అలా వెనక్కి తిరుగుతామా!

ముక్కలు ముక్కలుగా
పోగు పడినపోయిన సంవత్సరాలు
భగ్గుమని దగ్ధమవుతాయి

ముండ్లై యేండ్లు
ముడ్డి మీది ముడుతల్లో దిగబడతాయి

శిరస్సు మీద
విఫల దుఃఖం ఒకటి వేలాడుతూ ఉంటుంది

దింపుకోవడం అసాధ్యమైన చోట
దింపుడు కళ్లం ఆశ ఒకటి మొలుస్తుంది

సందిగ్ధ వలయాలు చుట్టుముట్టి
తప్పించుకోలేని ఒంటరితనాన్ని
 ఎక్కుపెడుతుంది

శవం స్నానంచేసిన నీటి చారికల్లో
జ్ఞాపకాలు యింకి పోతాయి

పచ్చదనాన్ని కోల్పోయిన  జీవితాన్ని
ఎడారులు ఆక్రమిస్తాయి

దోసిట్లో నాలుగు కన్నీటి చుక్కల్ని పట్టుకొని
ఎవరూ మనకోసం నిలబడి లేరు
పద పద పోదాం!