
ఎర్రదనాన్ని పంచమన్నది . 
కాలిబాటలనిండా మెరుపుల అక్షరాల్ని
విత్తినచేతులు ఒంటరిగా చువ్వల
వెనుక చేరిన విపత్తైన సందర్భమిది.
నిశ్శబ్దఅంతస్సారంఇంత నిస్సారమా!
దేశవాకిట ఎలుగెత్తిన కవితారవళులు
కరతాళధ్వనుల్ని విన్నది శుభ్రజ్యోత్స్నగా
నింగివెలిగినప్పుడు !
ఇప్పుడు ....ఇప్పుడు...ముసుగు గోదాముల్లో... మూలుగుల్లో...
న్యాయన్యాయాల కారణవికారాల్లో! లోకమంతా నివ్వెర గేయాలు పాడుతుంటే 
చెదబట్టని అగ్నిశిల మౌనముద్రదాల్చింది !!
కులదళాల ,కలందళాల వెనుక ఎవరికి
వారు భవనసముదాయాలయ్యారట ఈ భద్రమైదానాలపై !
భావదారిద్ర్య ప్రేలాపనలు సముద్రహోరులో వినిపించలేదప్పుడు !!
పెనుకారణాల ఆవిరులన్నీ అంబుదాలై,
వర్షించడానికి సన్నద్ధమై , ప్రశ్నల బిందువులు గుండె గోడల్ని తడిచేస్తున్నవి ! 
కన్నీటికావ్యాలలో ఆత్మసాక్షి పాదసూచికల ప్రథమ వాక్యమైంది!!

మరింత సాహిత్యం కోసం క్లిక్ చేయండి: https://telugu.asianetnews.com/literature