Asianet News TeluguAsianet News Telugu

ఓ మైలురాయి: నిర్మాణానికి తొవ్వ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి 'వినిర్మాణం'

తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్లు గడుస్తున్నా సాహిత్యంలో వచ్చిన మార్పేమీ లేదు. ఈ ఆరున్నరేళ్ల కాలంలో తెలంగాణ సాహిత్య చరిత్రను నిర్మించే పని జరగలేదు. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వెలువరించిన వినిర్మాణం అందుకు దోహదపడుతుంది.

Kasula Pratap Reddy on Sunkireddy book on Telangana literature
Author
Hyderabad, First Published Sep 15, 2021, 8:54 AM IST

ప్రముఖ సాహిత్య విమర్శకుడు నారాయణ శర్మ ఇటీవల ఫేస్ బుక్ లో పెట్టిన ఓ రైటప్ నన్ను అమితంగా ఆకర్షించింది. డాక్టర్ సుంకిరెడ్డి నారాయణ రెడ్డి రాసిన వ్యాసాల సంపుటి వినిర్మాణం మీద ఆయన సంక్షిప్తంగానే అయినా చాలా ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఆరున్నరేళ్లు దాటింది. కానీ, తెలంగాణ సాహిత్య చరిత్ర నిర్మాణం జరగలేదు. దాన్నే గుర్తు చేస్తూ నారాయణ శర్మ ఆ రచన చేశారు. 

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా అత్యంత ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా యూనివర్శిటీ ఇంకా మడి కట్టుకునే కూర్చుంది. వరంగల్ లోని కాకతీయ విశ్వవిద్యాలయం తెలంగాణ సాహిత్యంపై విశేషమైన కృషి చేస్తూ వస్తోంది. ఇతర విశ్వవిద్యాలయాల నుంచి మనం గొప్పగా ఆశించేదేమీ ఉండదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి అస్తిత్వపు పాదముద్రలు వేసిన తర్వాత కూడా ఈ విశ్వవిద్యాలయాలేవీ తెలంగాణ సాహిత్య నిర్మాణానికి పూనుకోలేదు. సమగ్రమైన సాహిత్య చరిత్ర రచన ఇప్పటికీ జరగలేదు. 

ఆ విషయాన్నే నారాయణ శర్మ గుర్తు చేస్తూ సాహిత్య చరిత్ర నిర్మాణానికి అవసరమైన విషయాలను అందించడానికి కాసుల ప్రతాపరెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కె. శ్రీనివాస్, గుడిపాటి రచనలు ఇప్పటికే అచ్చులో అందుబాటులో ఉన్నాయని ఆయన రాశారు. ఇప్పుడు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వినిర్మాణం కూడా వచ్చిందని ఆయన చెప్పారు. 

సంగిశెట్టి, సుంకిరెడ్డి, కె. శ్రీనివాస్ అనుకున్నారో లేదో కానీ నేను మాత్రం వ్యాసాలు రాస్తున్నప్పుడు ఇంతటి విలువైన విషయాలను అందిస్తున్నట్లు అనుకోలేదు. ఎక్కడెక్కడో, ఎప్పుడెప్పుడో రాసిన వ్యాసాలను దారానికి పూలను గుచ్చి దండ అల్లినట్లు నేను తెలంగాణ సాహిత్యోద్యమాలు గ్రంథాన్ని సిద్ధం చేసి అచ్చేశాను. నా పుస్తకాన్ని, కె శ్రీనివాస్ గ్రంథాన్ని బి. నరసింగ రావు నేతృత్వంలోని తెలంగాణ ప్రచురణలు సంస్థ ప్రచురించింది. తాజాగా వెలువడిన సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వినిర్మాణం గ్రంథాన్ని కవిలె ప్రచురించింది. ఈ సంస్థకు కె. శ్రీనివాస్, సంగిశెట్టి ప్రాతినిధ్యం వహిస్తున్నారు తెలంగాణ ప్రచురణలు సంస్థతో పాటు కవిలె కూడా తెలంగాణ సాహిత్యానికి విలువైన రచనలను అందించాయి. 

ఇక అసలు విషయానికి వస్తే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వినిర్మాణం గ్రంథం ఇన్నాళ్లకైనా వెలుగు చూడడం సంతోషదాయకమైన విషయం. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ కాలంలో చాలా విషయాలను వెలుగులోకి తెచ్చి రచనలు చేశారు. ఆ రచనల్లో తెలంగాణ చరిత్ర, ముంగిలి తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కీకరారణ్యంలో దారి వేసిన రచనలు. 

ఆంధ్రప్రదేశ్ అవతరణ తర్వాత తెలంగాణను ఆంధ్ర సాహిత్యం ఉప్పెనలో ముంచెత్తింది. ఆ ఉప్పెనలో తెలంగాణ సాహిత్యం మరుగున పడిపోయింది. ఈ కాలంలో అంటే దాదాపు 60 ఏళ్ల పాటు ఉమ్మడి తెలుగు సాహిత్య చరిత్రను నిర్మించాలనే తపన ఎవరికీ లేకుండా పోయింది. తెలంగాణ సాహిత్యం తెలిసి కొంత, తెలియక కొంత వివక్షకు, విస్మరణకు గురైంది. తెలంగాణకు చెందిన ముదిగంటి సుజాతా రెడ్డి మాత్రమే తెలంగాణ సాహిత్య వికాసానికి సాహిత్య చరిత్రలో స్థానం కల్పించారు. ఈ విషయాన్ని సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తన గ్రంథంలో ప్రస్తావించారు. 

సుంకిరెడ్డి నారాయణ రెడ్డి విప్లవ సాహిత్యం ద్వారా చైతన్యం పొందిన కవి, రచయిత. అయితే, తర్వాతి కాలంలో ఆయన విప్లవ సాహిత్యోద్యమ పరిమితులను గుర్తించి, తోవ ఎక్కడ అనే కవితా సంకలనం వెలువరించారు. దాంతో ఆయన రచనను తోక ఎక్కడ అని ఎగతాళి చేసినవారున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమ కాలంలో ఆయన తెలంగాణ సాహిత్యాన్ని వెలికి తీసి రాస్తున్న క్రమంలో సుంకిరెడ్డికి తోవ దొరికిందా అనే వెకిలి ప్రశ్న వేస్తూ వచ్చినవారున్నారు. తెలంగాణ సాహిత్య మథించి, దాని విశిష్టతను, ప్రత్యేకతను గురించి వ్యాసాలు రాసే క్రమంలో మేం ఆంధ్ర సాహిత్య బేపారుల (సాహితీవేత్తలు కాదు) పదఘట్టనల కింద, తెలంగాణ సాహిత్య దళారుల చేతుల కింద నెత్తురోడినవాళ్లమే, నలిగిపోయినవాళ్లమే. 

వ్యక్తిగతంగానూ, ఉమ్మడిగానూ తీవ్రమైన పాలక వర్గ అణఛివేత, ఆంధ్ర సాహిత్య బేపారుల, తెలంగాణ సాహిత్య దళారుల దాడులను ఎదుర్కుని కూడా అకుంఠితంగా సాహిత్యంలో కృషి చేసినవాళ్లమే. ఆ దాడిని ఎక్కువగా అనుభవించినవారిలో సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కూడా ఉన్నారు. ఆ క్రమంలో రాసిన వ్యాసాలు చాలా వినిర్మాణం గ్రంథంలో ఉన్నాయి. వినిర్మాణం అనే గ్రంథంలోని వ్యాసాలు సాహిత్యపరంగా అత్యంత విలువైనవి మాత్రమే కాదు, ప్రత్యామ్నాయ రాజకీయలను మలుపు తిప్పినవి కూడా. 

తెలుగు సాహిత్యంలో అత్యధిక ప్రక్రియల్లో తొలి రనచలను చేసివారు తెలంగాణవారే అని చెప్పడానికి సుంకిరెడ్డి నారాయణ రెడ్డి విస్తృతమైన పరిశోధన, పరిశీలన చేశారు. తొలి స్మృతి కావ్యం ఏది, తొలి దళిత కవి దున్న ఇద్దాసు వంటి వ్యాసాలు ఇందులో ఉన్నాయి. తెలుగు తొలి కథా రచయిత్రి బండారు అచ్చమాంబ అని సంగిశెట్టి శ్రీనివాస్ రాసినట్లుగానే సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తెలుగు సాహితీ ప్రక్రియలు ఎక్కడెక్కడ తొలుత తెలంగాణవారి పాదముద్ర కనిపెట్టి రాశారు. కరుణశ్రీ పుష్పవిలాపం కన్నా ముందే అటువంటి రచన తెలంగాణ నుంచి వెలువడిందని ఆయన ప్రతిపాదించారు. అందుకు తగిన సాక్ష్యాధారాలను కూడా చూపించారు. అయినా తెలుగు సాహిత్య చరిత్ర నిర్మాతలు వాటిని ఇముడ్చుకోవడానికి ఇష్టపడలేదు. పాఠ్య పుస్తకాలను మార్చుకోవడానికి మొండికేస్తున్నారు. 

తెలంగాణ విమర్శకులు చేసిన ప్రతిపాదనలను వ్యతిరేకించడానికి కూడా సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వెనకడుగు వేయలేదు. తెలంగాణలో తొలి విమర్శకుడు, తొలి ఆధునిక విమర్శకుడి విషయంలో ఆయన లక్ష్మణ చక్రవర్తి ప్రతిపాదనను సోదాహరణంగా తిరస్కరించారు. తొలి ఆధునిక విమర్శకుడిగా సురవరం ప్రతాపరెడ్డిని నిలబెట్టారు. 

ఇక్కడొక ప్రధానమైన విషయాన్ని ప్రస్తావించాల్సి ఉంటుంది. విప్లవ సాహిత్యం తెలుగులో ఆధిపత్యం చేస్తున్న కాలం ఆ రాజకీయాలు తెలంగాణ యువత తెలంగాణ వైతాళికుల గుర్తించే స్థితిని కోల్పోయింది. తన చరిత్రను తాను మరుగున పడేసుకోవడానికి ఇది పనిచేసింది. దానివల్లనే సురవరం ప్రతాపరెడ్డి, గంగుల శాయిరెడ్డి వంటివారి రచనలను చదవకుండానే, వాటిని అధ్యయనం చేయకుండానే తిరస్కరించే మనస్తత్వాన్ని సంతరించుకుంది. వాటిని అన్నింటినీ తెలంగాణ మలిదశ ఉద్యమంలో తిరగదోడే పనిని తెలంగాణ సాహిత్యకారులు చేశారు. వారిలో సుంకిరెడ్డి ప్రధాన భూమిక పోషించారు. అందుకే ఆయన వినిర్మాణం గ్రంతంలో అత్యంత విలువైన వ్యాసాలు ఉన్నాయి. 

తొలి తెలంగాణ వైతాళికుడు రాజబహద్తూర్ వెంకటరామారెడ్డి అనే వ్యాసం రాయడానికి, మరుగునపడిన మాణిక్యం - మడివాళయ్య వంటి వ్యాసాలు రాయడానికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం వెసులుబాటు కల్పించింది. తెలంగాణ అనే మాటను పలికితే దాన్ని సంకుచితమైందిగా, పరిమితమైందిగా భావిస్తున్న క్రమంలో తెలంగాణ అనేది తెలుగు సాహిత్యంలో విస్తృతమైందని, అపరిమీతమైందని చాటిచెప్పే గుణాత్మక మార్పును తెలంగాణ సాహిత్యకారులు సంతరించిపెట్టారు. 

అన్ని పరిమితులను అధిగమించి విస్తృతి చెందడానికి తెలంగాణ సాహిత్యకారుల ఆలోచనా పరిధి పనిచేసింది. వారి రచనలు దాన్ని నిరూపించి పెట్టాయి. పడికట్టు పదాల మర్మాన్ని ఛేదించాయి. తెలంగాణ అనే పదం పరిమితిని దాటి విస్తృతి చెందడానికి తెలంగాణ సాహిత్యంలో జరిగిన కృషి అమేయమైంది. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి వినిర్మాణం గ్రంథాన్ని చదివితే తప్పకుండా అది అర్థమవుతోంది. 

మరోమాట, తెలంగాణ సాహిత్య విశిష్టతను, ప్రత్యేకతను విడమరిచి రాస్తూనే ఆంధ్ర సాహిత్యవేత్తల కృషిని మేమేం తక్కువ చేయలేదు. వారి గొప్పతనాన్ని కూడా గుర్తించి రాసినవాళ్లమే. కేశవరెడ్డి, శివసాగర్ వంటి సాహితీవేత్తల గురించి మాతో పాటు సుంకిరెడ్డి నారాయణ రెడ్డి కూడా రాశారు. అందువల్ల తెలుగు సాహిత్య విశ్లేషణలోనూ విమర్శలోనూ పరిశీలనలోనూ తెలంగాణ సాహిత్యకారులది విశాలమైన దృక్పథమే తప్ప సంకుచితమైంది కాదు. ఈ విషయాన్ని తెలంగాణేతరులు కూడా గుర్తించారు. అందుకే ఇప్పటికీ మేం వారి అభిమానాన్ని పొందుతున్నాం.

-కాసుల ప్రతాపరెడ్డి

Follow Us:
Download App:
  • android
  • ios